Border Row: అస్సాం సీఎంపై కేసు.. మిజోరం ఎంపీ కోసం పోలీసుల గాలింపు

తాజా వార్తలు

Published : 31/07/2021 10:11 IST

Border Row: అస్సాం సీఎంపై కేసు.. మిజోరం ఎంపీ కోసం పోలీసుల గాలింపు

సరిహద్దుల్లో చల్లారని రగడ 

దిల్లీ: అస్సాం, మిజోరం రాష్ట్రాల మధ్య ‘సరిహద్దు’ గొడవ మరింత బిగుస్తోంది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మిజోరం రాజ్యసభ ఎంపీ కె.వన్లాల్‌వేనా కోసం అస్సాం పోలీసులు శుక్రవారం దిల్లీకి చేరుకున్నారు. అతని నివాసం, మిజోరం హౌస్‌లో గాలించారు. ఎంపీ కనిపించకపోవడంతో ఆయన నివాసానికి సమన్లు అతికించారు. కఛార్‌ జిల్లాలోని దోలాయ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఆదివారం హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. అస్సాం పోలీసులు తమ రాష్ట్రంలో మళ్లీ అడుగుపెడితే కాల్చి పారేస్తామని వన్లాల్‌వేనా పార్లమెంట్‌ ఆవరణలో బుధవారం ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ‘‘మా పోలీసులను అస్సాం పోలీసులు వెనక్కి తోశారు. వారే ముందు కాల్పులకు ఆదేశాలిచ్చారు. వారు అదృష్టవంతులు. అందరినీ చంపలేదు. మళ్లీ మా ప్రాంతంలోకి అడుగుపెడితే అందరినీ చంపేస్తాం’’ అని వన్లాల్‌వేనా ప్రకటించారు.

అస్సాం-మిజోరం సరిహద్దుల్లో సోమవారం జరిగిన ఘర్షణల్లో ఐదుగురు అస్సాం పోలీసులు మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. మరోవైపు తమ రాష్ట్ర పౌరులెవరూ మిజోరం వెళ్లొద్దంటూ అస్సాం ప్రభుత్వం గురువారం జారీ చేసిన ప్రయాణ సూచనలు వివాదాస్పదమవుతున్నాయి. ఈ ఉత్తర్వులను అస్సాం ప్రభుత్వం సమర్థించుకుంది. మిజోరం పౌరులు ఏకే-47, ఇతర అత్యాధునిక ఆయుధాలతో తిరుగుతున్నారని.. అందుకే జారీ చేసినట్లు పేర్కొంది. అస్సాం, మిజోరం సరిహద్దులను కలిపే జాతీయ రహదారి 306 వద్ద సీఆర్‌పీఎఫ్‌ బలగాలు పహారా కాస్తున్నా, ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. రహదారులపై ఆందోళనకారులు లేరని, దిగ్బంధనం కొనసాగడం లేదని అస్సాం అధికారులు శుక్రవారం పేర్కొన్నారు. స్థానికులు మాత్రం రాకపోకలు ఆగిపోయాయని చెబుతున్నారు. 

అస్సాం సీఎంపై క్రిమినల్‌ కేసు

సరిహద్దు హింసకు సంబంధించి అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ, నలుగురు సీనియర్ పోలీసు అధికారులు, మరో ఇద్దరు పరిపాలన అధికారులపై మిజోరం పోలీసులు క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని