
తాజా వార్తలు
కొవిడ్: 70శాతం.. ఆ 8 రాష్ట్రాల్లోనే
దిల్లీ: భారత్‌లో కొవిడ్ మహమ్మారి తీవ్రమవుతోంది. ఇటు శీతాకాలం.. అటు పండగలు, పెళ్లిళ్ల సీజన్ కావడంతో వైరస్ వ్యాప్తి మళ్లీ పెరుగుతోంది. కొద్ది రోజులుగా 40వేలకు పైనే కొత్త కేసులు నమోదవుతుండగా.. రికవరీలు కూడా తగ్గుముఖం పట్టడం ఆందోళనకరంగా మారింది. ముఖ్యంగా దేశ రాజధాని దిల్లీ, మహారాష్ట్ర, కేరళ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, పశ్చిమబంగాల్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో రోజువారీ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న క్రియాశీల కేసుల్లో 70శాతం ఈ ఎనిమిది రాష్ట్రాల్లోనివే కావడం గమనార్హం.
అత్యధికంగా మహారాష్ట్రలోనే..
శుక్రవారం ఉదయం నాటికి దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 93,09,787కు చేరింది. ఇందులో ఇప్పటివరకు 87,18,517 మంది వైరస్ నుంచి కోలుకోగా.. 4,55,555 యాక్టివ్ కేసులున్నాయి. కాగా.. ఇందులో 70శాతం మహారాష్ట్ర, కేరళ, దిల్లీ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, పశ్చిమబంగాల్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోనివే అని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. అత్యధికంగా మహారాష్ట్రలో 87,014 యాక్టివ్ కేసులున్నాయి. ఆ తర్వాత కేరళలో 65,615, దిల్లీలో 38,734 క్రియాశీల కేసులున్నట్లు తెలిపింది.
ఇక క్రియాశీల కేసుల్లో అత్యధిక పెరుగుదల కూడా మహారాష్ట్రలోనే నమోదైంది. గురువారం నాటికి అక్కడ 87,014 యాక్టివ్ కేసులున్నాయి. క్రితం రోజుతో పోలిస్తే 1526 కేసులు ఎక్కువ. ఆ తర్వాత రాజస్థాన్, యూపీల్లో యాక్టివ్ కేసుల పెరుగుదల అధికంగా కన్పించింది. ఇక ఛత్తీస్‌గఢ్‌లో క్రియాశీల కేసుల సంఖ్య కాస్త తగ్గింది. గురువారం నాటికి అక్కడ 23,957 యాక్టివ్ కేసులున్నాయి. అంతక్రితం రోజుతో పోలిస్తే 719 కేసులు తక్కువ. కేరళ, తమిళనాడులోనూ యాక్టివ్ కేసుల సంఖ్య కాస్త తగ్గింది.
గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 43,082 మందికి వైరస్ సోకింది. కాగా.. ఇందులో 77శాతం కేసులు కేవలం 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోనే నమోదయ్యాయి. మహారాష్ట్ర, దిల్లీ, కేరళ, పశ్చిమబంగాల్, రాజస్థాన్, హరియాణా, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో అధికంగా కొత్త కేసులు బయటపడ్డాయి. అత్యధికంగా 6,406 కొత్త కేసులతో మహారాష్ట్ర తొలి స్థానంలో ఉంది. అక్టోబరు 22 తర్వాత మహారాష్ట్రలో ఇదే అత్యధికం కావడం గమనార్హం. ఒక్క ముంబయిలోనే 1,147 కొత్త కేసులు నమోదవగా.. పుణె, నాసిక్, కొల్హాపూర్ డివిజన్లలో ఎక్కువ కేసులు బయటపడ్డాయి. ఇక దిల్లీ(5,475), కేరళ(5,378) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
అత్యధిక మరణాలు ఆ 10 రాష్ట్రాల్లో..
భారత్‌లో ఇప్పటివరకు 1,35,715 మంది కొవిడ్‌కు బలయ్యారు. కాగా.. మొత్తం మరణాల్లో 84శాతం కేవలం 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోనే చోటుచేసుకోవడం గమనార్హం. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, దిల్లీ, పశ్చిమబంగల్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యధిక కరోనా మరణాలు సంభవించాయి. 34.49శాతం మరణాలతో మహారాష్ట్ర తొలి స్థానంలో ఉంది. ఆ రాష్ట్రంలో 46,813 మంది కరోనాతో చనిపోయారు. కర్ణాటక, తమిళనాడులోనూ ఇప్పటివరకు 11వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 492 మంది కొవిడ్‌తో మరణించగా.. దిల్లీలో అత్యధికంగా 91 మరణాలు చోటుచేసుకున్నాయి. మహారాష్ట్రలో 65 మంది, పశ్చిమబెంగాల్లో 52 మంది మృత్యువాతపడ్డారు.
రికవరీల్లో కేరళ ముందంజ..
కేరళలో రికార్డు స్థాయిలో రోజువారీ కేసులు నమోదవతున్నప్పటికీ అత్యధిక మంది వైరస్ నుంచి కోలుకుంటూ ఉండటం ఆ రాష్ట్ర ప్రజలకు ఊరటనిస్తోంది. దేశంలో ఇప్పటివరకు 87,18,517 మంది వైరస్‌తో పోరాడి క్షేమంగా బయటపడ్డారు. గడిచిన 24 గంటల్లో 39,379 మంది కోలుకోగా.. కేరళలో అత్యధికంగా 5,970 రికవరీలు నమోదయ్యాయి. ఆ తర్వాత దిల్లీలో 4,937 మంది వైరస్ నుంచి కోలుకుని ఇళ్లకు వెళ్లారు.
కరోనా వ్యాప్తి తీవ్రతకు అనేక కారణాలు కన్పిస్తున్నాయి. ఇటీవల పండగల సీజన్లో చాలా ప్రాంతాల్లో ప్రజలు రద్దీగా కన్పించడమేగాక, మాస్క్‌లు ధరించడం, భౌతికదూరం వంటి సామాజిక నియమాలను పక్కనబెట్టారు. ఇక ఈ మధ్య పెళ్లిళ్ల సీజన్ కూడా మొదలవడంతో కేసులు ఒక్కసారిగా పెరుగుతున్నాయి. మరోవైపు దేశ రాజధాని దిల్లీలో కాలుష్యం కారణంగా కరోనా మళ్లీ విజృంభించింది. రికవరీ రేటు చూసి ప్రజల్లో నిర్లక్ష్యం పెరుగుతోందని, మాస్క్‌లు, భౌతికదూరం పాటించడం లేదని, కరోనాపై మళ్లీ అవగాహన కల్పించాల్సిన అవసరం వచ్చిందని సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్రమోదీనే చెప్పడం పరిస్థితిని అద్దంపడుతోంది. ఓ వైపు వ్యాక్సిన్ ప్రయోగాలు జరుగుతున్నా.. వ్యాప్తిని అరికట్టాలంటే కనీస నియమాలు తప్పవని డబ్ల్యూహెచ్ఓ సహా శాస్త్రవేత్తలు, అధ్యయనకారులు కూడా చెబుతున్నారు.
జాతీయ-అంతర్జాతీయ
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
చిత్ర వార్తలు
సినిమా
- ఆప్త నేస్తాలు.. ఆఖరి మజిలీ!
- ‘నా మృతదేహాన్ని వాటికి ఆహారంగా వేయండి’
- క్షమించు నాన్నా..నిను వదిలి వెళ్తున్నా!
- రోహిత్‌ను సరదాగా ట్రోల్ చేసిన డీకే
- చరిత్ర సృష్టించిన నయా యార్కర్ కింగ్
- కంగారూను పట్టలేక..
- సికింద్రాబాద్‌లో భారీగా బంగారం చోరీ
- కన్నీటి పర్యంతమైన మోదీ
- రెరా మధ్యే మార్గం
- ఒంటెను ఢీకొని బెంగళూరు ఫేమస్ బైకర్ మృతి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
