ఆక్స్‌ఫర్డ్‌ టీకాకు అనుమతి ఇవ్వండి

తాజా వార్తలు

Updated : 07/12/2020 09:20 IST

ఆక్స్‌ఫర్డ్‌ టీకాకు అనుమతి ఇవ్వండి

భారత్‌ను కోరిన సీరం సంస్థ

దిల్లీ: కొవిడ్‌-19 నివారణ కోసం ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం రూపొందించిన కొవిషీల్డ్‌ టీకాను భారత్‌లో అత్యవసర ప్రాతిపదికన ఉపయోగించేందుకు అనుమతించాలని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌ఐఐ) కోరింది. ఈ మేరకు ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ)కు ఆదివారం దరఖాస్తు చేసుకుంది. ఇలాంటి వినతిని చేసిన తొలి స్వదేశీ సంస్థ ఇదే. ప్రజా ప్రయోజనాలతో పాటు మహమ్మారి వల్ల దేశంలో వైద్యపరమైన కొరతలు తలెత్తడం వంటి కారణాలను ఇందుకు ఉదహరించింది. అమెరికాకు చెందిన ఔషధ దిగ్గజం ఫైజర్‌.. తన కరోనా టీకాకు అత్యవసర అనుమతి ఇవ్వాలని డీసీజీఐని శనివారం కోరిత సంగతి తెలిసిందే. కొవిషీల్డ్‌ ఉత్పత్తి కోసం ఎస్‌ఐఐ.. ఆక్స్‌ఫర్డ్‌, ఆస్ట్రాజెనెకాతో చేతులు కలిపింది. 

ఇప్పటికే భారత ఔషధ పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) సహకారంతో ఎస్‌ఐఐ దేశవ్యాప్తంగా పలుచోట్ల కొవిషీల్డ్‌ మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించింది. ఈ వ్యాక్సిన్‌పై బ్రెజిల్‌, యూకేలో జరిగిన ప్రయోగాలకు ఇవి అదనం కావడం గమనార్హం. ఐసీఎంఆర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్‌ఐఐ ఇప్పటికే డీసీజీఐ అనమతితో 40 మిలియన్ల కొవిషీల్డ్‌ డోసులను తయారు చేసింది. యూకే, బ్రెజిల్‌, ఇండియాలో జరిపిన క్లినికల్‌ ట్రయల్స్‌ ఫలితాల ఆధారంగా అనుమతులివ్వాలని ఎస్‌ఐఐ కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మిగతా వ్యాక్సిన్లతో సమానంగా కొవిషీల్డ్‌ కూడా ఆశాజనక ఫలితాలిచ్చిన్నట్లు ఎస్‌ఐఐ దరఖాస్తులో పేర్కొంది. వ్యాప్తి తీవ్రత, మరణాల రేటు ప్రమాదకర స్థాయిలో కొనసాగుతున్న వేళ ఈ వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావడం ఉపయోగకరంగా ఉంటుందని వివరించింది. 

భద్రత విషయంలో కొవిషీల్డ్‌ వల్ల ఎలాంటి హాని లేదని నిరూపితమైందని ఎస్‌ఐఐ స్పష్టం చేసింది. చిన్నపాటి దుష్ప్రభావాలు మినహా ప్రయోగాల సమయంలో తీవ్ర సమస్యలేమీ తలెత్తలేదని తెలిపింది. ఈ నేపథ్యంలో అన్ని రకాల నాణ్యత, భద్రతా పరీక్షల్లో సురక్షితమైనదని తేలిన నేపథ్యంలో టీకా అత్యవసర వినియోగానికి అనుమతించాలని కోరింది. తద్వారా కొవిడ్‌-19ని సమర్థంగా అరికట్టవచ్చని పేర్కొంది. టీకాను అన్నికోణాల్లో మరోసారి పరీక్షించేందుకు కొన్ని నమూనాలను కసౌలీలోని ‘సెంట్రల్‌ డ్రగ్స్‌ లేబోరేటరీ’ (సీడీఎల్‌)కి ఎస్‌ఐఐ పంపినట్లు సమాచారం. 

కొవిడ్‌ వ్యాక్సిన్‌ తయారీలో ప్రధాని నరేంద్ర మోదీ ఆశయానికి అనుగుణంగా భారత్‌ను స్వయం సమృద్ధిగా నిలబెట్టేందుకు కృషి చేస్తామని ఎస్‌ఐఐ స్పష్టం చేసింది. ఈ టీకా తయారీతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. దీన్ని రెండు నుంచి ఎనిమిది డిగ్రీల సెల్సియస్‌ అంటే రిఫ్రిజిరేటర్‌ ఉష్ణోగ్రత స్థాయిలో నిల్వ చేయవచ్చు. అంటే భారత్‌లో పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ దీన్ని సులభంగా పంపిణీ చేయవచ్చు. 

ఇవీ చదవండి..
70 లక్షల మందికి 7 రోజుల్లో తొలిడోసు

భారత్‌లో టీకా వినియోగానికి ఫైజర్‌ దరఖాస్తు


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని