అమెరికాలోనూ కొత్తరకం వైరస్‌!
close

తాజా వార్తలు

Published : 30/12/2020 08:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అమెరికాలోనూ కొత్తరకం వైరస్‌!

ఇటీవల ఎటూ ప్రయాణించని వ్యక్తిలో గుర్తింపు

వాషింగ్టన్‌: యూకేలో వెలుగులోకి వచ్చిన కొత్త రకం కరోనా క్రమంగా ఇతర దేశాలకూ విస్తరిస్తోంది. తాజాగా అగ్రరాజ్యం అమెరికాలోకి ప్రవేశించింది. కొలరాడో రాష్ట్రంలో తొలి కేసు నమోదైనట్లు గవర్నర్‌ జేర్డ్‌ పొలిస్‌ ప్రకటించారు. డెన్వర్‌కు చెందిన 20 ఏళ్ల యువకుడికి ఈ కొత్త రకం వైరస్ సోకినట్లు గుర్తించారు. అయితే ఇటీవల అతను ఎక్కడికి ప్రయాణించిందీ లేదని అధికారులు తెలిపారు. దీన్ని అమెరికా ‘సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌’ పరిగణనలోకి తీసుకుంది. వైరస్‌ సోకిన వ్యక్తితో ఇటీవల కలిసిన వారిని వెతికే పనిలో పడింది. ఇప్పటికే పాతరకం కరోనాతో అమెరికా అతలాకుతలమవుతున్న విషయం తెలిసిందే. క్రిస్మస్‌, కొత్త సంవత్సర సెలవుల తర్వాత ఇవి మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ తరుణంలో కొత్త రకం వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది.  

ఈ కొత్త వైరస్‌ గురించి ఇంకా తెలియాల్సింది చాలా ఉందని జేర్డ్‌ పొలిస్‌ తెలిపారు. వేగంగా వ్యాపిస్తోందని పరిశోధకులు చెబుతున్నారని గుర్తుచేశారు. కొలరాడో ప్రజల ఆరోగ్యానికే తొలి ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చారు. తాజాగా వెలుగులోకి వచ్చిన కేసుకు సంబంధించి పూర్తి వివరాలు సేకరించి.. వ్యాప్తిని కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కొత్త వైరస్‌ వెలుగులోకి వచ్చిన వెంటనే అప్రమత్తమైన అమెరికా.. యూకే నుంచి అమెరికాకు వచ్చేవారు తప్పనిసరిగా కొవిడ్‌ నెగెటివ్‌ ధ్రువపత్రం చూపాల్సిందేనని షరతు విధించిన విషయం తెలిసిందే.

జన్యు పరివర్తన చెందిన కొత్త కరోనా వైరస్‌ కేసులు భారత్‌లోనూ బయటపడ్డ విషయం తెలిసిందే. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా దాదాపు 18-19 కేసులు గుర్తించినట్టు జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ ప్రయోగశాల వర్గాలు ప్రకటించాయి. అయితే కొత్త వైరస్‌ సోకిన వారిలో ఆరుగుర్ని మాత్రమే గుర్తించినట్టు కేంద్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది. మిగిలిన వారు ఎవరు? ఎక్కడి వారనే విషయాన్ని వెల్లడించలేదు. మరోవైపు యూకే నుంచి విమానాల రాకపోకలపై విధించిన నిషేధాన్ని మరికొంత కాలం పొడిగించే అవకాశముందని పౌర విమానయానశాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పురీ మంగళవారం వెల్లడించారు.

ఇవీ చదవండి...
భారత్‌-బ్రిటన్‌ మధ్య రాకపోకలు మరికొంత కాలం బంద్‌!

కొత్త కలవరం


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని