
తాజా వార్తలు
శాస్త్రవేత్త హత్యకు ప్రతీకారం తీర్చుకుంటాం: ఇరాన్
టెహ్రాన్: ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య విభేదాలు మళ్లీ భగ్గుమన్నాయి. టెహ్రాన్‌కు చెందిన ప్రముఖ అణు శాస్త్రవేత్త మొసిన్ ఫక్రజాదే శుక్రవారం దారుణ హత్యకు గురయ్యారు. అయితే తమ శాస్త్రవేత్త హత్య వెనుక ఇజ్రాయెల్ హస్తముందని ఇరాన్ ఆరోపిస్తోంది. తాజాగా ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహనీ ఘటనపై తీవ్రంగా స్పందించారు. మొసిన్ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామంటూ ఇజ్రాయెల్‌కు పరోక్ష హెచ్చరిక చేశారు. ఓ ప్రభుత్వ సమావేశంలో రౌహనీ మాట్లాడుతూ.. ‘మొసిన్ హత్యతో మా అణ్వాయుధ కార్యక్రమాన్ని ఎవరూ ఆపలేరు. శాస్త్రవేత్త హత్యకు సరైన సమయంలో ప్రతిస్పందిస్తాం’ అని చెప్పారు.
ఇరాన్ అణుపితామహుడిగా పిలిచే మొసిన్ ఫక్రజాదేపై టెహ్రాన్ శివారులోని అబ్సాద్ గ్రామంలో శుక్రవారం దాడి జరిగింది. ఇందులో ఆయన తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో మరణించారని ఇరాన్ పేర్కొంది. ఫక్రజాదే ఇరాన్ ‘అమద్’ అణ్వాయుధ కార్యక్రమానికి నాయకత్వం వహించారు. ఇరాన్ రహస్య అణ్వాయుధ కార్యక్రమం వెనుక ఫక్రజాదే నాయకత్వం వహిస్తున్నారని పాశ్చాత్య దేశాలు భావిస్తున్నాయి. 2018లో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజిమిన్ నెతన్యాహు కూడా ఫక్రజాదే పేరును ప్రస్తావించారు. ఇతని పేరును భవిష్యత్తులో కూడా వింటామని చెప్పారు. ఫక్రజాదే వార్తల్లో పెద్దగా కనిపించరు. 2018 వరకు ఆయన ఎలా ఉంటారో కూడా చాలా మందికి తెలియదు. రహస్యంగా పనిచేస్తారని పేరుంది. 1990 నుంచి ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమంలో ఉన్నారు. ప్రస్తుతం ఫక్రజాదే ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారని అమెరికా, తదితర దేశాలు భావిస్తున్నాయి. ఇరాన్ రివల్యూషనరీ గార్డులో కూడా మొసిన్ సభ్యుడు. ఇరాన్ మాత్రం వీటిని ఖండిస్తూ వచ్చింది. యూనివర్సిటీలో విద్యార్థులకు భౌతిక శాస్త్ర పాఠాలు భోదించే ప్రొఫెసర్ అని మాత్రమే చెబుతూ వచ్చింది. ఫక్రజాదేపై దాడిలో ఐదుగురు పాల్గొన్నారని.. వారు ఆయన ప్రయాణిస్తున్న కారుపై విచక్షణరహితంగా కాల్పులు జరిపారని తెలుస్తోంది. సంఘటనలో ఫక్రజాదే అంగరక్షకులు కూడా గాయపడ్డారు.
ఇజ్రాయెల్‌పై ఆరోపణలు..
తమ శాస్త్రవేత్త హత్య వెనుక ఇజ్రాయెల్ హస్తముందని ఇరాన్ విదేశాంగమంత్రి జావెద్ జారిఫ్ ఆరోపించారు. ‘‘ఉగ్రవాదులు.. ఇరాన్ శాస్త్రవేత్తను దారుణంగా హత్య చేశారు. ఈ పిరికిపంద చర్యలో ఇజ్రాయెల్ హస్తం ఉంది’’ అని జావెద్ జారిఫ్ ట్వీట్ చేశారు. ఇరాన్ అణుశాస్త్రవేత్తల హత్యల్లో ఇజ్రాయెల్‌పై ఆరోపణలు రావడం ఇదే తొలిసారి కాదు. పదేళ్ల క్రితం నవంబర్లోనే ఇరాన్ అణు శాస్త్రవేత్త మాజిద్ షహర్యారి హత్యకు గురయ్యారు. 2010 నుంచి 2012 మధ్య నలుగురు ఇరాన్ అణుశాస్త్రవేత్తలు హ్యతకు గురయ్యారు. వీరి మరణాల వెనుక ఇజ్రాయెల్ నిఘా సంస్థ ‘మొసాద్’ హస్తం ఉందని ఇరాన్ నమ్ముతోంది. ‘ఫక్రజాదే హత్య ఇరాన్‌కు పెద్ద ఎదురుదెబ్బ’ అంటూ ఇజ్రాయెల్ జర్నలిస్టు యోసిమెల్మన్ ట్వీటు చేశారు. దాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రీట్వీట్ చేయడం గమనార్హం.