
తాజా వార్తలు
కరోనా వ్యాక్సిన్ ఇప్పట్లో రానట్లేనా?
దిల్లీ: కరోనా మహమ్మారితో అతలాకుతలమైన ప్రపంచానికి సాంత్వన చేకూర్చేలా వ్యాక్సిన్ తయారీ చివరి దశలో ఉన్నట్లు భారత్ బయోటెక్, జైడస్ సంస్థలు ప్రకటించాయి. కోవాగ్జిన్, జైకోవ్-డి పేరిట ఔషధాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించాయి. మరోవైపు భారతీయ వైద్య ఆరోగ్య మండలి కూడా ఆగస్టు 15 నాటికి కరోనా వ్యాక్సిన్‌ను విడుదల చేస్తామని ప్రకటించింది. అయితే ఇవన్నీ సాధ్యం కాకపోవచ్చని తెలుస్తోంది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) అధికారిక వెబ్సైట్లో ప్రచురించిన కథనమే ఇందుకు నిదర్శనం. డా. టి.వి. వెంకటేశ్వర్ రాసిన కథనాన్ని ఇవాళ పీఐబీ అధికారిక వెబ్సైట్లో ప్రచురించారు. 2021 నాటికి కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ అభివృద్ధి చేసే అవకాశముందని అందులో రాయడం గమనార్హం. అయితే కొద్దిసేపటికే శాస్త్ర సాంకేతిక అభివృద్ధి శాఖ అందులో కొన్ని మార్పులు చేసింది. దీని ప్రకారం 2021 నాటికి కరోనా వ్యాక్సిన్ వచ్చే అవకాశాలే లేదని తెలుస్తోంది.
తొలుత ప్రచురించిన కథనం ప్రకారం.. ‘‘ప్రపంచ వ్యాప్తంగా 140 కంపెనీలు కరోనా వ్యాక్సిన్‌ను తయారు చేసే పనిలో పడ్డాయి. వీటిలో ఇండియాకు చెందిన భారత్ బయోటెక్, జైడస్ సంస్థల సహా 11 కంపెనీలు ఇప్పటికే హ్యూమన్ ట్రయల్స్ ప్రారంభించాయి. అన్నీ సజావుగా సాగితే 2021 నాటికి వ్యాక్సిన్ విడుదల చేసే అవకాశముంది ’’ అని మొదట ప్రచురించారు. కానీ కొద్దిసేపటికే likely tobe ready స్థానంలో unlikely to be readyగా మార్పు చేశారు. ఆ తర్వాత ఈ పదాన్ని కూడా కథనం నుంచి తొలగించడం గమనార్హం. దీంతో వ్యాక్సిన్ విడుదలపై మళ్లీ నీలి నీడలు అలుముకున్నాయా? అనే ప్రశ్న తలెత్తుతోంది.
గత శుక్రవారం ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ మాట్లాడుతూ.. భారత్ బయోటెక్ సంస్థ రూపొందించిన వ్యాక్సిన్‌కు హ్యూమన్ ట్రయల్స్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించిన విషయం తెలిసిందే. వైరస్ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఫాస్ట్ ట్రాక్ విధానంలో ప్రయోగాలను వేగవంతం చేస్తున్నామని చెప్పారు. అంతేకాకుండా ఆగస్టు 15 నాటికి సూదిమందు విడుదల చేస్తామని కూడా ప్రకటించారు. అయితే వైద్య నిపుణులు మాత్రం ఈ ప్రక్రియ అంత సులభం కాదని చెప్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజా పరిణామాలు వ్యాక్సిన్ రాకపై పలు అనుమానాలను రేకెత్తిస్తున్నాయి.