‘శబరిమల’పై సుప్రీంకు కేరళ ప్రభుత్వం

తాజా వార్తలు

Updated : 24/12/2020 14:13 IST

‘శబరిమల’పై సుప్రీంకు కేరళ ప్రభుత్వం

దిల్లీ: కేరళలోని శబరిమల ఆలయానికి రోజువారీ భక్తుల సంఖ్యను పెంచుతూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. భక్తుల సంఖ్యను పెంచడం వల్ల పోలీసులు, ఆరోగ్య సిబ్బందిపై పెనుభారం పడుతుందని కేరళ ప్రభుత్వం న్యాయస్థానానికి తెలిపింది. 

కొవిడ్‌ పరిస్థితుల దృష్ట్యా శబరిమలలో భక్తులరాకపై పరిమితులు విధించిన విషయం తెలిసిందే. ‘మండల పూజ’ సీజన్‌ అయిన డిసెంబరు 20 నుంచి జనవరి 14 మధ్య భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశమున్న నేపథ్యంలో కేరళ ప్రభుత్వం ఇటీవల ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ విస్తృత అంశాలను పరిగణనలోకి తీసుకుని భక్తుల సంఖ్యపై పరిమితి విధించింది. దీని ప్రకారం.. ప్రస్తుతం సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజుకు 2వేల మందిని అనుమతిస్తుండగా.. శని, ఆదివారాల్లో మాత్రం రోజుకు 3 వేల మంది భక్తుల దర్శనానికి అనుమతిస్తున్నారు. అయితే, దీనిపై కొందరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. 

ఈ పిటిషన్లపై విచారణ జరిపిన కేరళ ఉన్నత న్యాయస్థానం.. రోజువారీ భక్తుల సంఖ్యను 5వేలకు పెంచింది. హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నేడు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఎలాంటి ప్రాథమిక నివేదికలను పరిగణనలోకి తీసుకోకుండానే హైకోర్టు భక్తుల సంఖ్యను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిందని పిటిషన్‌లో ఆరోపించింది. ప్రస్తుత పరిస్థితుల్లో భక్తుల సంఖ్యను పెంచడం వల్ల పోలీసులు, ఆరోగ్య సిబ్బందిపై పెను భారం పడనుందని, భక్తులను నియంత్రించడం కూడా కష్టమవుతుందని తెలిపింది. హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరింది. కాగా.. శబరిమల వెళ్లే యాత్రికులకు ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు కొవిడ్‌ నెగటివ్‌ రిపోర్టు తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే.

ఇవీ చదవండి..

శబరిమల: ఇక నిత్యం 5వేల మందికి దర్శనం! 

శబరిమల వెళ్తే.. కరోనా పరీక్ష తప్పనిసరిTags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని