ఎమ్మెల్యే ప్రేమ పెళ్లి.. హైకోర్టులో ఊరట

తాజా వార్తలు

Published : 09/10/2020 16:39 IST

ఎమ్మెల్యే ప్రేమ పెళ్లి.. హైకోర్టులో ఊరట

చెన్నై : ఇటీవల ప్రేమ వివాహం చేసుకున్న అన్నాడీఎంకే ఎమ్మెల్యే ప్రభుకు మద్రాస్‌ హైకోర్టులో ఊరట లభించింది. ఎమ్మెల్యే తన కుమార్తెను బలవంతంగా తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నారంటూ ఆమె తండ్రి దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానం శుక్రవారం విచారించింది. సౌందర్యకు ప్రస్తుతం 19 ఏళ్లని, ఆమె ఇష్ట ప్రకారమే 35 ఏళ్ల ప్రభును వివాహం చేసుకుందని హైకోర్టు తెలిపింది. హైకోర్టు జారీచేసిన ఆదేశాల మేరకు శుక్రవారం సౌందర్య తన భర్త ప్రభుతో కలిసి కోర్టు ఎదుట హాజరయ్యారు. తాను మేజర్‌నని, పెళ్లి చేసుకోవాలని తనను ఎవరూ బలవంత పెట్టలేదని సౌందర్య కోర్టుకు తెలిపారు.  ప్రభు, తాను ప్రేమించుకున్నామని, పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. తన ఇష్టప్రకారమే భర్తతో వెళ్తున్నట్టు ధర్మాసనం ఎదుట ఆమె తెలిపారు. అయితే, అదే క్రమంలో వారిద్దరి మధ్య ఉన్న వయస్సు తేడాను మరోసారి ఆమె తండ్రి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ప్రభు తమ కుటుంబాన్ని మోసం చేశాడని వాపోయారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం ఇద్దరూ మేజర్లేనని, తన భర్తతో కలిసి వెళ్లడం సౌందర్య ఇష్టమేనని స్పష్టంచేసింది.

తమిళనాడులోని కళ్లకురిచ్చి నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన ప్రభు త్యాగదుర్గానికి చెందిన ఆలయ అర్చకుడు స్వామినాథన్‌ కుమార్తె సౌందర్యను సోమవారం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో యువతి తండ్రి ఆత్మహత్యకు యత్నించగా స్థానిక పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే.  ఎమ్మెల్యే బలవతంగా తీసుకెళ్లి తన కూతుర్ని పెళ్లి చేసుకున్నారని, వారిద్దరి మధ్య వయస్సులో చాలా తేడా ఉందని పేర్కొంటూ సౌందర్య తండ్రి ఎస్‌.స్వామినాథన్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఈ వివాహాన్ని వ్యతిరేకించినందుకు ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు తనను బెదిరిస్తున్నారని పిటిషన్‌లో ఆరోపించారు. ఈ మేరకు తన కుమార్తెను కోర్టులో హాజరు పరచాలని కోరుతూ ఇటీవల హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేయగా.. న్యాయస్థానం శుక్రవారం విచారించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని