
తాజా వార్తలు
తేలికైన భాషలో టీకా సమాచారం ఇవ్వాలి
మూడు వ్యాక్సిన్ అభివృద్ధి సంస్థలతో మోదీ భేటీ
దిల్లీ: కరోనా వ్యాక్సిన్ అభివృద్ధికి కృషి చేస్తున్న మరో మూడు సంస్థల ప్రతినిధులతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం సమావేశమయ్యారు. జెనోవా బయోఫార్మా, బయోలాజికల్ ఈ, డాక్టర్ రెడ్డీస్ సంస్థల ప్రతినిధులతో మోదీ వీడియోకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. కరోనా టీకా పురోగతిపై ఆరా తీశారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. వ్యాక్సిన్ ప్రయోగాలు, సామర్థ్యం తదితర సమాచారాన్ని ప్రజలకు అర్థమయ్యేలా సాధారణ భాషల్లో చెప్పేందుకు ప్రయత్నించాలని ప్రధాని కోరినట్లు తెలిపింది.
టీకా అభివృద్ధికి ఉన్న ఇతర అవకాశాల గురించి కూడా మోదీ ఈ సంస్థల ప్రతినిధులతో చర్చించినట్లు పీఎంవో కార్యాలయం తెలిపింది. వ్యాక్సిన్ రవాణా, భద్రత, పంపిణీపై చర్చించినట్లు పేర్కొంది. కరోనా టీకా రెగ్యులేటరీ ప్రక్రియ తదితర అంశాలపై సలహాలు, సూచనలు ఇవ్వాలని ప్రధాని సూచించినట్లు వెల్లడించింది. ఈ సందర్భంగా వ్యాక్సిన్ అభివృద్ధికి జెనోవా బయోఫార్మా, బయోలాజికల్, డాక్టర్ రెడ్డీస్ కంపెనీల శాస్త్రవేత్తలు చేస్తున్న కృషిని ప్రధాని మోదీ అభినందించారు.
కరోనా కోరల నుంచి విముక్తి కల్పించే కొవిడ్ వ్యాక్సిన్ కోసం దేశమంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్న వేళ.. టీకా పురోగతిపై ప్రధాని మోదీ గట్టిగా దృష్టిపెట్టారు. గత శనివారం ఒకే రోజు మూడు నగరాల్లో పర్యటించిన వ్యాక్సిన్ అభివృద్ధిని పరిశీలించారు. అహ్మదాబాద్‌లోని జైడస్ క్యాడిల్లా, హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్, పుణెలోని సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాను సందర్శించి టీకా ప్రయోగాల వివరాలను తెలుసుకున్నారు. తాజాగా మరో మూడు వ్యాక్సిన్ అభివృద్ధి, తయారీ సంస్థలతో భేటీ అయ్యారు.