నేను క్వారంటైన్‌లో ఉంటే ఎలా?:గౌడ
close

తాజా వార్తలు

Published : 25/05/2020 18:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నేను క్వారంటైన్‌లో ఉంటే ఎలా?:గౌడ

మంత్రిగా మినహాయింపు ఉంది

బెంగళూరు: ‘నేను మంత్రిని, క్వారంటైన్ నుంచి నాకు మినహాయింపు ఉంది’ అంటూ విమానం దిగిన వెంటనే కేంద్ర మంత్రి సదానంద గౌడ నేరుగా ఇంటికే వెళ్లిపోయారు. దేశీయంగా విమానాల రాకపోకలు ప్రారంభం కావడంతో ఆయన దిల్లీ నుంచి సోమవారం బెంగళూరు చేరుకున్నారు. మంత్రి వద్ద కొవిడ్-19 నెగిటివ్ రిపోర్టు ఉందని, ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉంటారని ఆయన సహాయకులు ఒకరు మీడియాకు వెల్లడించారు. 

అనంతరం సదానంద గౌడ మీడియాతో మాట్లాడుతూ..క్వారంటైన్ మార్గదర్శకాలు అందరికి ఒకేలా ఉన్నప్పటికీ, కొందరికి మాత్రం మినహాయింపులు ఉన్నాయని తెలిపారు. ‘ఒక మంత్రిగా నాకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మినహాయింపులు ఇచ్చాయి. ఇది పట్టించుకోవాల్సిన అంశం కాదు’ అని వెల్లడించారు. అలాగే తన ఫోన్‌లో ఆరోగ్య సేతు యాప్‌ కూడా ఉందన్నారు. తాను కేంద్ర ఫార్మాస్యూటికల్ విభాగానికి నేతృత్వం వహిస్తున్నానని, ఔషధాల కొరత రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత తనదేనని తెలిపారు. ‘దేశ వ్యాప్తంగా అందరికి ఔషధాలు అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత నామీదే ఉంది. వైద్యులు, మందులు అందించే వారు క్వారంటైన్‌లో ఉంటే కరోనా వైరస్‌ను ఎలా ఎదుర్కోగలం’ అంటూ ఎదురు ప్రశ్న వేశారు.

కరోనా కారణంగా  రెండు నెలల తరవాత  దేశీయంగా విమానాల రాకపోకలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికులు ఏడు రోజులు ఇనిస్టిట్యూషన్ క్వారంటైన్‌, మరో ఏడు రోజులు హోం క్వారంటైన్‌లో ఉండాలని కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. అత్యవసర పని మీద వచ్చే కొందరు వ్యక్తులకు మాత్రం దాని నుంచి వెసులుబాటు కల్పించింది. అంతేకాకుండా ఐసీఎంఆర్ గుర్తింపు పొందిన ల్యాబ్ నుంచి కొవిడ్‌ 19 నెగిటివ్ టెస్ట్ రిపోర్టు (అది కూడా రెండు రోజులకు మించకూడదు) పొందిన వారు ఇనిస్టిట్యూషన్ క్వారంటైన్‌లో ఉండాల్సిన అవసరం లేదని వాటిలో తెలిపింది. అయితే మంత్రులకు మినహాయింపు ఇస్తున్నట్లు  ప్రభుత్వ మార్గదర్శకాల్లో ఎక్కడా పేర్కొనకపోవడం గమనార్హం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని