కరోనా: వుహాన్‌ను దాటిన ముంబయి!
close

తాజా వార్తలు

Published : 10/06/2020 11:27 IST

కరోనా: వుహాన్‌ను దాటిన ముంబయి!

ముంబయి: మహారాష్ట్రలో కరోనా వైరస్‌ మహమ్మారి తీవ్రరూపం దాలుస్తోంది. తాజాగా నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో 2259 పాజిటివ్‌ కేసులు నమోదుకావడంతోపాటు 120 మరణాలు సంభవించాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో దీని తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. కేవలం ముంబయి నగరంలోనే ఇప్పటివరకు 51,000 పాజిటివ్‌ కేసులు బయటపడడంతోపాటు 1760 మరణాలు నమోదయ్యాయి. ముంబయి నగరంలో నిత్యం వెయ్యికిపైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతుండగా, 50 మందికిపైగా మృత్యువాతపడుతున్నారు. గతవారమే అత్యధిక కేసుల్లో మహారాష్ట్ర చైనాను దాటిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కరోనా వైరస్‌ మహమ్మారికి పుట్టినిల్లుగా భావిస్తున్న వుహాన్‌(చైనా) నగరంలో నమోదైన కరోనా కేసులకంటే ముంబయిలోనే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. చైనా ప్రభుత్వం లెక్కల ప్రకారం వుహాన్‌ నగరంలో ఇప్పటివరకు 50,300కేసులు నమోదయ్యాయి. తాజాగా ముంబయి వుహాన్‌ నగరాన్ని దాటేసింది. 

పుణెలో 10వేలు దాటిన కేసులు..
ఇక ముంబయి అనంతరం, మహారాష్ట్రలో మరో ముఖ్యనగరమైన పుణెలో కొవిడ్‌ విజృంభణ కొనసాగుతోంది. నగరంలో మొత్తం కరోనా వైరస్‌ సోకినవారి సంఖ్య 10,012 చేరినట్లు పుణె వైద్యాధికారులు వెల్లడించారు. వీరిలో ఇప్పటివరకు 442మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు.

మహారాష్ట్రలో 90వేల కేసులు..
బుధవారం నాటికి మహారాష్ట్రలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 90,787కి చేరగా వీరిలో ఇప్పటివరకు 3289 మంది మృత్యువాతపడ్డారు. కరోనా వైరస్‌ బారినపడి ముంబయి నగరానికి చెందిన కార్పొరేటర్‌(ఎన్‌సీపీ) మృతి చెందారు. అంతకుముందు శివసేన పార్టీకి చెందిన కార్పొరేటర్‌ కూడా మృతి చెందిన విషయం తెలిసిందే. దేశంలో కరోనా కేసులు, మరణాలు సంభవిస్తున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర ముందు స్థానంలో ఉంది. అయితే, కరోనా సోకినవారిలో ఇప్పటివరకు 42వేల మంది కోలుకోవడం కాస్త ఉపశమనం కలిగిస్తోంది.

తమిళనాడులో 35వేల కేసులు..
మహారాష్ట్ర అనంతరం తమిళనాడులో కరోనా వైరస్‌ తీవ్రత ఉధ్ధృతంగా ఉంది. నిన్న ఒక్కరోజే కొత్తగా 1685 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 34,914కి చేరగా వీరిలో ఇప్పటివరకు 307 మంది మృత్యువాతపడ్డారు. తాజాగా డీఎంకే ఎమ్మెల్యే అన్బళగన్‌ కూడా కరోనా బారినపడి చనిపోయారు.

దిల్లీలో 31వేల కేసులు, 900మరణాలు..
దేశ రాజధాని దిల్లీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలో కేసుల సంఖ్య 31,309కి చేరగా వీరిలో ఇప్పటికే 905మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజే దిల్లీలో 1366 కేసులు నమోదయ్యాయి. ఈ తరహా కేసులతో దిల్లీలో జులై 31నాటికి 5.5లక్షల కేసులు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్లు దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా వెల్లడించారు. 
ఇక కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న గుజరాత్‌లో కొవిడ్‌ మరణాల సంఖ్య 1313కి చేరింది. ఇప్పటివరకు మధ్యప్రదేశ్‌లో 420, పశ్చిమ బెంగాల్‌లో 415, తమిళనాడులో 307, ఉత్తర్‌ప్రదేశ్‌లో 301 కరోనా మరణాలు సంభవించాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని