దృఢంగా మారుదాం..బలంగా ఎదుర్కొందాం
close

తాజా వార్తలు

Updated : 18/05/2021 11:28 IST

దృఢంగా మారుదాం..బలంగా ఎదుర్కొందాం

ఆహారం, నిద్ర, వ్యాయామంతో రోగనిరోధకశక్తి

ఈనాడు, హైదరాబాద్‌: ఊబకాయులు కరోనా బారినపడితే ఎక్కువ ఆక్సిజన్‌ అవసరమవుతుందని మడాక్‌ చిల్డ్రన్‌ ఇన్‌స్టిట్యూట్, క్వీన్స్‌లాండ్‌ యూనివర్సిటీ సంయుక్త అధ్యయనంలో గుర్తించారు.

మహమ్మారిని తట్టుకొనేందుకు వ్యాయామానికి మించిన మార్గం లేదంటోంది యూనివర్సిటీ ఆఫ్‌ క్యాలిఫోర్నియా అధ్యయనం. శారీరక శ్రమకు దూరమై, కుర్చీకే అంకితమైన వారితో పోల్చితే వ్యాయామం, ఏరోబిక్స్‌ చేసేవారిలో రోగనిరోధకశక్తి మెరుగ్గా ఉన్నట్లు నిర్దారించారు.

సహజంగానే కాస్త ఒత్తిడికి గురైతే గుండె వేగం పెరుగుతుంది. మానసిక ఆందోళన, కుంగుబాటు హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తాయి. ప్రమాదకరమైన వ్యాధులు శరీరంలోకి చేరేందుకు కారణమవుతున్నాయని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌ చెబుతోంది. కొవిడ్‌ సోకినా బయటపడేందుకు అనువుగా పోరాడేందుకు శరీరం సహకరించకపోవటానికి మానసిక ఒత్తిళ్లే కారణమంటున్నారు నగరానికి చెందిన న్యూరో సైకియాట్రిస్ట్‌ డాక్టర్‌ హరీష్‌చంద్రారెడ్డి.

కరోనా అనగానే ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. ఎండుపండ్లు, మాంసాహారం, వేడినీటి ఆవిరి, పోషక విలువల కోసం వేలాదిరూపాయలు ఖర్చు చేశారు. అన్ని వర్గాలకు ఆరోగ్య స్పృహ రెట్టింపైంది. వైరస్‌ కాస్త తగ్గుముఖం పట్టగానే మళ్లీ జాగ్రత్తలు అటకెక్కాయి. మాస్క్‌లు మాయమయ్యాయి. పోషకాహారం దూరమైంది. ఇవన్నీ కొవిడ్‌ రెండో దశలో తగిన మూల్యం చెల్లించేందుకు కారణమయ్యాయి. భవిష్యత్తులో ఎదురవబోయే సవాళ్లను ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచే ఆహార నియమాలు, ఆరోగ్యసూత్రాలు పాటించాలని వైద్యనిపుణులు స్పష్టంచేస్తున్నారు. కొద్దిరోజుల వ్యాయామం, బలవర్థకమైన ఆహారం పూర్తిస్థాయిలో రక్షణకవచంగా ఉండదంటున్నారు. దైనందిన జీవితంలో కసరత్తు, యోగా, ధ్యానం, సానుకూల దృక్పథం పెంపొందించుకొనేందుకు సాధన చేయాలని సూచిస్తున్నారు. చిన్నారులను మానసికంగా, శారీరకంగా దృఢంగా తయారు చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రుల తీసుకోవాలని సూచిస్తున్నారు.

సకుటుంబ సమేతం..

కుటుంబం ఆరోగ్యంగా ఉండాలంటే.. ఇంటిల్లిపాదీ జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్యురాలు డాక్టర్‌ సునీతా జోషి. రోగనిరోధకశక్తి కోసం సరైన తిండి, కంటినిండా నిద్ర, బ్రహ్మచర్యం కీలకమని ఆయుర్వేదం చెబుతుందని వివరించారు. ప్రాణాయామం చేయాలని, వేడి ఆహారం తీసుకోవాలని పేర్కొన్నారు.

శరీర శక్తిని పెంచుకోవచ్చు

శరీరానికి కావాల్సినంత శ్వాస అందితేనే మనిషి ఆరోగ్యంగా ఉంటారు. ఎలాంటి శ్రమ లేకపోవటం వల్ల రోగాలు వచ్చే ప్రమాదం ఉంది. వ్యాయామంతో చాలా వరకు రుగ్మతలను ఎదుర్కోవచ్చు. వజ్రాసనంతో జీర్ణశక్తి పెరుగుదల. సూర్యనమస్కారాలతో ఉక్కు శరీరం. ఆసనాలు క్రమం తప్పకుండా చేస్తే  ఊపిరితిత్తులు బలోపేతమవుతాయి. శ్వాసకు సంబంధించిన భ్రమరి, బస్తిరి, అనులోమ, విలోమ ప్రక్రియలు సాధన చేయాలి.-లివాంకర్, రామకృష్ణ మఠం యోగ శిక్షకులు 

కుంగుబాటు వద్దు.. 

రోజూ అరగంట నడక, వ్యాయామం శరీరానికి, మనసుకు ఉపశమనం ఇస్తాయి. చిన్నారులు, యువత గంట సమయం వ్యాయామం చేయవచ్చు. ప్రతికూల ఆలోచనల నుంచి బయటపడేందుకు శారీరక శ్రమ బాగా ఉపయోగ పడుతుంది. కరోనా సమయంలో కుంగుబాటుకు గురికాకుండా కాపాడుతుంది. ఉత్సాహంగా ఉండేందుకు అవసరమైన డొపమైన్‌ మెదడులో ఉత్పత్తి అవుతుంది. జీవనశైలి వ్యాధుల బారిపడనకుండా వ్యాయామం రక్షణ కవచంగా నిలుస్తుంది.-ఈశ్వర్, సెలబ్రిటీ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌

ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి 

ఏదైనా సమస్య ఎదురైనప్పుడు తట్టుకొనేందుకు సిద్ధపడాలి. చాలామంది తమకు ఏమవుతుందోననే భయంతో కుంగుబాటుకు గురవుతున్నారు. దీనివల్ల కొవిడ్‌ వచ్చినపుడు తట్టుకొనే శక్తిని చేతులారా నిర్వీర్యం చేసుకుంటున్నామనేది గుర్తుంచుకోవాలి. మహమ్మారి నుంచి బయట పడేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దృష్టి పెట్టాలి. సామాజిక మాధ్యమాల్లో వచ్చే వదంతులను ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దు. ఆప్తులు, సన్నిహితులతో వీడియో కాల్స్, ఫోన్‌లో తరచూ మాట్లాడుతూ ప్రతికూల ఆలోచనల నుంచి బయట పడాలి.-డాక్టర్‌ గీతా చల్లా, మానసిక నిపుణురాలు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని