close

తాజా వార్తలు

‘నీ జీవిత కథ ఓ మిరాకిల్‌’

మోషేకు హృదయపూర్వక సందేశం పంపిన ప్రధాని

జెరూసలెం: మోషే హోల్ట్జ్‌బర్గ్‌ గుర్తున్నాడా..! ముంబయిలో ఉగ్రవాదులు సృష్టించిన మారణకాండలో రెండేళ్ల వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయి ప్రాణాలతో బయటపడిన ఈ చిన్నారి జీవితం భారత ప్రధాని నరేంద్రమోదీని ఎంతగానో కదిలించింది. అందుకే ఆ చిన్నారికి స్వయంగా లేఖ రాశారు. మోషే జీవిత కథ ఓ మిరాకిల్‌ అని.. ఎంతోమందికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. 

మోషే ఇటీవల 13వ పుట్టినరోజు జరుపుకొన్నాడు. ఇజ్రాయెల్‌ యూదుల సంప్రదాయం ప్రకారం.. ఆ వయసు అబ్బాయిలకు 13వ ఏట బార్‌ మిత్జ్వా నిర్వహిస్తారు. మనకు ఉపనయనం ఎలాంటిదో.. యూదులకు ఇది అలాంటిదే. మోషే బార్‌ మిత్జ్వా సందర్భంగా ప్రధాని మోదీ ఆ చిన్నారికి ప్రత్యేకంగా సందేశం పంపారు. ఇజ్రాయెల్‌లోని భారత దౌత్య సిబ్బంది స్వయంగా ఆ కార్యక్రమానికి వెళ్లి ప్రధాని రాసిన లేఖను మోషేకు అందించారు. 

‘మోషే.. నీ జీవిత ప్రయాణంలో ఇప్పుడు నువ్వు కీలక దశకు చేరుకున్నావు. నువ్వు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండేలా.. అనేక విజయాలు సాధించేలా ఆయా శాండ్రా శామ్యూల్‌ ధైర్యం, భారత ప్రజల ఆశీస్సులు నీకెప్పుడూ ఉంటాయి. నీ కథ ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. నీ గతంలో చోటుచేసుకున్న విషాదం నుంచి బయటపడి కొత్త జీవితం ప్రారంభించాలని ప్రార్థిస్తున్నా. రెండేళ్ల క్రితం నిన్ను కలిసినప్పుడు చాలా ఆనందంగా అన్పించింది. చాబాద్‌ హౌస్‌ డైరెక్టర్‌గా ముంబయికి తిరిగిరావాలనే నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది’ అని మోదీ లేఖలో రాసుకొచ్చారు. మోదీ సందేశం విని మోషే కూడా ఎంతో ఉద్వేగానికి గురయ్యాడట. భారత ప్రధాని మాటలు తన మనవడిని ఎంతో ప్రభావితం చేశాయని, జీవితం పట్ల ధైర్యాన్ని ఇచ్చాయని చిన్నారి తాతయ్య రబ్బీ షిమోన్‌ రోసెన్‌బర్గ్‌ తెలిపారు. 

2008 నవంబరు 26న ముంబయిలో పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాదులు మారణహోమం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లోనే మోషే తన తల్లిదండ్రులను కోల్పోయాడు. ముంబయిలోని నారిమన్‌ హౌస్‌లోకి ఉగ్రవాదులు చొరబడి 9 మందిని అతిదారుణంగా చంపేశారు. వీరిలో రబ్బీ గాబ్రియెల్‌, గర్భిణి అయిన ఆయన భార్య రివికా, ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. రబ్బీ మరో కుమారుడైన మోషేను వారింట్లో పనిచేసే ఆయా శాండ్రా శామ్యూల్‌ ప్రాణాలకు తెగించి రక్షించారు. ఆ తర్వాత చిన్నారిని ఇజ్రాయెల్‌లోని తన బామ్మా తాతయ్యల వద్దకు చేర్చి శాండ్రా కూడా అక్కడే స్థిరపడింది. 

మోషే గురించి తెలుసుకున్న ప్రధాని మోదీ 2017లో ఇజ్రాయెల్‌ పర్యటన సందర్భంగా ఆ చిన్నారిని కలిశారు. ఆ తర్వాతి ఏడాది ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతాన్యహుతో కలిసి మోషే భారత్‌కు వచ్చాడు. ప్రాణాలను ఫణంగా పెట్టి మోషేను కాపాడినందుకు గానూ.. ఆయా శాండ్రాను ఇజ్రాయెల్‌ ప్రభుత్వం గౌరవ పౌరసత్వంతో సత్కరించింది. 


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.