
తాజా వార్తలు
డాక్టర్ ఫౌచీ నోట టీకా మాట..!
వాషింగ్టన్: అమెరికాకు చెందిన అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంటోనీ ఫౌచీ టీకాపై కీలక వ్యాఖ్యలు చేశారు. కొవిడ్ పరిశోధనలపై ఇవి సరికొత్త ఆశలు రేపాయి. ఈ ఏడాది చివరికిగానీ, వచ్చే ఏడాది ప్రారంభం నాటికి ప్రస్తుతం ప్రయోగ పరీక్షలు అన్నీ సజావుగా జరిగితే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం ఆయన అమెరికాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. ఈ సంస్థ అమెరికాకు చెందిన మోడెర్నాతో కలిసి టీకాను అభివృద్ధి చేస్తున్న విషయం తెలిసిందే. కరోనావైరస్ విస్తరణ కొనుసాగుతుందని పేర్కొన్నారు. అదే సమయంలో భవిష్యత్తులో మహమ్మారులను ఎదుర్కొనేందుకు ప్రపంచ వ్యాప్తంగా పరస్పర సహకారం.. పారదర్శకత చాలా అవసరమని పేర్కొన్నారు.
‘‘ ప్రస్తుతం మనం కరోనావైరస్ నుంచి చాలా నేర్చుకొన్నామని అన్నారు. మంచి ప్రజారోగ్య జాగ్రత్తలే దానివ్యాప్తిని అడ్డుకోవడానికి ప్రధాన ఆయుధాలని తేలాయన్నారు. మనం పారదర్శకంగా.. పరస్పర సహకారంతో వ్యవహరిస్తే మానవాళిపై జరుగుతున్న ఈ వైరస్దాడిని అడ్డుకోగలిగేవారమన్నారు’’ అన్నారు.
ఇప్పటికే పలు రకాల టీకాల ప్రయోగాలు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. వీటిల్లో కొన్ని టీకాల మూడో దశ ప్రయోగాలు జులైలో మొదలైనా వాటి ఫలితాలు వచ్చేసరికి అక్టోబర్ వరకు సమయం పట్టవచ్చని తెలిపారు. జనవరిలో చేపట్టిన ప్రయోగాలు సత్ఫలితాలను ఇస్తున్నాయని ఆయన తెలిపారు. మోడెర్నా అభివృద్ధి చేస్తున్న టీకా ఆశాజనకమైన ఫలితాలను ఇస్తోందని తెలిపారు. కానీ, చివరి వరకు వేచి చూడాల్సిందే అన్నారు. మనం టీకా తయారీలో విజయవంతమైనా 2021 ప్రారంభం వరకు సమయం పట్టవచ్చని తెలిపారు.