
తాజా వార్తలు
దిల్లీ ప్రజలారా..రైతులకు సహకరించండి
దిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని దిల్లీ శివారుల్లోని సింఘు, టిక్రి రహదారుల వద్ద బైఠాయించిన రైతులకు దిల్లీ వాసులు సహాయం చేయాలని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అభ్యర్థించారు. అలాగే సాధ్యమైనంత త్వరగా వారితో చర్చలు జరపాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ రోజు గురునానక్ జయంతి సందర్భంగా సిక్కులకు వీడియో సందేశం ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు.
‘దేశ రాజధానిలో నిరసన వ్యక్తం చేస్తోన్న రైతుల కోసం దిల్లీ ప్రజలు సాధ్యమైనంతవరకు తమ వంతు సాయం చేయాలని కోరుతున్నా. కేంద్రం వీలైనంత త్వరగా రైతులతో చర్చలు జరిపి వారి డిమాండ్లకు అంగీకరిస్తుందని నేను ఆశిస్తున్నాను. ఈ చలి వాతావరణంలో వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆప్ ఎమ్మెల్యేలు, సభ్యులు, వాలంటీర్లు రైతులకు ఆహారం, వైద్య సహాయం, నీరు ఇలా ఏదోరకంగా సహాయం చేస్తున్నారు’ అని కేజ్రీవాల్ వెల్లడించారు.
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్, హరియాణా, తదితర రాష్ట్రాలకు చెందిన రైతులు గత ఐదు రోజులుగా ‘చలో దిల్లీ’ ఆందోళనలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో రైతు సంఘాల నాయకులతో కేంద్రం చర్చలు జరిపే అవకాశం కనిపిస్తోంది.