
తాజా వార్తలు
క్షమించాను పో.. ట్రంప్
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్ష హోదాలో డొనాల్డ్ ట్రంప్, ఆ దేశ మాజీ భద్రతా సలహాదారు మైఖేల్ ఫ్లిన్కు క్షమాభిక్ష ప్రసాదించారు. ‘‘జనరల్ మైఖేల్ టీ ఫ్లిన్కు పూర్తి క్షమాభిక్ష లభించింది. ఇది నాకు ఓ గొప్ప గౌరవం. జనరల్ ఫ్లిన్కు, చక్కటి ఆయన కుటుంబానికి నా అభినందనలు. మీ థాంక్స్ గివింగ్ డే నిజంగా అద్భుతంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను.’’ అంటూ ఆయన ట్విటర్లో ప్రకటించారు.
ఫ్లిన్ గతంలో నాటి రష్యా రాయబారితో జరిగిన సమావేశ వివరాలను గురించి అబద్ధపు సమాచారాన్ని అందించారన్న ఆరోపణలను ఎదుర్కొన్నారు. ట్రంప్ ప్రభుత్వంలో భద్రతా సలహాదారుగా కేవలం 22 రోజులు విధులు నిర్వహించిన అనంతరం... సదరు ఆరోపణల కారణంగా ఆయన బలవంతంగా రాజీనామా చేయాల్సి వచ్చింది. 2016 అధ్యక్ష ఎన్నికల్లో రష్యా ప్రమేయంపై జరిగిన విచారణ సందర్భంగా ఆయన తన నేరాన్ని అంగీకరించారు.
కాగా, ట్రంప్ ఇదివరకు అమెరికా జాతీయ భద్రతా సంస్థ నేషనల్ సెక్యూరిటీ ఏజన్సీకి చెందిన ఓ మాజీ గుత్తేదారును కూడా క్షమించారు. అమెరికా నిఘా కార్యక్రమాలను ప్రపంచానికి బట్టబయలు చేసిన సామాజిక కార్యకర్త ఎడ్వర్డ్ స్నోడెన్‌ను కూడా విడుదల చేసే విషయాన్ని పరిశీలిస్తామని ఆయన అప్పట్లో అన్నారు. జనవరి 20, 2021 వరకు అధ్యక్షుడిగా కొనసాగనున్న ట్రంప్.. తనకున్న ఈ కొద్దిపాటి వ్యవధిలో ఇంకా ఏ కీలక నిర్ణయాలు తీసుకోనున్నారో అని ప్రపంచమంతా వేచి చూస్తోంది.