బొమ్మలనూ మనమే తయారుచేసుకుందాం: మోదీ

తాజా వార్తలు

Updated : 30/08/2020 12:55 IST

బొమ్మలనూ మనమే తయారుచేసుకుందాం: మోదీ

దిల్లీ: కరోనా వేళ కూడా రైతులు కష్టపడి సాగుచేస్తున్నారంటూ ప్రధాని నరేంద్ర మోదీ అన్నదాతలపై ప్రశంసలు కురిపించారు. రైతుల కృషిని కొనియాడుతూ మన వేదాల్లోనూ శ్లోకాలున్నాయని గుర్తుచేశారు. ఈ ఖరీఫ్‌లో గత ఏడాది కంటే ఎక్కువ విస్తీర్ణంలో సాగుచేస్తున్నారని తెలిపారు. ప్రతి నెలా చివరి ఆదివారం దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ‘మన్‌ కీ బాత్‌’ ప్రసంగంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

దేశంలో వివిధ ప్రాంతాల్లో జరుపుకొనే పండుగలు.. ప్రకృతితో ముడిపడి ఉన్న సంబంధాన్ని మోదీ వివరించారు. ప్రతి వేడుకను పర్యావరణహితంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. కరోనా కష్టకాలంలోనూ సరైన జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజలు వేడుకలు జరుపుకొంటున్నారన్నారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల్లో జరుపుకొనే పండుగలను ప్రస్తావిస్తూ వాటి ప్రాముఖ్యాన్ని వివరించారు. ఓనం వేడుక విశిష్టత నేడు ప్రపంచం నలుమూలలకు విస్తరించిందని తెలిపారు.

పిల్లలు ఆడుకునే బొమ్మలు స్థానికంగానే తయారు చేయాలని మోదీ పిలుపునిచ్చారు. అందుకు యువత ముందుకు రావాలని కోరారు. ప్రపంచ ఆట బొమ్మల తయారీలో భారత్‌ వాటా చాలా తక్కువగా ఉందని.. ఇది ఏమాత్రం సరి కాదని అభిప్రాయపడ్డారు. ఆట బొమ్మలు వినోదాన్ని పంచడమే కాకుండా.. పిల్లల్లో ఆలోచనల్ని రేకెత్తిస్తాయన్నారు.  ఈ సందర్భంగా బొమ్మల గురించి రవీంద్ర ఠాగూర్‌ చెప్పిన కొన్ని వ్యాఖ్యాల్ని మోదీ గుర్తుచేశారు. సంపూర్ణంగా లేని ఆట బొమ్మలే నిజమైన బొమ్మలని ఠాగూర్ అన్న మాటల్ని గుర్తుచేశారు. పిల్లలు, పెద్దలు ఆడే కంప్యూటర్‌ గేమ్స్‌నూ రూపొందించాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఉన్న ఆటల్లో పాశ్చాత్య ప్రభావం ఉందన్నారు. భారత సంస్కృతికి అనుగుణంగా ఆటల్ని తీర్చిదిద్దాలని కోరారు. అందుకు అంకుర సంస్థలు(స్టార్టప్‌లు) సమాయత్తం(టీంఅప్‌) కావాలన్నారు. పరోక్షంగా స్వయంసమృద్ధి భారత్‌ దిశగా అడుగులు పడాలని నొక్కి చెప్పారు. స్థానిక కళలు, కళాకారులను మరింత ప్రోత్సహించాలని పేర్కొన్నారు. భారత దేశ కళానైపుణ్యాల్ని ప్రపంచ దేశాలకు చాటిచెప్పాలన్నారు.

ప్రధాని ప్రసంగంలోని మరిన్ని ముఖ్యాంశాలు..

దేశీయంగా తయారైన ‘కూ’, ‘చింగారి’ వంటి యాప్‌లకు ఆదరణ పెరుగుతోంది. ఇదే దిశలో మరిన్ని యాప్‌లనూ రూపొందించాలి. 

సెప్టెంబరు నెలను ‘పోషకాహార మాసం’గా పాటించాలి. బాల్యంలో అందే పోషకాలే మనిషి భౌతికంగా, మానసికంగా దృఢంగా తయారయ్యేందుకు దోహదం చేస్తాయి. 

దేశ భద్రతలో జాగిలాల సేవను మోదీ ఈ సందర్భంగా ప్రశంసించారు. 74వ స్వాతంత్ర్య వేడుకలో చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌ ‘కమెండేషన్‌ కార్డ్స్‌’ అందుకున్న విదా, సోఫీ జాగిలాల సేవల్ని గుర్తుచేశారు. ఇటీవలే వీరమరణం పొందిన రాకీ అనే జాగిలం అందించిన సేవల్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. కొత్తగా పెంపుడు జంతువుల్ని తెచ్చుకోవాలనుకునే వారు దేశీ జాతి శునకాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

వచ్చే నెల 5వ తేదీన జరపుకోనున్న ఉపాధ్యాయ దినోత్సవాన్ని ప్రస్తావించిన మోదీ... కరోనా కష్టకాలంలో ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. అయినా.. వాటన్నింటినీ అధిగమించారని.. సాంతకేతికతను వినియోగించుకొని విద్యార్థులకు చేరువయ్యారని ప్రశంసించారు. 

కరోనా వైరస్‌ దేశ వ్యాప్తంగా విజృంభిస్తున్న నేపథ్యంలో భౌతిక దూరం పాటించడం, మాస్కు ధరించడం వంటి జాగ్రత్తల్ని ప్రధాని మరోసారి గుర్తుచేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని