Narada Case: నారదా కేసులో నవ్వుల పాలయ్యాం 

తాజా వార్తలు

Updated : 29/05/2021 11:08 IST

Narada Case: నారదా కేసులో నవ్వుల పాలయ్యాం 

హైకోర్టు నిర్ణయాలపై న్యాయమూర్తి అసంతృప్తి

తోటి జడ్జీలకు లేఖ

కోల్‌కతా: నారదా కుంభకోణం కేసులో కోల్‌కతా హైకోర్టు వ్యవహరించిన తీరుపై సాక్షాత్తూ ఓ న్యాయమూర్తే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం న్యాయవర్గాలను దిగ్భ్రమ కలిగించింది. ఈ కేసులో నిందితులకు బెయిల్‌ మంజూరు చేసే విషయమై అయిదుగురు సభ్యుల ధర్మాసనాన్ని ఏర్పాటు చేయడాన్ని కూడా తప్పుపట్టారు. ఇలా చేయడం ద్వారా నవ్వుల పాలయ్యామని అభిప్రాయపడుతూ న్యాయమూర్తి జస్టిస్‌ అరిందమ్‌ సిన్హా తోటి న్యాయమూర్తులకు లేఖ రాశారు. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాజేశ్‌ బిందాల్‌తో పాటు, మిగిలిన న్యాయమూర్తులు అందరికీ దీన్ని పంపించారు. ఈ కుంభకోణంలో ఇద్దరు రాష్ట్రమంత్రులు, ఒక తృణమూల్‌ ఎమ్మెల్యే, కోల్‌కతా మాజీ మేయర్‌ను ఈ నెల 17న సీబీఐ అరెస్టు చేసింది. వారికి అదే రోజు సాయంత్రం సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేసింది. దీనిని సవాలు చేస్తూ సీబీఐ...హైకోర్టుకు ఈ-మెయిల్‌ పంపించింది. ఆ రోజు జరిగిన సంఘటనలను ఉదహరిస్తూ బెయిల్‌ను రద్దు చేయాలని కోరింది. అరెస్టులకు నిరసనగా సాక్షాత్తూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సీబీఐ కార్యాలయానికి వెళ్లి ఉదయం నుంచి సాయంత్రం వరకు ధర్నా చేశారు. తృణమూల్‌ శ్రేణులు ఆ కార్యాలయం బయట ఆందోళన చేశాయి. న్యాయశాఖ మంత్రి బాంబు తీసుకొని కోర్టుకు వచ్చారని సీబీఐ ఆరోపించింది. అందువల్ల బెయిల్‌ను రద్దు చేయాలని కోరింది. దీన్ని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాజేశ్‌ బిందాల్, న్యాయమూర్తి జస్టిస్‌ అర్జీత్‌ బెనర్జీలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణకు చేపట్టింది. ఆ రోజున ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరుసటి రోజున జరిగిన విచారణలో బెయిల్‌ మంజూరుకు అనుకూలంగా జస్టిస్‌ బెనర్జీ తీర్పు ఇచ్చారు. జస్టిస్‌ బిందాల్‌ మాత్రం బెయిల్‌ ఇవ్వాల్సిన పనిలేదని పేర్కొన్నారు. భిన్నాభిప్రాయాలు రావడంతో నిందితులను గృహ నిర్బంధంలోకి పంపించారు. కేసు విచారణకు అయిదుగురు న్యాయమూర్తుల ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు. ఈ మొత్తం వ్యవహారంపైనే జస్టిస్‌ అరిందమ్‌ సిన్హా తప్పుపట్టి లేఖ రాశారు.

సీబీఐ చేసిన వినతిని తొలుత ఏక సభ్య ధర్మాసనానికి అప్పగించే ఉంటే బాగుండేదని జస్టిస్‌ సిన్హా తన లేఖలో అభిప్రాయపడ్డారు. ద్విసభ్య ధర్మాసనానికి కేసును పంపించడమే తప్పని పేర్కొన్నారు. ‘‘రాజ్యాంగానికి సంబంధించిన అంశాలు పెద్దగా లేనందువల్ల దీన్ని రిట్‌ పిటిషన్‌గా పరిగణించాల్సిన అవసరం లేదు. అరెస్టులకు నిరసనగా ఆందోళనలు జరిగాయన్నదే విచారణకు తీసుకోవాల్సిన విషయం. దీనిపైనే విచారణ జరిగి ఉంటే బాగుండేది. ఇద్దరు న్యాయమూర్తుల మధ్య భిన్నాభిప్రాయాలు వచ్చినప్పుడు దాన్ని మూడో జడ్జి అభిప్రాయాన్ని స్వీకరించి ఉంటే సరిపోయేది’’ అని పేర్కొన్నారు. ఇలాంటి అనవసర చర్యలవల్లనే నవ్వుల పాలయినట్టు అభిప్రాయపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో న్యాయస్థానం ప్రతిష్ఠను కాపాడే విషయమై చర్చించడానికి అవసరమైతే అందరు న్యాయమూర్తులతో కూడిన ఫుల్‌కోర్టును నిర్వహించాలని కోరారు. 

తాత్కాలిక  బెయిల్‌ మంజూరు

ఈ కేసులో ప్రస్తుతం గృహ నిర్బంధంలో ఉన్న నలుగురు నిందితులకు తాత్కాలిక బెయిల్‌ మంజూరు చేస్తూ శుక్రవారం అయిదుగురు సభ్యుల ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. రూ.2 లక్షల వంతున పూచీకత్తు చెల్లించాలని, ఈ కేసుపై మీడియాతో మాట్లాడకూడదని, విచారణ అధికారులు కోరినప్పుడు వారితో వర్చువల్‌ విధానంలో మాట్లాడాలని షరతులు విధించింది. మంత్రులు సుబ్రతా ముఖర్జీ, ఫిర్హద్‌ హకీం, ఎమ్మెల్యే మదన్‌ మిత్ర, కోల్‌కతా మాజీ మేయర్‌ సోవన్‌ ఛటర్జీలకు ఈ ఊరట లభించింది. ఈ ధర్మాసనంలో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాజేశ్‌ బిందాల్, జస్టిస్‌ ఐ.పి.ముఖర్జీ, జస్టిస్‌ హరీష్‌ టాండన్, జస్టిస్‌ సౌమెన్‌ సేన్, జస్టిస్‌ అర్జీత్‌ బెనర్జీలు సభ్యులుగా ఉన్నారు. సీబీఐ తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపిస్తూ నిందితులు పలుకుబడి కలవారని, సాక్ష్యాలను తారుమారు చేస్తారని చెప్పారు. ప్రజలతో ఆందోళనలు కూడా చేయించే అవకాశం ఉందని, అందువల్ల బెయిల్‌ మంజూరు చేయకూడదని కోరారు. అయితే ఈ వాదనతో కోర్టు అంగీకరించలేదు.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని