కొవిడ్‌ టీకా‌: రహస్య‌ సమాచారం విడుదల!

తాజా వార్తలు

Published : 18/09/2020 12:32 IST

కొవిడ్‌ టీకా‌: రహస్య‌ సమాచారం విడుదల!

ప్రయోగాల బ్లూప్రింట్‌ వెల్లడించిన మోడెర్నా, ఫైజర్‌

వాషింగ్టన్‌: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ కోసం ముమ్మర కృషి జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో సంస్థల మధ్య పోటీ, టీకా‌ ప్రయోగాలు త్వరితగతిన పూర్తి చేస్తామనే ప్రకటనలపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా వ్యాక్సిన్‌ ప్రయోగాలు శాస్త్రీయంగా జరుగుతున్నాయా? లేదా? అనే విషయంపై అనుమానాలు రేకెత్తాయి. దీంతో ఇలాంటి అనుమానాలకు స్వస్తి చెప్పేందుకు టీకా‌ తయారీ సంస్థలు ముందుకొచ్చాయి. దీనిలోభాగంగా వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రణాళిక(బ్లూప్రింట్‌)ను మోడెర్నా, ఫైజర్‌ కంపెనీలు బహిర్గతం చేశాయి. వీటికి సంబంధించిన 135 పేజీల సమాచారాన్ని మోడెర్నా తాజాగా విడుదల చేసింది.

వ్యాక్సిన్‌ ప్రయోగాల్లో పాల్గొనే వారిని ఎంచుకొనే విధానం, వారి పర్యవేక్షణ, ఒకవేళ ప్రయోగాల్లో ఏవైనా సమస్యలు ఎదురైతే ప్రయోగాలను త్వరగా నిలిపివేసేందుకు అనుసరించే పద్ధతులను దీనిలో ప్రస్తావించారు. అంతేకాకుండా వ్యాక్సిన్‌ తీసుకున్న వారు వైరస్‌ నుంచి రక్షణ పొందారో? లేదో అనే విషయాన్ని తెలియజేయడానికి పరిశోధకులు ఈ సమాచారాన్ని (బ్లూ ప్రింట్‌) వినియోగిస్తారు. ప్రయోగాలకు సంబంధించిన ఈ కీలక సమాచారాన్ని వ్యాక్సిన్‌ కంపెనీలు సాధారణంగా గోప్యంగానే ఉంచుతాయి. కేవలం ప్రయోగాలు మొత్తం పూర్తైన తర్వాత మాత్రమే వీటిని వెల్లడిస్తాయి. ప్రయోగాలు కొనసాగుతోన్న సమయంలో వీటిని బయటకు వెల్లడించడం మాత్రం అత్యంత అరుదనే చెప్పవచ్చు. వ్యాక్సిన్‌ తయారీలో కంపెనీల మధ్య పోటీ కారణంగా సాధారణంగా వీటిని విడుదల చేయమని మోడెర్నా సంస్థ చీఫ్ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ తాల్‌ జాక్స్‌ అభిప్రాయపడ్డారు.

అయితే, అమెరికాలో సీడీసీ నిపుణులు వ్యాక్సిన్‌ ఆలస్యంగానే వస్తుందని వాదిస్తున్నప్పటికీ, ఎన్నికల కన్నా ముందే వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తుందని అధ్యక్షుడు ట్రంప్‌ స్పష్టంచేస్తున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో వ్యాక్సిన్‌ సురక్షితమేనా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. వీటిని నివృత్తి చేసే పనిలో భాగంగా ప్రయోగాలు కొనసాగుతున్న సమయంలోనే పరిశోధనా ప్రణాళికను ఈ రెండు కంపెనీలు బహిర్గతం చేశాయి. అయితే, పూర్తి ప్రయోగ ఫలితాలను విశ్లేషించడానికి మాత్రం మరికొంత సమయం పడుతుందని స్పష్టంచేశాయి. వ్యాక్సిన్‌ పనిచేస్తుందో? లేదో? అని తెలియడానికి కూడా మరికొంత కాలం పడుతుందని మోడెర్నా తాజాగా ప్రకటించింది. ఈ సంవత్సరం చివరినాటికి వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావచ్చని అంచనా వేస్తున్నట్లు తెలిపింది. ఇక ఫైజర్‌ మాత్రం వ్యాక్సిన్‌ అంతకుముందే రావచ్చనే అభిప్రాయం వ్యక్తంచేసింది.

ఇప్పటివరకు వ్యాక్సిన్‌ అభివృద్ధి, ప్రయోగాల్లో ముందున్న తొమ్మిది కంపెనీల్లో కేవలం రెండు మాత్రమే ఈ బ్లూప్రింట్‌ను బహిర్గతం చేశాయి. మోడెర్నా, ఫైజర్‌తోపాటు ఆస్ట్రాజెనికా, బయోఎన్‌టెక్‌ కంపెనీలు తయారుచేసిన వ్యాక్సిన్‌లు కూడా ప్రయోగాల్లో ముందున్న విషయం తెలిసిందే. మోడెర్నా 30వేల మందిపై ప్రయోగాలు నిర్వహిస్తుండగా ఇప్పటికే 25వేల మంది వాలంటీర్ల నమోదు ప్రక్రియ పూర్తెనట్లు తెలిపింది. ఫైజర్‌ మాత్రం 44వేలపై కరోనా వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించేందుకు సిద్ధమవగా, ఇప్పటికే 30వేల మంది వాలంటీర్లపై ప్రయోగాలు జరుపుతున్నట్లు వెల్లడించింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని