మహారాష్ట్రలో మళ్లీ లాక్‌డౌన్‌ పెడతారా?

తాజా వార్తలు

Published : 19/03/2021 19:16 IST

మహారాష్ట్రలో మళ్లీ లాక్‌డౌన్‌ పెడతారా?

సీఎం ఉద్ధవ్‌ ఏమంటున్నారంటే..

ముంబయి: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి ఉద్ధృతి రోజురోజుకీ పెరుగుతోంది. నిన్న ఒక్కరోజే రికార్డు స్థాయిలో 25,800 కొత్త కేసులు రావడం కలకలం రేపుతోంది. ఇప్పటికే పలు ఆంక్షలు విధించిన అక్కడి ప్రభుత్వం మళ్లీ లాక్‌డౌన్‌ విధిస్తుందా? అనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో సీఎం ఉద్ధవ్‌ఠాక్రే నందుర్బర్‌లో మీడియాతో మాట్లాడారు. లాక్‌డౌన్‌ను ఒక ఆప్షన్‌గానే చూస్తున్నట్టు చెప్పారు. గతంలో మాదిరిగానే ప్రజలు కొవిడ్‌ నిబంధనలు స్వచ్ఛందంగా పాటించి వైరస్‌ కట్టడికి సహకరిస్తారని నమ్ముతున్నానన్నారు. గతేడాది సెప్టెంబర్‌లో రికార్డు స్థాయిలో కేసులు వచ్చినప్పుడు పోరాడటానికి ఏమీ లేదని.. వైరస్‌ నుంచి రక్షణ పొందేందుకు ఇప్పుడు కనీసం టీకాలైనా ఉన్నాయన్నారు. ప్రతిఒక్కరూ భయపడకుండా టీకా వేయించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.  కరోనా రూల్స్‌ సరిగా పాటిస్తేనే వైరస్‌ను నిలువరించగలమన్నారు.

మరోసారి కేసులు అత్యధికంగా నమోదవుతుండటంతో అప్రమత్తమైన మహారాష్ట్ర సర్కార్‌ థియేటర్లు, ఆడిటోరియాలు, ప్రైవేటు కార్యాలయాలపై ఆంక్షలు విధించింది. ఇకనుంచి 50శాతం సామర్థ్యంతోనే కార్యకలాపాలు కొనసాగించాలని తాజా మార్గదర్శకాల్లో వెల్లడించింది. ఈ ఆంక్షలు రాష్ట్రవ్యాప్తంగా మార్చి 31వరకు కొనసాగుతాయని ప్రభుత్వం ప్రకటించింది. కొవిడ్‌ను కట్టడి చేసేందుకు లాక్‌డౌన్‌ కూడా మరో ప్రత్యామ్నాయం అని, ప్రజలు కొవిడ్‌ నిబంధనలు పాటిస్తారనే విశ్వాసం ఉందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే పరోక్షంగా ప్రజలను హెచ్చరించారు. తొలిసారి రికార్డుస్థాయిలో కొత్త కేసులు వెలుగు చూడటంతో వైరస్‌ కట్టడిలో భాగంగా పలు ఆంక్షలు అమలు చేస్తున్న ప్రభుత్వం, తాజాగా నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటి ప్రకారం, ఆడిటోరియాలు, థియేటర్లు 50శాతం సామర్థ్యంతోనే నడిపించాలని పేర్కొంది. వీటితో పాటు ప్రైవేటు కార్యాలయాలల్లోనూ 50శాతం సిబ్బందితోనే కార్యకలాపాలు కొనసాగించాలని స్పష్టంచేసింది. ఆడిటోరియాల్లో ఏర్పాటు చేసే సామాజిక, రాజకీయ, మతపరమైన సభలకు కూడా ఈ 50శాతం సామర్థ్యం వర్తిస్తుందని స్పష్టంచేసింది.

హాళ్లలోకి వచ్చే ప్రతి ఒక్కరి శరీర ఉష్ణోగ్రతలు పరీక్షించడంతో పాటు మాస్కులు ధరించేలా చూడాలని ఆదేశించింది. అన్ని ప్రాంతాల్లో శానిటైజర్‌లను ఏర్పాటు చేయాలని..నిబంధనలు అతిక్రమిస్తే ఆయా సంస్థలు/కేంద్రాలను కొవిడ్‌ మహమ్మారి తగ్గిందని కేంద్రప్రభుత్వం ప్రకటించే వరకూ మూసివేస్తామని హెచ్చరించింది. ప్రైవేటు కార్యాలయాలకు ఇదేవిధమైన నిబంధనలు వర్తిస్తాయని, ప్రభుత్వ కార్యాలయాల సిబ్బంది సామర్థ్యంపై ఆయా శాఖధిపతులు నిర్ణయం తీసుకోవచ్చని వెల్లడించింది. అయితే, తయారీ రంగానికి వీటి నుంచి మినహాయింపు ఇచ్చింది. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ పూర్తి స్థాయి కార్మికులతో తయారీ రంగ సంస్థలు కార్యకలాపాలు కొనసాగించుకోవచ్చని పేర్కొంది.

కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ ప్రారంభమవుతోన్న నేపథ్యంలో రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టంచేసింది. ఇందులో భాగంగా, మహారాష్ట్రలో పలు నగరాల్లో లాక్‌డౌన్‌, రాత్రి కర్ఫ్యూ ఆంక్షలు కొనసాగుతున్నాయి. తాజాగా మరికొన్ని ఆంక్షలతో కొవిడ్‌ మార్గదర్శకాలను మహారాష్ట్ర సర్కార్‌ విడుదల చేసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని