మిజోరంలో తొలి కరోనా మరణం!

తాజా వార్తలు

Published : 28/10/2020 23:32 IST

మిజోరంలో తొలి కరోనా మరణం!

ఐజ్వల్‌: గడిచిన ఎనిమిది నెలలుగా దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే అన్నిరాష్ట్రాల్లో ఉగ్రరూపం దాల్చిన వైరస్‌..ఇప్పటివరకు లక్ష 20వేల మందిని పొట్టనబెట్టుకుంది. ఈశాన్య రాష్ట్రమైన మిజోరంలో మాత్రం వైరస్‌ తీవ్రత కాస్త తక్కువగానే ఉంది. తాజాగా అక్కడ తొలి కరోనా మరణం నమోదైంది. రాష్ట్ర రాజధాని ఐజ్వల్‌లోని జోరం మెడికల్‌ కాలేజీలో వైరస్‌ సోకిన ఓ 62ఏళ్ల వ్యక్తి మరణించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. గత పదిరోజులుగా చికిత్స పొందుతున్న అతనికి ఇదివరకు హృద్రోగ సమస్యలున్నట్లు ఆసుపత్రి సుపరింటెండెంట్‌ డాక్టర్‌ హెచ్‌సీ లాల్దీనా వెల్లడించారు.

ఇక, మిజోరంలో మార్చి 24వతేదీనే తొలి కరోనా కేసు నమోదైంది. నెదర్లాండ్‌ నుంచి వచ్చిన ఓ పాస్టర్‌కు వైరస్‌ సోకినట్లు గుర్తించారు. దాదాపు 45రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం అతను డిశ్చార్జి అయ్యాడు.  రెండు నెలల తర్వాత ఒకేసారి 12కేసులు బయటపడ్డాయి. ఇలా ఇప్పటివరకు మొత్తం 2607పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీరిలో ఇప్పటికే 2233మంది కోలుకోగా 374 క్రియాశీల కేసులున్నాయి. తాజాగా రాష్ట్రంలోనే తొలి కరోనా మరణం నమోదయ్యింది. ప్రారంభంలో వైరస్‌ తీవ్రత తక్కువగానే ఉన్నప్పటికీ.. గత కొన్నిరోజులుగా రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. బుధవారం ఒక్కరోజే 80కేసులు నమోదుకాగా వీరిలో 27మంది పాఠశాల విద్యార్థులు, మరో 11మంది ఆర్మీ సిబ్బంది ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. అక్టోబర్‌ 1 నుంచి నమోదవుతున్న పాజిటివ్‌ కేసుల్లో 34శాతానికి పైగా లక్షణాలున్నవారేనని మిజోరం ఆరోగ్యశాఖాధికారులు వెల్లడించారు.

ఇదిలాఉంటే, దేశంలో కరోనా కేసుల సంఖ్య 79,90,322కు చేరింది. వీరిలో ఇప్పటివరకు 1,20,010 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం బాధితుల్లో 72,59,509 మంది కోలుకోగా ప్రస్తుతం మరో 6,10,803(7.64 శాతం) క్రియాశీల కేసులు మాత్రమే ఉన్నాయి. దేశవ్యాప్తంగా కరోనా బాధితుల రికవరీ రేటు 90.85శాతంగా ఉండగా.. మరణాల రేటు 1.50శాతంగా కొనసాగుతోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని