‘అమెరికా.. మా విషయంలో జోక్యం తగదు’ 
close

తాజా వార్తలు

Updated : 28/10/2020 14:52 IST

‘అమెరికా.. మా విషయంలో జోక్యం తగదు’ 

భారత్‌కు మద్దతుపై చైనా అక్కసు

దిల్లీ: సరిహద్దు సమస్య రెండు దేశాలకు సంబంధించిన ద్వైపాక్షిక అంశమని ఇందులో మూడో పక్షం జోక్యం అనవసరమని అగ్రరాజ్యం అమెరికాను ఉద్దేశిస్తూ చైనా విమర్శల దాడికి దిగింది. భారత్‌కు తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని అమెరికా ఉద్ఘాటించిన నేపథ్యంలో డ్రాగన్‌ దేశం మరోసారి తన అక్కసు వెళ్లగక్కింది. అమెరికాది పక్షపాత ధోరణి, ప్రచ్ఛన్న యుద్ధ మనస్తత్వం అంటూ అగ్రరాజ్యంపై బుసలుకొట్టింది. 

భారత పర్యటనలో ఉన్న అమెరికా రక్షణ, విదేశీ వ్యవహారాల మంత్రులు మార్క్‌ ఎస్పర్‌, మైక్‌ పాంపియోలు లద్దాఖ్‌ విషయంలో చైనాకు నిన్న గట్టి హెచ్చరికలు చేసిన విషయం తెలిసిందే. సార్వభౌమత్వం, స్వేచ్ఛను కాపాడుకునేందుకు భారత్‌ చేసే ప్రయత్నాల్లో అమెరికా అండగా ఉంటుందని వారు స్పష్టం చేశారు. దీంతో పాంపియో, ఎస్పర్‌ పర్యటనపై చైనా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. భారత్‌-చైనా విషయంలో అమెరికా జోక్యం ఎంతమాత్రం తగదంటూ దిల్లీలోని చైనా ఎంబసీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.

‘సరిహద్దు సమస్య అనేది చైనా, భారత్‌ మధ్య ద్వైపాక్షిక అంశం. దౌత్య, సైనిక పరమైన చర్చల ద్వారా సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తతలను తొలగించుకునేందుకు ఇరు దేశాలు యత్నిస్తున్నాయి. విభేదాలను పరిష్కరించుకునే తెలివి, సామర్థ్యం భారత్‌, చైనాకు ఉన్నాయి. ఇందులో మూడో పక్షం జోక్యం చేసుకునేందుకు ఎలాంటి అవకాశం లేదు’ అని చైనా ఎంబసీ కార్యాలయం ఆ ప్రకటనలో పేర్కొంది. 

ఈ సందర్భంగా అమెరికాపై చైనా ఘాటు వ్యాఖ్యలు చేసింది. ‘చైనా ముప్పు’ అని పదేపదే చెబుతూ అమెరికా ప్రపంచంపై తన ఆధిపత్యాన్ని పెంచుకోవాలని చూస్తోందని దుయ్యబట్టింది. ‘చైనీస్‌ కమ్యూనిస్ట్‌ పార్టీవి బెదిరింపు వ్యూహాలు అని పాంపియో చాలా సార్లు విమర్శించారు. కానీ అదే కమ్యూనిస్ట్‌ పార్టీ నాయకత్వంలో చైనా ప్రజలు కొవిడ్‌ వైరస్‌పై వ్యూహాత్మక విజయాన్ని సాధించారు’ ఆ ప్రకటనలో తెలిపింది. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని