ఆ సమాచారం బయటకు చెప్పొద్దు: ఓం బిర్లా

తాజా వార్తలు

Published : 26/08/2020 13:51 IST

ఆ సమాచారం బయటకు చెప్పొద్దు: ఓం బిర్లా

దిల్లీ: పార్లమెంట్‌ స్థాయీ సంఘ సమావేశాల సమాచారం బయటకు రావడం, మీడియాలో కథనాలు వస్తుండటంపై లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా విస్మయం వ్యక్తం చేశారు. పార్లమెంట్‌లో నివేదిక ప్రవేశపెట్టే ముందే అన్ని విషయాలు బయటకు రాకుండా దృష్టి సారించాలని అన్ని కమిటీల ఛైర్మన్‌లను స్పీకర్‌ కోరారు. ఈమేరకు కమిటీల ఛైర్మన్‌లకు ఓం బిర్లా లేఖ రాశారు.

 పార్లమెంటరీ కమిటీల చర్చలు, విషయాలు గోప్యంగా ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. కమిటీ నివేదికలు పార్లమెంట్‌లో టేబుల్‌ చేసే వరకు సభ్యులు కమిటీల్లో  జరిగే చర్చల వివరాలు మీడియాకు చెప్పకూడదని లేఖలో పేర్కొన్నారు. రూల్‌ 270 ప్రకారం సబ్జెక్టుల ఎంపిక సమయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రూల్‌ 270 ప్రకారం... ఎవరైనా పత్రం లేదా రికార్డును పరిశీలించే విషయంలో స్పీకర్‌ అభిప్రాయం తీసుకోవాలని, ఆవిషయాల్లో స్పీకర్‌ నిర్ణయమే శిరోధార్యమని స్పష్టం చేశారు. సంప్రదాయం ప్రకారం కోర్టులలో పెండింగ్‌లో ఉన్న విషయాలను కమిటీలు చర్చకు తీసుకోవద్దని పేర్కొన్నారు. 

 భవిష్యత్‌ కమిటీల సమావేశాలలో అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పార్లమెంటరీ కమిటీల సభ్యులందరూ దేశ ప్రయోజనాల కోసం పనిచేయాలని, ఆవిధంగా చర్చలు జరపాలని లేఖలో పేర్కొన్నారు. ఫేస్‌బుక్‌ వివాదంపై పార్లమెంట కమిటీలో ..ఫేస్‌బుక్‌ అధికారులను కమిటీ ఛైర్మన్‌ శశిథరూర్‌ సమన్‌ చేయడంపై వివాదమేర్పడింది. ఐటీ  పార్లమెంటరీ కమిటీకి ఫేస్‌బుక్‌ అధికారులను పిలిపించిన వ్యవహారంపై లోక్‌సభ స్పీకర్‌కు భాజపా సభ్యులు నిషికాంత్‌ దుబే, రాజ్యవర్థన్‌రాఠోడ్‌ ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో లోక్‌సభ స్పీకర్‌ స్పందించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని