close

తాజా వార్తలు

‘పౌరసత్వం’పై ఆగ్రహం.. దిల్లీలో రణరంగం

హస్తినలో విద్యార్థుల ర్యాలీ.. అడ్డుకున్న పోలీసులు 

అరుణాచల్‌లో పరీక్షల బహిష్కరణ

బెంగాల్‌లో రైల్వే స్టేషన్‌కు నిప్పు

దిల్లీ/ఇటానగర్‌: పౌరసత్వ సవరణ చట్టంపై విద్యార్థిలోకం భగ్గుమంది. శుక్రవారం దిల్లీతో పాటు పలు ఈశాన్య రాష్ట్రాల్లో నిరసనలు తీవ్ర రూపం దాల్చాయి. దిల్లీలోని జామియా మిల్లియా ఇస్లామియా (జేఎంఐ) విశ్వవిద్యాలయం విద్యార్థులు ఈ వివాదాస్పద చట్టంపై చేపట్టిన నిరసన ప్రదర్శన ఉద్రిక్తతకు దారితీసింది. పార్లమెంట్‌ భవనం వద్దకు దాదాపు 2వేల మంది విద్యార్థులు భారీ ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించగా.. వారిని పోలీసులు అడ్డుకున్నారు. వర్సిటీ వద్ద విద్యార్థులు బయటకు రాకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేయగా.. వాటిని విరగ్గొట్టుకుంటూ విద్యార్థులు ముందుకు సాగారు. శాంతియుతంగా నిరసన చేపడుతున్న తమను అడ్డుకోవడం భావ్యంకాదంటూ పోలీసులను ప్రశ్నించారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వెనక్కి వెళ్లిపోవాలని పోలీసులు చెప్పినా విద్యార్థులు వినకపోడంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు భాష్పవాయువు ప్రయోగించారు. ఈ క్రమంలో విద్యార్థులు రాళ్లు రువ్వడంతో వర్సిటీ వద్ద పరిస్థితి రణరంగంగా మారింది. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులకు గాయాలయ్యాయి. ఈ సందర్భంగా పోలీసులు 50 మంది విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల సూచన మేరకు దిల్లీ మెట్రో అధికారులు పటేల్ చౌక్‌, జన్‌పథ్‌ మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేశారు. 

పోలీసులే తొలి లాఠీఛార్జి చేశారు: వర్సిటీ విద్యార్థులు
‘మేం శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తుంటే పోలీసులే అడ్డుకున్నారు. మమ్మల్ని వెనక్కి వెళ్లిపోవాలంటూ పోలీసులు లాఠీఛార్జి చేశారు. ఆ తర్వాత వాళ్లు రాళ్లురువ్వడంతో విద్యార్థులు కూడా రాళ్లు విసిరారు’’ అని ఓ విద్యార్థి తెలిపాడు. పోలీసులు రాళ్లు విసిరి, భాష్పవాయువు ప్రయోగించడంతో అనేకమంది విద్యార్థులు గాయపడినట్టు మరో విద్యార్థి తెలిపాడు. 

ఆ ఆరోపణలు నిరాధారం: దిల్లీ పోలీసులు  
‘విద్యార్థుల ర్యాలీని అడ్డుకొనేందుకు మేం బారికేడ్లను ఏర్పాటు చేశాం. వాటిని విరగ్గొట్టుకొని వాటిపై నుంచి దూకి మరీ ముందుకు దూసుకొచ్చారు. ఆ క్రమంలో విద్యార్థులే మాపై రాళ్లు విసిరారు. అప్పుడే విద్యార్థుల్ని చెదరగొట్టేందుకు మేం భాష్పవాయువు ప్రయోగించాల్సి వచ్చింది. కొంతమంది విద్యార్థుల్ని అరెస్టు చేసి బాదర్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించాం’’ అని ఓ పోలీస్‌ ఉన్నతాధికారి వెల్లడించారు. 

అరుణాచల్‌లో పరీక్షలు బహిష్కరించిన విద్యార్థులు 
మరోవైపు అరుణాచల్‌ ప్రదేశ్‌లోని పలు విద్యార్థి సంఘాల నేతృత్వంలో విద్యార్థులు పరీక్షలను బహిష్కరించారు. తక్షణమే పౌరసత్వ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని నినాదాలు చేస్తూ వేలాది మంది విద్యార్థులు, నిరసనకారులు రోడ్లపైకి వచ్చారు. రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం నేతృత్వంలో విద్యార్థులు రాజ్‌భవన్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. వీరికి పలువురు అస్సామీయులు కూడా మద్దతు తెలిపారు. భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ రాజ్‌భవన్‌కు చేరారు. అనంతరం గవర్నర్‌ బీడీ మిశ్రాకు వినతిపత్రం సమర్పించారు. తమ రాష్ట్రంలో పౌరసత్వ చట్టాన్ని అమలు చేయవద్దని విద్యార్థులు కోరారు. అనంతరం ఆందోళనకారులు మాట్లాడుతూ.. పార్లమెంట్‌లో ఆమోదించిన పౌరసత్వ సవరణ చట్టాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని, దాన్ని తక్షణమే రద్దుచేయాలని డిమాండ్‌ చేశారు. ఈ చట్టం తమ ప్రాంతాన్ని మతపరంగా విభజన తీసుకొస్తుందని.. స్థానిక ప్రజల ఉనికిని దెబ్బతీసేలా ఉందని విమర్శించారు. 

బెంగాల్‌లో చెలరేగిన హింస
మరోవైపు, పౌరసత్వ సవరణ చట్టంపై బెంగాల్‌లోనూ నిరసనలు తీవ్ర రూపం దాల్చాయి. వేలాది మంది ఆందోళనకారులు బంగ్లాదేశ్‌ సరిహద్దులోని ముర్షిదాబాద్‌ జిల్లాలోని బెల్దంగా రైల్వే స్టేషన్‌లోకి ప్రవేశించి నిప్పు పెట్టారు. అక్కడి సీఆర్‌పీఎఫ్‌ సిబ్బందిపైనా దాడి చేశారు.

ఫొటో గ్యాలరీ కోసం క్లిక్‌ చేయండి

 



Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.