close

తాజా వార్తలు

‘క్షమాభిక్ష’పై నిర్భయ దోషి పిటిషన్‌ కొట్టివేత

దిల్లీ: తన క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి తిరస్కరించడాన్ని సవాల్‌ చేస్తూ నిర్భయ కేసు దోషి ముకేశ్‌ కుమార్‌ సింగ్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఈ కేసులో అన్ని పత్రాలు చూసిన తర్వాతే రాష్ట్రపతి క్షమాభిక్ష అభ్యర్థనపై నిర్ణయం తీసుకున్నారని కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో ట్రయల్‌ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులను కేంద్ర హోంశాఖ రాష్ట్రపతికి అందజేసినట్లు తెలిపింది. 

ముకేశ్‌ వాదనలో ఎలాంటి మెరిట్‌ లేదని న్యాయస్థానం ఈ సందర్భంగా అభిప్రాయపడింది. జైల్లో దోషి ఎదుర్కొన్న బాధను ఆధారంగా చేసుకుని క్షమాభిక్ష తిరస్కరణను సవాల్‌ చేయడం సరైందని కాదని, కేవలం జైల్లో వేధించారన్న కారణంగా రాష్ట్రపతి నిర్ణయాన్ని సమీక్షించలేమని పేర్కొంది. క్షమాభిక్షను వేగంగా తిరస్కరించడం అంటే దానర్థం ఆలోచన లేకుండా తీసుకున్న నిర్ణయం కాదని సూచించింది. 

నిర్భయ కేసులో మరణశిక్ష ఎదుర్కొంటున్న నలుగురు దోషుల్లో ఒకడైన ముకేశ్‌ కుమార్‌ సింగ్‌ తనకు క్షమాభిక్ష పెట్టాలని కోరుతూ ఇటీవల రాష్ట్రపతికి దరఖాస్తు చేసుకున్నాడు. అయితే ఈ అభ్యర్థనను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ కేవలం నాలుగు రోజుల్లోనే తిరస్కరించారు. దీంతో రాష్ట్రపతి నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ ముకేశ్ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. 

ఈ పిటిషన్‌పై జస్టిస్‌ ఆర్‌. భానుమతి నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం మంగళవారం సుదీర్ఘ విచారణ జరిపింది. ముకేశ్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది అంజనా ప్రకాశ్‌, ప్రభుత్వం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపించారు. క్షమాభిక్షకు దరఖాస్తు చేసుకున్న సమయంలో దోషికి సంబంధించిన అన్ని రికార్డులను రాష్ట్రపతి ముందు పెట్టాలని, అయితే అధికారులు అలా చేయలేదని ముకేశ్‌ న్యాయవాది కోర్టుకు తెలిపారు. అభ్యర్థనపై ఎలాంటి ఆలోచన చేయకుండానే రాష్ట్రపతి తిరస్కరించారని అన్నారు. అంతేగాక, జైల్లో ముకేశ్‌పై లైంగిక దాడి జరిగిందని ఆరోపించారు. 

కాగా.. ముకేశ్‌ వాదనలను సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా తీవ్రంగా ఖండించారు. జైల్లో దోషి పడిన బాధను క్షమాభిక్ష కింద పరిగణనలోకి తీసుకోరని అన్నారు. అంతేగాక, ముకేశ్ మానసిక, శారీరక ఆరోగ్య పరిస్థితి కూడా బాగానే ఉందని వివరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. ముకేశ్ పిటిషన్‌ను కొట్టివేస్తూ బుధవారం తీర్పు వెలువరించింది.

ఇదీ చదవండి:  ఫిబ్రవరి 1న ఉరి పడేనా..?



Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.