close
Array ( ) 1

తాజా వార్తలు

‘కరోనా’ దెబ్బకు ‘డ్రాగన్‌’  విలవిల

మాంసం వినియోగంపై చైనా నిషేధం
దక్షిణ కొరియాలో పరిస్థితి ఆందోళనకరం

ఇంటర్నెట్‌ డెస్క్‌: చైనాలో విజృంభించిన కరోనా (కొవిడ్‌ 19‌) వైరస్‌ ప్రపంచ దేశాలను తీవ్రంగా భయపెడుతోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటివరకు ఈ ప్రాణాంతక మహమ్మారి బారినపడి ఇప్పటిదాకా మొత్తం 2,705 మంది ప్రాణాలు కోల్పోగా, ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 80వేల మంది దీని ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నట్టు అధికారులు వెల్లడించారు. చైనాలో కొత్తగా మరో 508 కేసులను మంగళవారం ఆ దేశ జాతీయ ఆరోగ్య కమిషన్‌ నిర్థారించింది. వీటిలో తొమ్మిది కేసులు మినహా మిగతావన్నీ హుబెయ్‌ ప్రావిన్స్‌లోనే నమోదు కావడం అక్కడి తీవ్రతకు అద్ధంపడుతోంది. చైనాతో పాటు కొవిడ్‌ దాటికి అనేక దేశాలు విలవిలలాడుతున్నాయి. తాజాగా దక్షిణ కొరియా దీనిపై తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తోంది.

చైనాలో పరిస్థితి ఎలా ఉందంటే?
చైనాలో మంగళవారం 71 మృతులు నమోదయ్యాయి. గత రెండు వారాలతో పోలిస్తే ఇదే అత్యంత అల్ప సంఖ్య కావడం గమనార్హం. జనవరి 23 నుంచి ఫిబ్రవరి 2 వరకు చైనాలో భారీగా మృతుల సంఖ్య నమోదు కాగా.. ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ వస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చీఫ్‌ టెడ్రోస్‌ అద్నాన్‌ గేబ్రెయెసెస్‌ వెల్లడించారు. ఈ వైరస్‌ సృష్టించిన కల్లోలంతో చైనా వార్షిక పార్లమెంట్‌ సమావేశాలను వాయిదా వేయాలని నిర్ణయించింది. చైనా సాంస్కృతిక విప్లవం తర్వాత ఈ సమావేశాలను వాయిదా వేసుకోవాల్సి రావడం ఇదే ప్రథమం. హుబేయి ప్రావిన్స్‌లో లక్షలాది మంది ప్రజలపై ఆంక్షలు ఇంకా కొనసాగుతున్నాయి. హుబెయ్‌ ప్రావిన్స్‌లోని వుహాన్‌ నగరంలో నిర్బంధ ఆంక్షలు సడలించిన కొద్ది సేపటికే మళ్లీ సోమవారం ఉపసంహరించుకున్నారు.  ఇప్పటివరకు ఈ వైరస్‌ బారినపడి చైనాలో 2663 మంది మృతిచెందగా.. 77,658 మంది ఈ వైరస్‌ లక్షణాలతో బాధపడుతున్నారు. వీటిలో అధికంగా హుబెయ్‌ ప్రావిన్స్‌లోనే నమోదయ్యాయి. కరోనా వ్యాప్తి అదుపులోనే ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. ఈ మహమ్మారిని నియంత్రించేందుకు చైనా చాలా కష్టపడుతోందని, దాన్ని సమర్థవంతంగా
 నియంత్రిస్తోందని దిల్లీలో పలు కంపెనీల సీఈవోలతో నిర్వహించిన సమావేశంలో వ్యాఖ్యానించారు. 

మాంసం వినియోగంపై డ్రాగన్‌ నిషేధం
కరోనా మహమ్మారి వణికిస్తున్న నేపథ్యంలో చైనా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వన్యప్రాణుల మాంసం వినియోగం, వాణిజ్యంపై నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించింది. తమ దేశ పౌరుల ప్రాణాల్ని బలిగొన్న ఈ ప్రాణాంతక వైరస్‌ను ఎదుర్కోవడమే లక్ష్యంగా లక్షలాది మందికి ఉపాధి కల్పించే బిలియన్ల డాలర్ల పరిశ్రమపై నిషేధాజ్ఞలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. వన్యప్రాణుల్ని తినడం వల్ల ఆరోగ్యానికి ముప్పు పొంచి ఉందన్న నేపథ్యంలో ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది. తక్షణమే ఇది అమలులోకి వస్తుందని వెల్లడించింది. 

