తూర్పు లద్దాఖ్‌లో జవాన్లకు హీట్‌ టెంట్లు!
close

తాజా వార్తలు

Updated : 18/11/2020 19:36 IST

తూర్పు లద్దాఖ్‌లో జవాన్లకు హీట్‌ టెంట్లు!

సరిహద్దుల్లో బలగాలకు వసతి సౌకర్యాలను పెంచిన సైన్యం

దిల్లీ: తూర్పు లద్దాఖ్‌లో అత్యంత కఠినమైన వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటూ విధులు నిర్వహిస్తున్న దేశ జవాన్లకు వసతి సదుపాయాలను మెరుగుపరిచింది భారత సైన్యం. జవాన్ల కోసం బెడ్లు, ప్రత్యేక కబోర్డులతో పాటు గదుల్లో విద్యుత్‌, నీటి సరఫరా, హీటర్లు వంటి సదుపాయాలను ఏర్పాటు చేసింది. ఆయుధాలు, ఇతర సైనిక సామగ్రిపై మంచు కప్పకుండా ఉండేందుకు ప్రత్యేక షెల్టర్లను నిర్మించింది. 

సముద్రమట్టానికి 17వేల అడుగుల ఎత్తులో ఉన్న లద్దాఖ్‌లో శీతాకాలంలో ఉష్ణోగ్రతలు సున్నా కంటే తక్కువకు పడిపోతాయి. నవంబరులో ఈ ప్రాంతంలో మైనస్‌ 30 నుంచి మైనస్‌ 40 డిగ్రీస్‌ వరకు ఉష్ణోగ్రత తగ్గుతుంది. బలమైన చలిగాలులు వీస్తుంటాయి. ఒక్కోసారి 40 అడుగుల మేర మంచు పేరుకుపోయి ఉంటుంది. ఇలాంటి కఠినమైన పరిస్థితుల్లో భారత జవాన్లు ఇక్కడ దేశ రక్షణ కోసం పహారా కాయడం పెను సవాలే. అలాంటి జవాన్ల కోసం వసతిని మెరుగుపరిచింది భారత సైన్యం. ‘శీతాకాలంలో బలగాల నిర్వహణ సామర్థ్యాన్ని పెంచేందుకు లద్దాఖ్‌ సెక్టార్‌లోని జవాన్లందరికీ వసతి సదుపాయాలను మెరుగుపర్చాం’ అని భారత సైన్యం ఓ ప్రకటనలో తెలిపింది. ఫ్రంట్‌లైన్‌లో విధులు నిర్వహించే బలగాల కోసం హీట్‌ టెంట్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. 

కాగా.. భారత్‌-చైనా మధ్య సరిహద్దు వివాదంతో ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో లద్ధాఖ్‌లో జవాన్లకు మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఏడాది మే నుంచి చైనా కవ్వింపు చర్యలతో నియంత్రణ రేఖ వద్ద ప్రతిష్టంభన నెలకొన్న విషయం తెలిసిందే. తాజా పరిణామాల నేపథ్యంలో లద్దాఖ్‌లో మరింతకాలం భారత బలగాల మోహరింపు కొనసాగే అవకాశాలు కన్పిస్తున్నాయి.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని