భారత్‌లో ఒకేరోజు 4200 పాజిటివ్‌ కేసులు

తాజా వార్తలు

Updated : 11/05/2020 13:25 IST

భారత్‌లో ఒకేరోజు 4200 పాజిటివ్‌ కేసులు

దిల్లీ: భారత్‌లో కరోనా వైరస్‌ విలయతాండవం చేస్తోంది. కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. తాజాగా ఆదివారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 4200 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దేశంలో వైరస్‌ బయటపడ్డ అనంతరం అత్యధిక కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. లాక్‌డౌన్‌ సడలింపులు ప్రారంభమైన తరుణంలో కేసుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. తాజా గణాంకాల ప్రకారం.. సోమవారం ఉదయం వరకూ దేశవ్యాప్తంగా మొత్తం 67,152పాజిటివ్‌ కేసులు నమోదుకావడంతోపాటు 2206 మంది మృత్యువాతపడ్డారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొత్తం బాధితుల్లో ఇప్పటివరకూ 20,917 మంది కోలుకోగా మరో 44,029 మంది చికిత్స పొందుతున్నారని తెలిపింది. ఇదిలా ఉంటే, రేపటి నుంచి దేశరాజధాని దిల్లీ నుంచి 15 ప్రధాన నగరాలకు ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. మంగళవారం బయలుదేరే ఈ రైళ్లకు సోమవారం సాయంత్రం ఐఆర్‌సీటీసీ ద్వారా ఆన్‌లైన్‌ రిజర్వేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతున్న తీరు, రాష్ట్రాలకు సూచనలతోపాటు అభిప్రాయాలను తెలుసుకునేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేటి సాయంత్రం అన్నిరాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. 

మహారాష్ట్ర, గుజరాత్‌లలో ఆందోళనకరం..

దేశంలో నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్ర, గుజరాత్‌లలోనే నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా అదే స్థాయిలో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. కేవలం ఆదివారం ఒక్కరోజే రాష్ట్రంలో కరోనా బాధితుల్లో 53మంది మరణించారు. తాజాగా మహారాష్ట్రలో మొత్తం కేసుల సంఖ్య 22,171కి చేరగా 832 మంది మృత్యువాతపడ్డారు. గుజరాత్‌, మధ్యప్రదేశ్‌లలో మరణాల రేటు కలవరపెడుతోంది. గుజరాత్‌లో ఇప్పటివరకు మొత్తం 8194 కేసులు నమోదు కాగా 493మంది ప్రాణాలు కోల్పోయారు. మధ్యప్రదేశ్‌లోనూ కొవిడ్‌ ఉద్ధృతి కొనసాగుతోంది. రాష్ట్రంలో మొత్తం 3614 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కాగా ఇప్పటివరకు 215మంది మరణించారు. దేశ రాజధాని దిల్లోలో వైరస్‌ బారినపడినవారి సంఖ్య 6923కి చేరగా 73మంది మరణించారు. 

తమిళనాడులో ఆదివారం ఒక్కరోజే కొత్తగా 669 కేసులు నమోదుకావడంతో మొత్తం బాధితుల సంఖ్య 7204కి చేరింది. వీరిలో ఇప్పటివరకు 47మంది ప్రాణాలు కోల్పోయారు. పశ్చిమ బెంగాల్‌లో ఇప్పటివరకు 185మంది మృత్యువాతపడగా మొత్తం 1939 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రాజస్థాన్‌లో ఇప్పటివరకు కరోనా సోకిన ప్రాణాలు కోల్పోయిన వారిసంఖ్య 107కు చేరగా 3814 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. 

ఆంధ్రప్రదేశ్‌లో 1980, తెలంగాణలో 1196 కేసులు..

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ తీవ్రత కొనసాగుతూనే ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో నిన్న ఒక్కరోజే 50పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కావడంతో మొత్తం బాధితుల సంఖ్య 1980కి చేరింది. వీరిలో ఇప్పటివరకు 45మంది చనిపోయారు. ఇక తెలంగాణలో నిన్న కొత్తగా 33 కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1196కి చేరగా ఇప్పటివరకు 30మంది ప్రాణాలు కోల్పోయారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని