దిల్లీలో అన్నిరకాల టపాసులపై సంపూర్ణ నిషేధం

తాజా వార్తలు

Published : 09/11/2020 13:27 IST

దిల్లీలో అన్నిరకాల టపాసులపై సంపూర్ణ నిషేధం

హరిత ట్రైబ్యూనల్‌ తాజా ఆదేశాలు

దిల్లీ: దేశ రాజధాని దిల్లీ, ఎన్‌సీఆర్‌ ప్రాంతాల్లో నవంబరు 9 అర్ధరాత్రి నుంచి నవంబరు 30 వరకు అన్ని రకాల టపాసుల అమ్మకాలు, వినియోగంపై జాతీయ హరిత ట్రైబ్యూనల్‌(ఎన్‌జీటీ) సంపూర్ణ నిషేధం విధించింది. అంతేగాక, నవంబరులో గాలి నాణ్యత(గతేడాది డేటా ప్రకరాం) తక్కువగా ఉండే దేశంలోని ఇతర నగరాలు, ప్రాంతాలకు కూడా ఇవే ఆదేశాలు వర్తిస్తాయని ట్రైబ్యూనల్‌ ఛైర్‌పర్సన్‌ జస్టిస్‌ ఆదర్శ్‌ కుమార్‌ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. 

ఇక గాలి నాణ్యత సాధారణంగా ఉండే ప్రాంతాల్లో కేవలం హరిత టపాసులను మాత్రమే విక్రయించాలని వెల్లడించింది. దీపావళి, క్రిస్మస్‌, కొత్త సంవత్సర వేడుకల్లో బాణసంచా పేల్చుకోవడానికి కేవలం రెండు గంటలు మాత్రమే అనుమతించాలని స్పష్టం చేసింది. కాలుష్యంతో కొవిడ్‌ 19 వైరస్‌ మరింత వ్యాప్తిచెందే ప్రమాదం ఉన్నందున వాయు కాలుష్య నియంత్రణకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని ఎన్‌జీటీ ఆదేశాలు జారీ చేసింది. 

కొవిడ్‌ మహమ్మారి సమయంలో వాయు కాలుష్యం ప్రమాదకరంగా మారుతోందని, దీనిపై చర్యలు తీసుకోవాలని ట్రైబ్యూనల్‌లో పిటిషన్‌ దాఖలైంది. దిల్లీలో గాలి నాణ్యత దారుణ స్థితికి పడిపోయిందని, హరిత టపాసులు కూడా శ్రేయస్కరం కాదని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం దేశ రాజధానిలో అన్ని రకాల టపాసులపై నిషేధం విధించింది. ఇక దేశంలోని పలు రాష్ట్రాల్లో కూడా బాణాసంచాపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే కొన్ని చోట్ల హరిత టపాసులకు ప్రభుత్వాలు అనుమతినిచ్చాయి.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని