‘ప్లాస్మా థెరపీ’పై సందిగ్ధం..!

తాజా వార్తలు

Published : 23/10/2020 01:48 IST

‘ప్లాస్మా థెరపీ’పై సందిగ్ధం..!

తొలగించవద్దన్న దిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి

దిల్లీ: కరోనా వైరస్‌ ప్రయోగాత్మక చికిత్సలో భాగంగా ప్రస్తుతం ప్లాస్మా థెరపీని అనుసరిస్తోన్న విషయం తెలిసిందే. ఈ థెరపీ వల్ల ఆశించిన ఫలితాలు రావట్లేదని ఐసీఎంఆర్‌ ఈ మధ్యే పేర్కొంది. దీంతో కొవిడ్‌ చికిత్స మార్గదర్శకాల నుంచి ‘కన్వల్‌సెంట్‌ ప్లాస్మా థెరపీ’ని తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్లాస్మా థెరపీపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. తాజాగా దిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్‌ జైన్‌ దీనిపై స్పందించారు. ఇప్పటివరకు ఈ చికిత్స వల్ల దాదాపు 2వేల మంది రోగులకు ప్రయోజనం కలిగిందని స్పష్టంచేశారు.

కరోనా వైరస్‌ మహమ్మారికి ఇప్పటివరకు చికిత్స లేదన్న విషయం తెలిసిందే. ప్రయోగాత్మక చికిత్సలో భాగంగా వైరస్‌ బాడినపడి కోలుకున్న వారి ప్లాస్మాను ప్రస్తుత రోగికి ఎక్కించడం ద్వారా కొంత మెరుగైన ఫలితాలు ఉంటున్నట్లు ప్రపంచవ్యాప్తంగా పలు నివేదికలు స్పష్టంచేస్తున్నాయి. దీన్ని భారత్‌లోనూ ప్రయోగాత్మకంగా చేపట్టారు. దిల్లీ ప్రభుత్వం ఈ ప్రయోగానికి అధిక ప్రాధాన్యతనిచ్చింది. ఇప్పటివరకు 2వేల మంది ప్లాస్మా థెరపీ వల్ల ప్రయోజనం పొందినట్లు దిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్‌ జైన్‌ వెల్లడించారు. అంతేకాకుండా స్వయంగా తన ప్రాణాలను కాపాడటంలో కూడా ప్లాస్మా దోహదంచేసిందని పేర్కొన్నారు. అమెరికాతోపాటు ప్రపంచంలో చాలా దేశాల్లోనూ ప్లాస్మా చికిత్సపై పరిశోధనలు చేపడుతున్నట్లు ఆయన ఉదహరించారు. ఈ సమయంలో ప్లాస్మా థెరపీపై మరింత పరిశోధన జరగాల్సి ఉందన్నారు.

ఇదిలాఉంటే, కరోనా వైరస్‌ చికిత్స మార్గదర్శకాలనుంచి ప్లాస్మా థెరపీని తొలగించే ఉద్దేశంలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు ఐసీఎంఆర్‌కు చెందిన ఓ అధికారి ఈ మధ్యే వెల్లడించారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా దాదాపు 14రాష్ట్రాల్లో 464 మంది కరోనా రోగులపై ఈ ప్రయోగాలు నిర్వహించారు. అయితే వీరిలో వైరస్ తీవ్రతను తగ్గించడంలో ప్లాస్మాథెరపీ ఆశించిన ఫలితాలు ఇవ్వలేదని ఐసీఎంఆర్‌ తేల్చింది. దీంతో కొవిడ్‌-19 మార్గదర్శకాల నుంచి ఈ ప్లాస్మా థెరపీని తొలగించే విషయంపై ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌తోపాటు మరిన్ని విభాగాలతో చర్చలు జరుపుతున్నామని ఐసీఎంఆర్‌ పేర్కొంది. దీంతో ప్లాస్మా థెరపీపై మరోసారి సందిగ్ధం నెలకొంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని