
తాజా వార్తలు
మహారాష్ట్రలో 2లక్షలు దాటిన కేసులు!
24గంటల్లో 7వేల కేసులు, 295 మరణాలు
ముంబయిలో కొనసాగుతోన్న కొవిడ్ ఉద్ధృతి
ముంబయి: మహారాష్ట్రలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. దేశంలోనే అత్యధిక తీవ్రత మహారాష్ట్రలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా నిన్నఒక్కరోజే రాష్ట్రంలో 7,074 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా గడిచిన 24గంటల్లో రాష్ట్రంలో 295కొవిడ్ రోగులు మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2,00,064కి చేరింది. వీరిలో ఇప్పటి వరకు 8671మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో నమోదవుతున్న మొత్తం కొవిడ్ మరణాల్లో 45శాతానికి పైగా కేవలం ఇక్కడే సంభవిస్తున్నాయి. కొవిడ్ కేసుల్లోనూ దాదాపు 30శాతం మహారాష్ట్రలోనే నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కరోనా బారినపడి ఇప్పటివరకు లక్షా 8వేల మంది కోలుకోగా మరో 83వేల మంది చికిత్స పొందుతున్నారు. దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 60శాతంగా ఉండగా మహారాష్ట్రలో మాత్రం 54.02శాతంగా ఉంది. వీరికితోడు రాష్ట్రంలో దాదాపు 6లక్షల మంది హోం క్వారంటైన్లో ఉన్నట్లు ప్రభుత్వం చెబుతోంది.
ముంబయిలో ఆందోళనకరం..
కరోనా మహమ్మారి ధాటికి దేశ ఆర్థిక రాజధాని ముంబయి అతలాకుతలం అవుతోంది. రాష్ట్రంలో నమోదవుతున్న పాజిటివ్ కేసుల్లో ఎక్కువగా ముంబయిలోనే ఉంటున్నాయి. శనివారం నాటికి ముంబయి మహానగరంలో కరోనా కేసుల సంఖ్య 82,814గా నమోదైంది. వీరిలో ఇప్పటిదాకా 4827మంది మృత్యువాతపడ్డట్లు బృహన్ ముంబయి మునిసిపల్ కార్పొరేషన్ వెల్లడించింది. నగరంలో నమోదైన మొత్తం కేసుల్లో ఇప్పటికే 53వేల మంది కోలుకోగా మరో 24,524 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ప్రకటించింది. అయితే, అతిపెద్ద మురికివాడ ధారావిలో మాత్రం కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య బాగా తగ్గినట్లు నగరపాలక సంస్థ వెల్లడించింది. ఇక రాష్ట్రంలో పరిస్థితి ఇలాఉన్న సమయంలోనే భారీ వర్షాలు ముంబయిని అతలాకుతలం చేస్తున్నాయి.
దిల్లీలో లక్షకు చేరువలో..
మహారాష్ట్ర అనంతరం తమిళనాడు, దిల్లీ రాష్ట్రాల్లో కేసులు, మరణాల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. దేశ రాజధానిలో నిన్న ఒక్కరోజే 2505పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దిల్లీలో కరోనా కేసుల సంఖ్య 97,200లకు చేరింది. వీరిలో ఇప్పటి వరకు 3004మంది మృత్యువాతపడ్డారు. అయితే, దిల్లీలో కొవిడ్ బాధితుల రికవరీ రేటు 70శాతం దాటడం ఊరట కలిగించే అంశం. ముందుజాగ్రత్తగా కరోనా రోగుల కోసం ఆసుపత్రుల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పడకల్లో దాదాపు 9000ఖాళీగానే ఉన్నట్లు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు.
ఇక తమిళనాడులో కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. వైరస్ తీవ్రత దృష్ట్యా చెన్నైలో 17రోజులపాటు లాక్డౌన్ను పొడగించగా అది నేటితో ముగియనుంది. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోనూ వైరస్ విజృంభణ కొనసాగుతోంది.
ఇవీ చదవండి..
భారత్లో ఒక్కరోజే 24,850 కేసులు, 613మరణాలు
కరోనాతో చచ్చినా..చావే!