
తాజా వార్తలు
దయనీయంగా వలస కార్మికుల జీవితాలు
ఇంటర్నెట్ డెస్క్: దేశవ్యాప్తంగా మోదీ 21 రోజుల లాక్డౌన్ విధించారు. ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. డబ్బున్నవాళ్లు కావాల్సిన సామాగ్రిని ముందుగానే కొనిపెట్టుకున్నారు. కానీ దిల్లీ లాంటి నగరాల్లో నివసించే వలస కార్మికులకు ఈ లాక్డౌన్ శాపంగా మారింది. నిలువనీడలేని వారి జీవితాలు మరింత దుర్భరంగా మారాయి. ఒక్కసారిగా వారి జీవితాలు రోడ్డున పడ్డాయి. యజమానులు ఈ పరిస్థితి చక్కబడ్డాకే పనిలోకి రమ్మని మొహం మీదే చెప్పేశారు. ఖర్చులకు కనీస ఆర్థిక సహాయం కూడా చేయలేదు. కుటుంబంతో ఎటూ వెళ్లలేని, అక్కడే ఉండలేని దయనీయ స్థితి. స్వగ్రామాలకు వెళ్దామంటే బస్సులు, రైళ్లు అన్ని రద్దయ్యాయి. ప్రైవేట్ వాహనాలు కూడా లేవు. చేతిలో డబ్బు లేదు. తినడానికి తిండి లేదు. అక్కడ ఎవరిని సహాయం అడుగుదామన్నా మొహం మీదే తలుపులేస్తున్నారు. ఇంకా 21 రోజులు అక్కడ ఆకలితో ఉండేకన్నా కాలినడకన స్వగ్రామానికి చేరుకోడమే ఉత్తమం అనుకున్నారు. అలా వేల మంది వలస కార్మికులు జాతీయ రహాదారులపైకి వచ్చారు. పిల్లలని, సామాగ్రిని ఎత్తుకుని వందల కిలోమీటర్లు నడుస్తున్నారు. మండుటెండలో ఆంక్షల మధ్య ఇళ్లకు చేరేందుకు ఎన్నో అడ్డంకులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రాలన్నీ సరిహద్దులు మూసేస్తున్నట్లు ప్రకటించాయి. కొన్ని చోట్ల ఊళ్లో వారు రానివ్వట్లేదు. దానికి తోడు ఎక్కడ పోలీసులు ఆపేసి వెనక్కి పంపిస్తారో అన్న భయం. ఇళ్లు చేరేందుకు ఎన్ని రోజులు పడుతుందో తెలియదు అయినా నడుస్తున్నారు. గుండెల నిండా బాధని, కడుపునిండా ఆకలిని పెట్టుకుని పట్టువదలకుండా నడుస్తున్నారు. అందులో పెద్ద వయస్సు వాళ్లున్నారు. పసిపాపలున్నారు. వారిని కదిలిస్తే చెమ్మగిల్లిన కళ్లతో బాధలని చెప్పుకుంటున్నారు. కొందరేమో కరోనాకన్నా ముందే ఆకలితో చనిపోతామేనని కన్నీళ్లు పెడుతున్నారు. రాళ్లు రప్పలు తప్ప తినేందుకు ఏదీ లేదని బాధపడుతున్నారు. ఇది ఒక్క దిల్లీ లోని వలస కార్మికులదే కాదు దేశంలోని ప్రముఖ నగరాల్లోని కార్మికుల దుస్థితి. ఇళ్లకు చేరకునేందుకు వారు పడుతున్న కష్టం. ఈ కార్మికులు రహాదారులపై నడుస్తూ ఇళ్లకు వెళ్తున్న వీడియోలు, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో తిరుగుతూ కన్నీరు పెట్టిస్తున్నాయి.