దిల్లీలో ‘సమూహ వ్యాప్తి’ లేదు..
close

తాజా వార్తలు

Updated : 09/06/2020 13:53 IST

దిల్లీలో ‘సమూహ వ్యాప్తి’ లేదు..

పరిస్థితిపై ఎల్జీ కీలక సమావేశం

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో కరోనా వైరస్‌ మహమ్మారి విశ్వరూపం చూపిస్తోంది. గత కొన్నిరోజులుగా రాష్ట్రంలో కరోనా తీవ్రత ఒక్కసారిగా పెరగడంతోపాటు మరణాల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. మంగళవారం నాటికి రాష్ట్రంలో 29,943 కేసులు నమోదుకావడంతోపాటు వీరిలో ఇప్పటివరకు 874 మంది మృత్యువాతపడ్డారు. రాబోయే రెండు వారాల్లో రాష్ట్రంలో కేసుల సంఖ్య 56వేలకు చేరుకుంటుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. అయితే దిల్లీలో సమాహ వ్యాప్తి ఉన్నట్లు వస్తున్న వార్తలపై ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా స్పష్టత ఇచ్చారు. దేశ రాజధానిలో సమూహ వ్యాప్తి లేనట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో పరిస్థితిపై లెఫ్టినెంట్‌ గవర్నర్‌తో జరిగిన కీలక సమావేశం అనంతరం ఈ విషయాన్ని సిసోడియా వెల్లడించారు.

అయితే అంతకుముందు వైరస్ ‘సమూహ వ్యాప్తి’ దశలో ఉన్నట్లు దిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్‌ జైన్‌ వెల్లడించారు. ఇదే విషయాన్ని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా కూడా చెప్పినట్లు తెలిపారు.  రాష్ట్రంలో నమోదవుతున్న పాజిటివ్‌ కేసుల్లో సగం కేసుల్లో వైరస్‌ ఎవరి నుంచి వ్యాపించిందో తెలియడం లేదని ఆరోగ్యశాఖ మంత్రి స్పష్టం చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వ అధికారులు మాత్రం సమూహ వ్యాప్తి లేదని తేల్చడం గమనార్హం.

అయితే, రాష్ట్రంలో వైరస్‌ తీవ్రత పెరిగిన దృష్ట్యా  లెఫ్టినెంట్‌ గవర్నర్‌ నేతృత్వంలో ఈ రోజు కీలక సమావేశాన్ని నిర్వహించారు. విపత్తు నిర్వహణ విభాగానికి అధిపతిగా ఉన్న ఎల్జీ  నేతృత్వంలో జరిగిన ఈ కీలక సమావేశంలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. అయితే, కరోనా వైరస్‌ లక్షణాలతో స్వీయ నిర్బంధంలో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఈ సమావేశానికి హాజరుకాలేదు. ఆయన స్థానంలో ప్రభుత్వం తరఫున ఉపముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అరవింద్‌ కేజ్రీవాల్‌ నుంచి ఈ రోజు నమూనాలను సేకరించి పరీక్షలకు పంపించారు. దీని ఫలితం ఈ సాయంత్రం లేదా రేపు ఉదయం వెల్లడయ్యే అవకాశం ఉంది.
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని