
తాజా వార్తలు
విమాన సేవలు పుంజుకుంటున్నాయ్
హర్దీప్ సింగ్ పూరీ
దిల్లీ: పౌర విమానయాన సేవలు క్రమంగా పుంజుకుంటున్నట్లు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ వెల్లడించారు. లాక్డౌన్ను సడిలిస్తున్న నేపథ్యంలో మే 25 నుంచి కొన్ని మార్గాల్లో విమానయాన సేవలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ప్రజలు అరకొరగా ప్రయాణాలు సాగిస్తూనే ఉన్నారు. తాజాగా శనివారం ఒక్కరోజే అత్యధికంగా 75,000 మంది ప్రయాణించినట్లు హర్దీప్ సింగ్ వెల్లడించారు.
‘‘లాక్డౌన్ అనంతరం మే 25న 30 వేల మంది దేశీయ విమానాల్లో ప్రయాణించారు. ప్రస్తుతం మనం 75వేల మార్కు దాటేశాం. దీనిని బట్టి విమాన ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని తెలుస్తోంది’’ అని హర్దీప్ సింగ్ ట్వీట్ చేశారు. దీనికి పౌర విమానయానశాఖ తీసుకున్న నిర్ణయాలు కూడా కారణమని ఆయన చెప్పుకొచ్చారు. గతంలో కరోనా పరీక్షలు చేయించుకొని, నెగటివ్ రిపోర్టు వచ్చిన వారినే ప్రయాణానికి అనుమతించేవారు. కానీ, జూన్ 29 నుంచి విమాన ప్రయాణాలకు సంబంధించి కేంద్రం కొన్ని సడలింపులిచ్చింది. ప్రయాణానికి కనీసం మూడు వారాల ముందు పరీక్షలు చేయించుకుంటే చాలు. ఎలాంటి ధ్రువపత్రాలు సమర్పించకుండా, సొంత పూచీకత్తుపై ప్రయాణానికి అనుమతించింది. దీంతో దేశీయ ప్రయాణికుల సంఖ్య పెరిగిందని కేంద్ర మంత్రి పోస్టు చేశారు. దేశంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య ఎక్కువగా ఉన్నందువల్లే ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. భవిష్యత్లో మరిన్ని సడలింపులు ఇచ్చే అవకాశమూ ఉన్నట్లు సూచనప్రాయంగా తెలియజేశారు.
కేంద్ర ప్రభుత్వం మే 25న జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం.. చిన్నారులు, వయోవృద్ధులు, గర్భిణిలు విమాన ప్రయాణం చేసేందుకు అనుమతి లేదు. అయితే ఎయిర్ అంబులెన్స్ సేవలకు మినహాయింపు ఉంది. మరోవైపు ప్రయాణికులకు ఎయిర్పోర్ట్లో థర్మల్ స్క్రీనింగ్ తదితర టెస్టులు నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి చెప్పారు. ప్రయాణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రతి ప్రయాణికుడికి వ్యక్తిగతంగా మెయిల్ చేస్తున్నట్లు తెలిపారు.