చైనాకు మరోసారి కరోనా ముప్పు?

తాజా వార్తలు

Published : 18/05/2020 00:52 IST

చైనాకు మరోసారి కరోనా ముప్పు?

హెచ్చరిస్తున్న నిపుణులు

బీజింగ్‌: కరోనా వైరస్‌కు కేంద్ర బిందువైన చైనాలో వైరస్‌ తీవ్రత తగ్గుముఖం పట్టిందని అక్కడి ప్రభుత్వ నివేదికలు వెల్లడిస్తున్నాయి. కానీ, గతకొన్ని రోజులుగా అక్కడ మళ్లీ కొవిడ్‌-19 కేసులు బయటపడుతున్నాయి. ఈ సందర్భంలో కరోనా మహమ్మారి నుంచి చైనా ఇంకా బయటపడలేదని అక్కడి నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కరోనాను ఎదుర్కొనే రోగనిరోధక శక్తి చైనీయుల్లో లేని కారణంగా చైనాకు ఈ వైరస్‌ ముప్పు మరోసారి పొంచివుందని తాజాగా చైనా ప్రభుత్వ సీనియర్‌ ఆరోగ్య సలహాదారుడు హెచ్చరించారు.

గత కొన్ని వారాలుగా వుహాన్‌తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో కొత్తగా కేసులు బయటపడుతున్నాయి. తక్కువ రోగనిరోధక శక్తి కారణంగా చైనీయులు కొవిడ్‌-19 బారినపడే అవకాశాలు ఎక్కువ ఉన్నట్లు చైనాలోని ప్రముఖ వైద్య నిపుణులు డా.జోంగ్‌ నాన్‌షాన్‌ వెల్లడించారు. కరోనా వైరస్‌ విజృంభిస్తోన్న తొలి రోజుల్లో కూడా దీనికి సంబంధించిన సమాచారాన్ని అధికారులు బహిరంగ పరచలేదని స్పష్టం చేశారు. వైరస్‌ విస్తృతి ఎక్కువగా ఉన్నప్పటికీ అధికారులు తీవ్రతను తక్కువగా చూపించారని అన్నారు. ఈ సమయంలో పక్కా సమాచారంపై అధికారులను ప్రశ్నించగా నమ్మశక్యంకాని సమాచారాన్ని వారు అందజేశారని జోంగ్‌ అన్నారు. ప్రస్తుతం చైనా అతిపెద్ద సవాల్‌ ఎదుర్కొంటోందని.. విదేశాలతో పోలిస్తే ఇది మరింత ఎక్కువ ఉండే అవకాశం ఉందన్నారు. ప్రముఖ అంతర్జాతీయ వార్తా ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జోంగ్‌ తన అభిప్రాయాలను వెల్లడించారు. చైనాలో రెండవసారి ముంచుకొస్తున్న ప్రమాద సమయంలో చైనా అధికారులు సంతృప్తి పొందుతూ నిర్లక్ష్యంగా ఉండకూడదని హెచ్చరించారు.

2003లో వచ్చిన సార్స్‌ మహమ్మారిని ఎదుర్కోవడంలో డా.జోంగ్‌ చేసిన కృషికి అతన్ని సార్స్‌ హీరోగా అభివర్ణిస్తుంటారు. ప్రస్తుతం కరోనా వైరస్‌ పోరులో భాగంగా చైనా ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అంతేకాకుండా కొవిడ్‌-19 మానవుల మధ్య సంక్రమిస్తుందని మొట్టమొదటిసారిగా జనవరిలో చైనా అధికారిక మీడియాలో ప్రకటించారు.

ఇదిలా ఉంటే, చైనా అధికారిక లెక్కల ప్రకారం, చైనాలో దాదాపు 82వేల మంది కరోనా వైరస్‌ బారినపడగా 4633మంది మృత్యువాతపడ్డారు. తాజాగా నిన్న కొత్తగా ఆరు పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇప్పటివరకు బయటిప్రాంతాల నుంచి వచ్చిన 1698మందికి వైరస్‌ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ సందర్భంలో తాజాగా అక్కడి పాఠశాలలు, విమాన సేవలు ప్రారంభమయ్యాయి. పరిస్థితులు సాధారణ స్థాయికి వస్తున్నాయని భావిస్తున్న నేపథ్యంలో కొత్తగా కేసులు నమోదవుతుండడంలో నిపుణులు మరిన్ని హెచ్చరికలు చేస్తున్నారు. ఈ సందర్భంలో వైరస్‌ సోకిన వారిని గుర్తించేందుకు భారీ స్థాయిలో కొవిడ్‌-19 నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తోంది చైనా ప్రభుత్వం.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని