కిమ్‌ అక్కడ ఉన్నారా?
close

తాజా వార్తలు

Updated : 26/04/2020 15:13 IST

కిమ్‌ అక్కడ ఉన్నారా?

వాషింగ్టన్‌: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ఆరోగ్య పరిస్థితిపై అనేక ఊహాగానాలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఆయన కనిపించకుండా పోవడంపై అంతర్జాతీయ మీడియాలో అనేక కథనాలు వెలువడుతున్నాయి. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నారనే అంశం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ తరుణంలో వాషింగ్టన్‌ కేంద్రంగా పనిచేస్తున్న 38నార్త్‌ అనే వెబ్‌సైట్‌ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. ఈ వెబ్‌సైట్‌ ఉత్తరకొరియా సహా దాని చుట్టుపక్క ప్రాంతాలపై నిరంతరం నిఘా వేసి విశ్లేషిస్తూ ఉండే ఓ ప్రాజెక్టుకి సంబంధించినది. 

38నార్త్‌ తీసిన శాటిలైట్‌ చిత్రాల ప్రకారం తూర్పు తీరంలోని కిమ్‌ హాలిడే స్పాట్‌ అయిన వోన్‌సన్‌ రిసార్టు రైల్వే స్టేషన్‌లో ఓ రైలు ఆగి ఉంది. బహుశా అది కిమ్‌దే అయి ఉంటుందని ఈ ప్రాజెక్టు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ స్టేషన్‌ను కేవలం కిమ్‌, ఆయన కుటుంబం కోసం మాత్రమే వినియోగిస్తుంటారని తెలిపింది. అయితే, దీన్ని బట్టి ఆయన అక్కడే ఉన్నారని మాత్రం కచ్చితంగా చెప్పలేమని కూడా స్పష్టం చేసింది. అలాగే కిమ్ ఆరోగ్య సమాచారం కూడా ఏమీ తెలియదని తెలిపింది. ఈ నెల 21 నుంచి 23 మధ్య రైలు అక్కడే ఉందని చిత్రాల ద్వారా తెలుస్తున్నట్లు వెల్లడించింది.

ఏప్రిల్‌ 15న తాత కిమ్‌ ఇల్‌ సంగ్‌ జయంతి ఉత్సవాలకు కిమ్‌ హాజరుకాకపోవడంతో ఆయన ఆరోగ్యంపై అనుమానాలు ప్రారంభమయ్యాయి. ఇక శనివారం ఉత్తర కొరియా సైన్యం వ్యవస్థాపిత దినోత్సవం సందర్భంగానూ ఆయన కనిపించకపోవడంతో అనుమానాలు మరింత బలపడ్డాయి. అయితే అమెరికా నిఘా విభాగం మాత్రం కిమ్‌ విషమ పరిస్థితుల్లో ఉన్నారన్న వార్తల్ని కొట్టిపారేస్తోంది. ఉత్తర కొరియాలో ఎలాంటి హడావుడి మిలిటరీ కార్యకలాపాలు చోటుచేసుకుంటున్న సంకేతాలు లేవని తెలిపింది. అయితే పెంటగాన్‌కు చెందిన ఓ ఉన్నతాధికారి మాట్లాడుతూ.. కిమ్‌ రైలు వోన్‌సాన్‌లో ఉందంటే.. ఆయన అనారోగ్యం వార్తకు బలం చేకూరుతోందని అభిప్రాయపడ్డట్లు ప్రముఖ మీడియా సంస్థ ‘న్యూస్‌వీక్‌’ పేర్కొంది.

మరోవైపు కిమ్‌ను పరీక్షించేందుకు వైద్య నిపుణులతో కూడిన ఓ బృందాన్ని చైనా.. ఉత్తర కొరియాకు పంపించిందని సమాచారం. చైనా కమ్యూనిస్టు పార్టీ అంతర్జాతీయ అనుబంధ శాఖ అధికారులూ ఈ బృందంలో ఉన్నారని తెలిసింది. గురువారం వీరు ఉత్తరకొరియా రాజధాని ప్యాంగ్యాంగ్‌కు వెళ్లారని రాయిటర్స్‌ ఒక కథనంలో తెలిపింది. ఈ వార్త కూడా కిమ్‌ ఆరోగ్యంపై అనుమానాలను బలపరుస్తోంది. 

మరోవైపు దక్షిణ కొరియా కిమ్‌ అనారోగ్యానికి సంబంధించిన వార్తలు నిరాధారమని తెలిపింది. అలాగే సిరియా అధ్యక్షుడు బషర్‌ అల్‌ అసద్‌కు బుధవారం కిమ్‌ ఓ సందేశం పంపించారని కొరియా సెంట్రల్‌ న్యూస్‌ ఏజెన్సీ పేర్కొనడం గమనార్హం.

ఏదేమైనా కరోనా వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తున్న తరుణంలో కిమ్‌ జాడ అంతర్జాతీయంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. రోజుకో ఆసక్తికర అంశం తెర మీదకు వస్తోంది. వీటన్నింటికీ ఎప్పుడు తెరపడుతుందో చూడాలి మరి!Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని