కేరళలో కరోనా విలయం: సెక్షన్-144‌ విధింపు!

తాజా వార్తలు

Published : 03/10/2020 01:20 IST

కేరళలో కరోనా విలయం: సెక్షన్-144‌ విధింపు!

రోజువారీ కేసులు రికార్డు స్థాయిలో నమోదు

తిరువనంతపురం: దేశంలో కరోనా తీవ్రత ప్రారంభమైన సమయంలో కేరళ మాత్రం వైరస్‌ వ్యాప్తిని నియంత్రించగలిగింది. ఆ సమయంలో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలనుంచే కాకుండా అంతర్జాతీయంగా ప్రశంసలు పొందింది. కానీ, ప్రస్తుతం అక్కడ పరిస్థితి అదుపుతప్పినట్లు కనిపిస్తోంది. కానీ గత కొంతకాలంగా అక్కడ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. గడిచిన 24గంటల్లోనే రికార్డుస్థాయిలో 9వేల కేసులు నమోదయ్యాయి. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం వైరస్‌ తీవ్రత ఉన్న ప్రాంతాల్లో సెక్షన్‌ 144(CrPC)అమలు చేయాలని జిల్లా కలెక్టర్లకు సూచించింది. తొలుత తిరువనంతపురం జిల్లాలో రేపటి నుంచి నెల రోజుల పాటు ఈ ఆదేశాలు అమలుకానున్నాయి.

ఆగస్టు నెల వరకు రోజువారీ కేసుల సంఖ్య మిగతా రాష్ట్రాల కంటే తక్కువగానే నమోదైంది. కానీ గత వారం రోజులుగా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగింది. తాజాగా శుక్రవారం ఒక్కరోజే రికార్డుస్థాయిలో 9258 కేసులు బయటపడ్డాయి. వీరిలో 8200 మందిని కాంటాక్టు ట్రేసింగ్‌ ద్వారా గుర్తించగలిగామని రాష్ట్రప్రభుత్వం పేర్కొంది. కేంద్ర ఆరోగ్యశాఖ నివేదిక ప్రకారం, ఇప్పటివరకు కేరళలో 2లక్షల 12వేల పాజిటివ్‌ కేసులు నమోదుకాగా వీరిలో ఇప్పటికే లక్షా 30వేల మంది కోలుకున్నారు. ఇప్పటివరకు మొత్తం 791 మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు. ఇక కొవిడ్‌ టెస్టులు చేసుకున్న ప్రతి 100 మందిలో 13మందికి పాజిటివ్‌గా తేలుతోంది.

దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం వైరస్‌ వ్యాప్తి నియంత్రణ చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా సెక్షన్‌-144ను అమలుచేయాలని రాష్ట్ర ముఖ్యకార్యదర్శి విశ్వాస్‌ మెహతా జిల్లా కలెక్టర్లకు సూచించారు. ముఖ్యంగా కంటెయిన్‌మెంట్‌ ప్రాంతాలతోపాటు వైరస్‌ తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు కచ్చితంగా అమలుచేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ సూచనల మేరకు తిరువనంతపురంలో అక్టోబర్‌ 3నుంచి సెక్షన్‌-144ను అమలుచేస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ ప్రకటించారు. దీంతో ఐదుగురు కంటే ఎక్కువ మంది ఒకేచోట గుంపుగా ఉండకూడదు. అయితే, కార్యాలయాలకు వెళ్లేవారికి, మార్కెట్లకు మినహాయింపు ఇవ్వడంతోపాటు వివాహాలు, అంత్యక్రియలకు కేంద్రప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అనుమతి ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని