మోడెర్నా టీకాకు అనుమతి..!
close

తాజా వార్తలు

Published : 19/12/2020 01:23 IST

మోడెర్నా టీకాకు అనుమతి..!

ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌

వాషింగ్టన్‌: మోడెర్నా తయారుచేసిన కరోనా వ్యాక్సిన్‌కు అత్యవసర వినియోగం కింద అనుమతి లభించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. త్వరలోనే ఈ వ్యాక్సిన్‌ పంపిణీ ప్రారంభమవుతుందని ట్విటర్‌లో వెల్లడించారు. మోడెర్నా రూపొందించిన కరోనా వ్యాక్సిన్‌ సమాచారాన్ని నిపుణుల బృందం విశ్లేషించిన అనంతరం టీకా వినియోగానికి అనుమతి ఇచ్చేందుకు సిఫార్సు చేసింది. ఈ నిర్ణయాన్ని అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ అధికారికంగా ప్రకటించిన వెంటనే పంపిణీ ప్రారంభమవుతుంది.

అమెరికాలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్న తరుణంలో ఫైజర్‌ తయారుచేసిన వ్యాక్సిన్‌కు గతవారమే అనుమతి లభించింది. తాజాగా అమెరికాలో అనుమతి పొందిన రెండో వ్యాక్సిన్‌గా మోడెర్నా నిలిచింది. సోమవారం నుంచే మోడెర్నా వ్యాక్సిన్‌ను పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రెండు వ్యాక్సిన్‌లు అందుబాటులోకి రావడంతో భారీ ఎత్తున టీకా పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాలని అమెరికా ప్రభుత్వం భావిస్తోంది. కొత్త సంవత్సరం నాటికే దాదాపు 2 కోట్ల మందికి తొలి డోసును అందించే లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు సమాచారం.

94శాతం సమర్థత..
మోడెర్నా తయారుచేసిన వ్యాక్సిన్‌ సురక్షితంగా, సమర్థంగానే పనిచేస్తున్నట్లు అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) ఇదివరకే వెల్లడించింది. కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో మోడెర్నా వ్యాక్సిన్‌ 94.1శాతం సమర్థత చూపించిందని.. సంస్థ ప్రకటించిన ఫలితాలను ధ్రువీకరిస్తున్నట్లు ఎఫ్‌డీఏ స్పష్టంచేసింది. ప్రయోగాలకు సంబంధించి ఇదివరకు వెల్లడించిన సమాచారం కంటే తాజాగా ఎక్కువ సమాచారాన్ని విశ్లేషించిన అనంతరం ఎఫ్‌డీఏ ఈ ప్రకటన చేసింది. మోడెర్నా తయారు చేసిన వ్యాక్సిన్‌ అన్నివర్గాల ప్రజలపై సమర్థంగానే పనిచేస్తున్నట్లు ఎఫ్‌డీఏ అభిప్రాయపడింది. 65 ఏళ్లకు పైబడి వయసున్న వారిలో ఈ వ్యాక్సిన్‌ 86.4 సమర్థత చూపించగా, 18 నుంచి 65 ఏళ్లలోపు వారిలో 95.6శాతం ప్రభావవంతంగా వ్యాక్సిన్‌ పనిచేస్తున్నట్లు తెలిపింది. తాజాగా వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగంపై నిపుణుల బృందం కూడా ఇదే విషయాన్ని ధృవీకరిస్తూ ఆమోదం తెలిపినట్లు సమాచారం.

ఫైజర్‌, మోడెర్నా ఈ రెండు వ్యాక్సిన్‌లు కూడా మెస్సెంజర్‌ ఆర్‌ఎన్‌ఏ సాంకేతికతతో అభివృద్ధి చేశారు. అయితే, ఫైజర్‌ టీకాను మైనస్‌ 70డిగ్రీల సెల్సియస్‌ వద్ద నిల్వ చేయాల్సి ఉండగా మోడెర్నాకు మాత్రం అలాంటి ఇబ్బందులేవీ లేవని ఆ సంస్థ ప్రకటించింది. కేవలం సాధారణ రిఫ్రిజిరేటర్ల ఉష్ణోగ్రత వద్దే మోడెర్నా వ్యాక్సిన్‌ నిల్వ చేసుకోవచ్చని పేర్కొంది. దీంతో వ్యాక్సిన్‌ పంపిణీ ప్రక్రియ మరింత సులువుకానుంది.

ఇవీ చదవండి..
కొవిడ్‌19: మిస్టరీ మూలాలపై దర్యాప్తు
కొవిడ్‌ టీకా: పారదర్శకంగా లేని చైనా!


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని