close

తాజా వార్తలు

Published : 24/11/2020 13:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కాలుష్యం వల్లే దిల్లీలో కొవిడ్‌ విజృంభణ

సీఎంలతో భేటీలో ప్రధానికి తెలిపిన కేజ్రీవాల్‌

దిల్లీ: కాలుష్యం వల్లే దేశ రాజధానిలో కొవిడ్‌ మూడో దశలో విజృంభించిందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తెలిపారు. కొవిడ్‌ కేసులు అధికంగా ఉన్న 8 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా దిల్లీలో కరోనా పరిస్థితిని కేజ్రీవాల్‌.. ప్రధానికి వివరించారు. పంట వ్యర్థాలపై ప్రధాని జోక్యం చేసుకోవాలని కోరారు. 

‘కొవిడ్‌ మూడో దశ అధిక తీవ్రతకు అనేక కారణాలున్నాయి. ఇందులో ప్రధానమైనది కాలుష్యం. పొరుగున ఉన్న రాష్ట్రాల్లో పంట వ్యర్థాల వల్ల దిల్లీలో కాలుష్యం నానాటికీ పెరుగుతోంది. దీనిపై ప్రధాని జోక్యం చేసుకుని కాలుష్యాన్ని నివారించాలి’ అని కేజ్రీవాల్‌ ప్రధానిని కోరినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. మూడో దశ ప్రభావం వల్ల నవంబరు 10న దిల్లీలో రికార్డు స్థాయిలో 8,600 కేసులు నమోదయ్యాయని, అయితే ఆ తర్వాత నుంచి కేసులు తగ్గుముఖం పట్టాయని కేజ్రీవాల్‌ తెలిపారు. దిల్లీలో కొవిడ్‌ తీవ్రత ఎక్కువగా ఉన్నందున కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రుల్లో అదనంగా మరో 1000 ఐసీయూ బెడ్లు కేటాయించాలని సీఎం కోరారు.  

ఈ సందర్భంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే మాట్లాడుతూ.. రాష్ట్రంలో వ్యాక్సిన్‌ పంపిణీ కోసం ప్రత్యేకంగా టాస్క్‌ ఫోర్స్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ అధినేత అదార్‌ పూనావాలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు.  

దేశంలో కరోనా పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు సమీక్ష నిర్వహించారు. కొవిడ్‌ కేసులు అధికంగా ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశమయ్యారు. రాజస్థాన్‌, పశ్చిమబెంగాల్‌, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్‌, గుజరాత్‌, దిల్లీ, కేరళ, హరియాణా ముఖ్యమంత్రులు అశోక్‌ గెహ్లోత్‌, మమతా బెనర్జీ, ఉద్ధవ్‌ ఠాక్రే, భూపేశ్‌ భగేల్‌, విజయ్‌ రూపానీ, అరవింద్‌ కేజ్రీవాల్‌, పినరయి విజయన్‌, మనోహర్‌లాల్‌ ఖట్టర్‌, కేంద్రమంత్రులు అమిత్ షా, హర్షవర్ధన్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

మరిన్ని

దేవతార్చన