మహారాష్ట్రలో రాత్రిపూట కర్ఫ్యూ

తాజా వార్తలు

Updated : 04/04/2021 18:52 IST

మహారాష్ట్రలో రాత్రిపూట కర్ఫ్యూ

ముంబయి: కరోనా ధాటికి వణికిపోతోన్న మహారాష్ట్ర కీలక నిర్ణయం తీసుకుంది. వైరస్‌ కట్టడి చర్యల్లో భాగంగా రాష్ట్రం మొత్తం రాత్రి కర్ఫ్యూ అమలు చేయనున్నట్లు ప్రకటించింది. రాత్రి 8గంటల నుంచి ఉదయం 7గంటల వరకు కర్ఫ్యూ ఆంక్షలు అమలులో ఉంటాయని వెల్లడించింది. రాష్ట్రంలో వైరస్‌ ఉద్ధృతిపై సమావేశమైన కేబినెట్, మహారాష్ట్రలో రాత్రి కర్ఫ్యూ అమలు చేసేందుకు ఆమోదముద్ర వేసింది. తాజా ఆంక్షలు సోమవారం నుంచే అమలులోకి వస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. ఇక వచ్చే శుక్రవారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు(మూడు రోజులు) పూర్తి లాక్‌డౌన్‌ ఆంక్షలు అమలు చేయాలని నిర్ణయించింది.

ఆంక్షలు కఠినతరం..

రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ ఆంక్షలు కొనసాగుతుండగా, తాజా నిర్ణయంతో రాష్ట్రం మొత్తం రాత్రి కర్ఫ్యూ అమలులోకి వస్తుంది. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 7గంటల వరకు అమలులో ఉండడంతో పాటు పగలు సమయంలోనూ ఐదుగురు కంటే ఎక్కువ మంది సమూహాలుగా ఏర్పడే అవకాశం లేదు. ఇక ప్రభుత్వ కార్యాలయాలు కూడా కేవలం 50 శాతం సిబ్బందితోనే పనిచేస్తాయని ప్రభుత్వం తెలిపింది. ప్రైవేటు ఉద్యోగులు మాత్రం ఇంటి నుంచే పనిచేయాలని సూచించింది. పగటి వేళల్లోనే హోం డెలివరీ సర్వీసులను అనుమతించనున్నారు. బస్సులు, రైళ్లు కూడా 50శాతం సామర్థ్యంతోనే నడవనున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా కర్ఫ్యూ అమలు సమయంలో హోటళ్లు, మాల్స్‌, రెస్టారెంట్లు, బార్లను పూర్తిగా మూసివేయనున్నారు. ఈ ఆంక్షలకు సంబంధించిన పూర్తి మార్గదర్శకాలను త్వరలోనే విడుదల చేస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

‘మహా’ పరిస్థితి ఆందోళనకరం..

కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ విజృంభణతో దేశంలో మరోసారి వైరస్‌ తీవ్రత ఆందోళనకర స్థాయికి చేరుకుంది. ముఖ్యంగా మహారాష్ట్ర, పంజాబ్‌ రాష్ట్రాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం పలుసార్లు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించారు. ప్రజలు కొవిడ్‌ నిబంధనలు పాటించకుంటే లాక్‌డౌన్‌ తప్పదని హెచ్చరించారు. అయినా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో చివరకు రాష్ట్రం మొత్తం రాత్రి పూట కర్ఫ్యూ విధించేందుకు సిద్ధమయ్యారు.

* నిర్మాణ, పారిశ్రామిక కార్యకలాపాలను మాత్రం కొనసాగించేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది.

* కూరగాయల మార్కెట్లలో ప్రజలను నియంత్రించేందుకు కొత్త మార్గదర్శకాలను అమలు చేయనున్నారు.

* థియేటర్లు కూడా మూతబడనున్నాయి. కానీ, తక్కువ జనాభాతో షూటింగ్‌లకు అనుమతి ఇస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

* వారాంతంలో మాత్రం కేవలం అత్యవసర సర్వీసులకు తప్ప మిగతా అన్ని బంద్‌ పాటించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని