
తాజా వార్తలు
‘కొవిషీల్డ్’ ప్రయోగాలను పరిశీలించిన మోదీ
పుణె: కరోనా వ్యాక్సిన్ అభివృద్ధిపై సమీక్షించేందుకు మూడు నగరాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం పుణెలోని సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాను సందర్శించారు. అక్కడ ఆస్ట్రాజెనెకా, ఆక్స్‌ఫర్డ్‌తో కలిసి సీరం సంస్థ అభివృద్ధి చేస్తున్న ‘కొవిషీల్డ్’ వ్యాక్సిన్ ప్రయోగాలను పరిశీలించారు. టీకా అందుబాటు, పంపిణీకి సంబంధించిన వివరాల గురించి శాస్త్రవేత్తలను ఆరా తీశారు. కొవిషీల్డ్ టీకా రెండు దశల ప్రయోగాలు పూర్తయ్యాయి. మూడో దశ ట్రయల్స్ కోసం అధికారిక ప్రక్రియ పూర్తయింది.
కొవిడ్ 19 నుంచి విముక్తి కల్పించే టీకా కోసం దేశమంతా ఆశగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ ఈ కీలక పర్యటన చేపట్టారు. ఒకే రోజు అహ్మదాబాద్, హైదరాబాద్, పుణెల్లో పర్యటించారు. కరోనా టీకాలను అభివృద్ధి చేస్తున్న జైడస్ క్యాడిలా, భారత్ బయోటెక్, సీరం సంస్థలను సందర్శించి.. వ్యాక్సిన్ ప్రయోగాల పురోగతిపై సమీక్షించారు.
ఈ ఉదయం అహ్మదాబాద్ చేరుకున్న మోదీ.. అక్కడి నుంచి జైడస్ బయోటెక్ పార్క్‌కు వెళ్లారు. అక్కడి శాస్త్రవేత్తలు, ఎగ్జిక్యూటివ్‌లతో సమావేశమై.. ఆ సంస్థ అభివృద్ధి చేస్తున్న ‘జైకోవ్-డి’ వ్యాక్సిన్ వివరాలను కనుక్కొన్నారు. దాదాపు గంటపాటు జైడస్ ప్లాంట్‌లో ఉన్న మోదీ.. ఆ తర్వాత హైదరాబాద్ వెళ్లారు. అక్కడ భారత్ బయోటెక్‌ను సందర్శించి కొవాగ్జిన్ టీకా ప్రయోగాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కొవాగ్జిన్ శాస్త్రవేత్తలను మోదీ అభినందించారు. అనంతరం పుణె వెళ్లి సీరంలో కొవిషీల్డ్ ట్రయల్స్‌ను సమీక్షించారు.