చంద్రయాన్‌-2లోని రోవర్‌ పనిచేస్తోందా?

తాజా వార్తలు

Published : 02/08/2020 14:30 IST

చంద్రయాన్‌-2లోని రోవర్‌ పనిచేస్తోందా?

ఆసక్తికర విషయాలు వెల్లడించిన చెన్నై టెకీ

చెన్నై: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-2 మిషన్‌పై మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. చంద్రుడి ఉపరితలంపై దిగే క్రమంలో ల్యాండర్‌ విక్రమ్‌ భూకేంద్రంతో సంబంధాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే, చంద్రుడిపై చక్కర్లు కొట్టి పరిశోధనలు జరిపేలా రూపొందించిన రోవర్‌ ప్రజ్ఞాన్‌ మాత్రం చెక్కుచెదరకపోయి ఉండొచ్చని చెన్నైకి చెందిన అంతరిక్ష ఔత్సాహికుడు, టెకీ షణ్ముగ సుబ్రమణియన్‌ తెలిపారు. గతంలో విక్రమ్‌ ల్యాండర్‌ జాడను గుర్తించింది కూడా షణ్ముగమే కావడం విశేషం. మే నెలలో నాసా విడుదల చేసిన చిత్రాలను విశ్లేషించడం ద్వారా ఈ విషయం తెలిసినట్లు ఆయన వెల్లడించారు. 

గత నవంబరులో తీసిన చిత్రాల్లో చంద్రుడిపై నీడ ఉండడంతో రోవర్‌ జాడ సరిగా కనిపించలేదని.. కేవలం ల్యాండర్‌, దాని శకలాల్ని మాత్రమే గుర్తించగలిగామని షణ్ముగ తెలిపారు. కానీ, జనవరిలో తీసిన చిత్రాల్లో రోవర్‌ కదిలిన గుర్తులు కూడా కనిపించాయన్నారు. రోవర్‌ బాగానే పనిచేస్తోందని.. కొన్ని మీటర్ల దూరం ప్రయాణించి ఉంటుందని షణ్ముగ అంచనా వేశారు. కొన్ని రోజుల పాటు ల్యాండర్‌, రోవర్‌ మధ్య సంకేతాలు కూడా నడిచి ఉండొచ్చని తెలిపారు. అయితే, కొన్ని భాగాలు దెబ్బ తినడంతో వాటిని ల్యాండర్‌ భూమికి చేరవేయలేకపోయి ఉండొచ్చని తెలిపారు. అధ్యయనం చేసిన చిత్రాలతో పాటు ఆయన గుర్తించిన విషయాల్ని ట్విటర్‌లో పంచుకున్నారు. ఈ విషయాల్ని ధ్రువీకరించాలని ఇస్రోను కోరారు. 

దీనిపై స్పందించిన ఇస్రో ఛైర్మన్‌ కె.శివన్‌.. షణ్ముగ పంపిన వివరాలు తమకు అందాయన్నారు. దీనిపై పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందన్నారు. శాస్త్రవేత్తలు దానిపైనే దృష్టి సారించారన్నారు. ప్రస్తుతానికి ల్యాండర్‌, రోవర్‌ పనితీరుపై ఏం చెప్పలేమమన్నారు. ఒకవేళ రోవర్‌ నిజంగానే పనిచేస్తున్నట్లయితే.. ఇస్రోకు సంకేతాలు పంపి ఉంటుందన్నారు. కానీ, సంబంధాలు కోల్పోవడంతో వాటిని అందుకోలేకపోయి ఉండొచ్చని అంచనా వేశారు. 

ఇప్పటి వరకు ఎవరూ చేరుకోని చంద్రుడి దక్షిణ ధ్రువాన్ని ఆవిష్కరించడమే లక్ష్యంగా ఇస్రో చంద్రయాన్‌-2 మిషన్‌ను చేపట్టిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ఆర్బిటర్‌, ల్యాండర్‌, రోవర్‌ని మోసుకెళుతూ జీఎస్‌ఎల్వీ మార్క్‌-111 ఎం1 రాకెట్‌ 2019, జులై 22న నింగిలోకి దూసుకెళ్లింది. 45 రోజుల ప్రయాణం తర్వాత సెప్టెంబరు 6-7 మధ్య రాత్రి ల్యాండింగ్‌కు సిద్ధమైంది. కానీ, సాంకేతిక కారణాలతో ల్యాండర్‌ వేగాన్ని నియంత్రించలేకపోవడంతో అది ఉపరితలంపై గట్టిగా ఢీకొట్టింది. దీంతో ల్యాండర్‌లోని భాగాలు దెబ్బతిని భూకేంద్రంతో సంబంధాలు కోల్పోయింది. అనంతరం నాసాకు చెందిన లూనార్ రీకనైసాన్స్‌ ఆర్బిటర్(ఎల్‌ఆర్‌వో) తీసిన చిత్రాలను విశ్లేషించిన షణ్ముగ దాని జాడను కనిపెట్టి నాసాకు వివరాలు పంపారు. వాటిని నాసా ధ్రువీకరించడంతో పాటు ఆ ఖ్యాతిని ఆయనకే కట్టబెట్టింది. తాజాగా రోవర్‌పై అందించిన వివరాల్ని ఇస్రో ఇంకా ధ్రువీకరించాల్సి ఉంది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని