ఆ దేశాలను దోషులుగా నిలబెట్టాల్సిందే..: మోదీ

తాజా వార్తలు

Published : 17/11/2020 18:47 IST

ఆ దేశాలను దోషులుగా నిలబెట్టాల్సిందే..: మోదీ

ఉగ్రవాదమే ప్రపంచానికి అతి పెద్ద సవాల్‌
ఐరాసలో సంస్కరణలు తక్షణ అవసరం
బ్రిక్స్‌ సదస్సులో ప్రధాని కీలక ప్రసంగం

దిల్లీ: ప్రపంచం నేడు ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్‌ ఉగ్రవాదమని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. మంగళవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ నేతృత్వంలో ప్రారంభమైన బ్రిక్స్‌ దేశాల సదస్సులో వర్చువల్‌ ద్వారా ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ఉగ్రవాదులకు మద్దతిచ్చే దేశాలపై చర్యలు తీసుకోవాలన్నారు. ఉగ్రవాదులకు అనుకూలంగా వ్యవహరించే దేశాలను జవాబుదారీ చేయడంతో పాటు వాటిని దోషులుగా నిలబెట్టాలన్నారు. ఉగ్రవాదంపై బ్రిక్స్‌ దేశాలన్నీ ఉమ్మడిగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఐరాసలో తక్షణ సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. పలు అంతర్జాతీయ సంస్థల విశ్వసనీయత, పనితీరుపై అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయన్నారు. ఐరాస వ్యవస్థాపక దేశంగా ఉండటంతో ఆ సంస్థ విలువలను భారత్‌ ఎప్పుడూ సమర్థిస్తూ వచ్చిందన్న మోదీ.. ఆ సంస్థ మాత్రం మారుతున్న కాలానికి అనుగుణంగా లేదన్నారు.

ఐరాస భద్రతా మండలితో పాటు ఐఎంఎఫ్‌, డబ్ల్యూటీవో, డబ్ల్యూహెచ్‌వో వంటి సంస్థలను సంస్కరించాల్సిన అవసరం ఉందని మోదీ అభిప్రాయపడ్డారు. పలు అంతర్జాతీయ సంస్థల్లో కాలనుగుణ మార్పులు లేవన్నారు. ఆయా సంస్థలు ఇప్పటికీ 75 ఏళ్ల నాటి ఆలోచనా విధానం, నాటి వాస్తవ పరిస్థితుల ఆధారంగా పనిచేస్తున్నాయని విమర్శించారు. ఐరాస భద్రతా మండలిలో సంస్కరణలు అనివార్యమని భారత్‌ భావిస్తోందని స్పష్టంచేశారు. ఇందుకు బ్రిక్స్‌ దేశాల మద్దతును కోరుతున్నట్టు చెప్పారు.

కరోనా నుంచి బయటపడే అంశంలో బ్రిక్స్‌ దేశాలు కీలక పాత్ర పోషించాయన్న మోదీ.. 150కి పైగా దేశాలకు భారత్‌ ఔషధాలను అందించిన విషయాన్ని గుర్తు చేశారు. వ్యాక్సిన్‌ను కూడా మానవతా దృక్పథంతో సరఫరా చేస్తామన్నారు. కరోనా అనంతరం ఆర్థిక వ్యవస్థ కోలుకోవడంలో బ్రిక్స్‌ దేశాలది కీలక పాత్ర అన్నారు. సరఫరా వ్యవస్థ మెరుగుదలకు భారత్‌ ఆత్మనిర్భర్‌ విధానం ఎంతగానో దోహదం చేసిందని బ్రిక్స్‌ సదస్సులో మోదీ ప్రస్తావించారు. ఈ సదస్సులో సభ్య దేశాలైన బ్రెజిల్‌, చైనా, దక్షిణాఫ్రికా అధినేతలు పాల్గొని ప్రసంగించారు.

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని