
తాజా వార్తలు
రెయిన్కోట్లు.. హెల్మెట్లే రక్షణ కవచాలు..
మన డాక్టర్ల దుస్థితి
న్యూదిల్లీ: భారత్‌లో వైద్యులను కరోనావైరస్ నుంచి రక్షించే దుస్తుల్లో కొంత కొరత నెలకొంది. ఈ నేపథ్యంలో సోమవారం ప్రభుత్వం దీనిపై స్పందిస్తూ దక్షిణ కొరియా లేదా చైనా నుంచి కొనుగోలు చేస్తామని పేర్కొంది. దిల్లీలో దాదాపు 12 మంది డాక్టర్లు సరైన రక్షణ కవచాలు లేవని ఆందోళన చెందుతున్నారు. తాము వైరస్‌కు వాహకులుగా మారతామేమో అని భయపడుతున్నారు.
మరోపక్క కోల్‌కతాలో బేల్‌ఘాట్ ఇన్ఫెక్షస్ డిసీజ్‌లో ఇద్దరు జూనియర్ డాక్టర్లకు రెయిన్ కోట్లు ఇచ్చి వాటిని ధరించి కరోనా పేషెంట్లను పరీక్షించాలని చెప్పినట్లు రాయిటార్స్ పేర్కొంది. తమ ప్రాణాలను పణంగా పెట్టి విధి నిర్వహణ చేయలేమని వారు వాపోయారు. దీనిపై స్పందించేందుకు ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ ఆసిస్ మన్నా నిరాకరించారు. హరియాణాలోని ఈఎస్ఐ ఆసుపత్రికి చెందిన డాక్టర్ సందీప్ గార్గ్ మాట్లాడుతూ ఎన్95 మాస్క్‌లు లేకపోవడంతో ఒక దశలో తాము మోటార్ సైకిల్ హెల్మెట్‌ను పెట్టుకోవాల్సి వచ్చిదని వెల్లడించారు.