దక్షిణ కొరియాలో మాస్క్‌ల కోసం జనం బారులు 
చైనాలోని వుహాన్‌లో మొదలైన ఈ వైరస్‌ పొరుగు దేశాలపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. దక్షిణ కొరియాలో మంగళవారం కొత్తగా 60 కేసులు నమోదుకావడంతో అక్కడి ప్రభుత్వం ఆందోళన వ్యక్తంచేస్తోంది. ఇప్పటివరకు మొత్తం 893 కేసులు నమోదు కాగా.. ఎనిమిది మంది మృత్యువాతపడ్డారు. తమ దేశంలో పరిస్థితి చాలా దారుణంగా ఉందని దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్‌ జే ఇన్‌  వ్యాఖ్యానించారు. ఎక్కువ కేసులు నమోదైన డేగులోని  ఓ ఆస్పత్రిని సందర్శించిన అనంతరం ఆయన మాట్లాడారు. కరోనా వైరస్‌పై పోరాటంలో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తంచేశారు. 2.5 మిలియన్ల జనాభా ఉన్న డేగు వీధుల్లో పెద్ద సంఖ్యలో జనం మాస్క్‌ల కోసం బారులు తీరుతున్నారు. ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని, జ్వరం, శ్వాస సంబంధమైన సమస్యలు ఉంటే ఇళ్లకు దూరంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. 


 

ఇరాన్‌లో మరో ముగ్గురు మృతి
చైనా తర్వాత కొవిడ్‌ 19తో ఎక్కువ మరణాలు ఇరాన్‌లోనే నమోదయ్యాయి. సోమవారం వరకు 12 మంది మృతిచెందగా.. మంగళవారం తాజాగా మరో ముగ్గురు మృతిచెందినట్టు అక్కడి మీడియా వెల్లడించింది. దీంతో కరోనా మృతుల సంఖ్య 15కు చేరింది. ఇరాన్‌లో 61 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఇరాన్‌కు యూఏఈ అన్ని విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఇరాన్‌ నుంచి వెళ్లే అన్ని ప్రయాణికుల విమానాలు, కార్గో విమాన సర్వీసులను వారం రోజుల పాటు రద్దు చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ గడువు ఇంకా పొడిగించే అవకాశం ఉందని పేర్కొన్నారు. 

ఇటలీ ఆర్థిక ఇంజిన్‌పై ‘కరోనా’ పంజా!
ఇటలీలీపై కరోనా పంజా విసిరింది. ఇప్పటివరకు 229 కేసులు నమోదు కాగా.. ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో మిలాన్‌లోని డ్యుమో కెథడ్రాల్‌ మూతపడింది. ప్రీమియర్‌ ఒపేరా హౌస్‌తో పాటు నగరంలోని విశ్వవిద్యాలయాలు, పాఠశాలలను అధికారులు  మూసివేశారు. పలు చోట్ల బార్‌లు కూడా తెరుచుకోవడంలేదు. నిత్యం రద్దీగా ఉండే మిలాన్‌ వీధులు, రెస్టారెంట్లు, దుకాణాలన్నీ బోసిపోయాయి. పలు ప్రైవేటు కంపెనీలు, బ్యాంకులు ఇంటి నుంచే పని చేసే వెసులుబాటును కల్పించాయి. ఇటలీ సాంస్కృతిక రాజధాని, ఆర్థిక ఇంజిన్‌గా ఉన్న మిలాన్‌లో కరోనా వైరస్‌ కేసులు పెరగడంతో ఇలాంటి ఆందోళనకర పరిస్థితి నెలకొంది. 

కరోనా మృతులు ఎక్కడెక్కడ ఎన్నెన్ని? 
కరోనా ధాటికి ఇప్పటివరకు చైనాతో పాటు అనేక దేశాల్లో 2705 మరణాలు సంభవించాయి. వీటిని దేశాల వారీగా పరిశీలిస్తే.. చైనాలో 2663, హాంకాంగ్‌ 2, జపాన్‌ 5 (డైమండ్‌ ప్రిన్స్‌ నౌకలో 4తో కలిపి), దక్షిణ కొరియా 10, ఇటలీ 7, ఇరాన్‌ 15, అమెరికా 1 (అమెరికా పౌరుడు చైనాలో మృతి), తైవాన్‌ 1, ఫ్రాన్స్‌ 1, ఫిలిప్పీన్స్‌ 1 చొప్పున మరణాలు నమోదయ్యాయి.  


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.