
తాజా వార్తలు
ఎన్డీయేకు మరో కూటమి పార్టీ నిరసన సెగ!
దిల్లీ: వ్యవసాయ చట్టాల విషయంలో కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి మరో కూటమి పార్టీ నుంచి అసమ్మతి సెగ తాకింది. కేంద్రం నూతన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలంటూ ఎన్డీయే కూటమి పార్టీ అయిన రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ(ఆర్ఎల్పీ) కోరింది. ఈ మేరకు ఆ పార్టీ ఎంపీ హనుమాన్ బనివాల్ కేంద్ర ప్రభుత్వానికి ట్విటర్ వేదికగా విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు దిల్లీకి కదం తొక్కిన తరుణంలో ప్రభుత్వం తక్షణమే వాటిని రద్దు చేయాలంటూ ఆయన భాజపాను కోరారు.
‘కేంద్ర ప్రభుత్వం తక్షణమే రైతులతో చర్చలు జరపాలి. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా దేశవ్యాప్తంగా రైతుల నిరసనల్ని, వారి మనోభావాల్ని దృష్టిలో పెట్టుకుని.. ఇటీవల తెచ్చిన వ్యవసాయ చట్టాల్ని వెనక్కి తీసుకునే విషయమై ఆలోచించాలి. స్వామినాథన్ కమిటీ ప్రతిపాదించిన అన్ని అంశాల్ని అమలుపై స్పష్టత ఇస్తూ.. తక్షణమే రైతులతో చర్చలు చేపట్టాలి’ అని హనుమాన్ ట్వీట్లో పేర్కొన్నారు.
ఎన్డీయే కూటమిలో తమ పాత్ర గురించి వెల్లడిస్తూ..‘ఆర్ఎల్పీ... ఎన్డీయేలో ఒక భాగం మాత్రమే. కానీ ఆర్ఎల్పీకి అధికారం రైతులు, సైనికుల వల్లే వచ్చింది. రైతుల విషయంలో కేంద్రం వెంటనే సరైన చర్యలు చేపట్టకపోతే... రైతుల ప్రయోజనాల దృష్ట్యా మేం ఎన్డీయే కూటమిలో భాగస్వామ్యం విషయంలో పునరాలోచించాల్సి వస్తుంది. అంతేకాకుండా పోలీసులు, ప్రభుత్వాలు రైతులపై అణచివేత విధానాలు అవలంబిస్తే.. రైతులకు అనుకూలంగా ఆర్ఎల్పీ దేశవ్యాప్తంగా ప్రదర్శనలు నిర్వహిస్తుంది’ అంటూ హనుమాన్ దిల్లీలో రైతుల నిరసనల్లో భాగం కానున్నట్లు పరోక్ష సంకేతాలు ఇచ్చారు.
కాగా, దిల్లీ సరిహద్దుల్లో ఐదు రోజులుగా రైతుల నిరసనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రైతులతో చర్చలు జరపాలంటూ.. భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు సహా కూటమి పార్టీల నుంచి తీవ్ర ఒత్తిడి ఎదురవుతోంది. మరోవైపు కేంద్రం ఎలాంటి నిబంధనలు విధించకుండా చర్చలకు ఆహ్వానిస్తే తాము సిద్ధమేనని రైతులు చెబుతున్నారు. ఈ వ్యవసాయ చట్టాల విషయంలో ఇప్పటికే ఎన్డీయే నుంచి పంజాబ్‌కు చెందిన శిరోమణి అకాలీదళ్ బయటకు వచ్చింది. ఆ పార్టీ నుంచి కేంద్ర మంత్రిగా ఉన్న హర్సిమ్రత్ కౌర్ బాదల్ తన పదవికి రాజీనామా చేశారు.
ఇదీ చదవండి
రైతుల లబ్ది కోసమే కొత్త వ్యవసాయ చట్టాలు: మోదీ