close

తాజా వార్తలు

Published : 24/09/2020 00:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కరోనాతో కేంద్ర మంత్రి కన్నుమూత

దిల్లీ:  కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రి సురేశ్‌‌ అంగడి కన్నుమూశారు. ఇటీవల కరోనా బారినపడిన ఆయన దిల్లీ ఎయిమ్స్‌లో చికిత్సపొందుతూ బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. కర్ణాటకలో ఇటీవల భాజపా ఎంపీ అశోక్‌ గస్తీ కరోనాతో మృతిచెందగా.. తాజాగా బెళగావి లోక్‌సభ సభ్యుడు సురేశ్‌‌ అంగడి ప్రాణాలు కోల్పోవడంతో విషాదం నెలకొంది. కరోనాతో మృతిచెందిన తొలి కేంద్రమంత్రి సురేశ్‌‌ అంగడి కావడం గమనార్హం. బెళగావి లోక్‌సభ నియోజకవర్గం నుంచి నాలుగు పర్యాయాలు  ఆయన ఎంపీగా గెలుపొందారు.

నేపథ్యం ఇదీ..
కర్ణాటకలోని బెళగావి జిల్లాలోని కేకే కొప్ప గ్రామంలో చెనబసప్ప అంగడి, సోమవ్వ అంగడి దంపతులకు 1955 జూన్‌ 1న సురేశ్‌‌ జన్మించారు. ఆయనకు భార్య మంగల్‌
సురేశ్‌‌ అంగడి, కుమార్తెలు స్ఫూర్తి, శారద ఉన్నారు. సురేశ్‌ అంగడి 1996-99 మధ్య కాలంలో జిల్లా భాజపా ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత 2000-2004 మధ్య బెళగావి ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఎగ్జిక్యూటివ్‌ సభ్యుడిగా కొనసాగారు. 2001 నుంచి 2004 వరకు భాజపా బెళగావి జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన 2004లో తొలిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2009లో రెండోసారి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత 2014లోనూ వరుసగా మూడోసారి లోక్‌సభకు ఎన్నికైన ఆయన పలు పార్లమెంట్‌ కమిటీల్లో సభ్యుడిగా కొనసాగారు. 2019లో నాలుగోసారి భాజపా నుంచి లోక్‌సభకు ఎన్నికైన ఆయన కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రిగా సేవలందించారు.

ప్రముఖుల సంతాపం..

‘‘కేంద్ర రైల్వే సహాయ మంత్రి సురేశ్‌ మరణవార్త నన్ను షాక్‌కు గురిచేసింది. సురేశ్‌ తన నియోజకవర్గం బెళగావి అభివృద్ధి కోసం విశ్రాంతి లేకుండా శ్రమించారు. ఆయన పట్టుదలతో ప్రజాసేవ చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’’

- రామ్‌నాథ్‌ కోవింద్‌, భారత రాష్ట్రపతి

‘‘కరోనాతో కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సురేశ్‌ అంగడి మరణించడం ఎంతో బాధాకరం. భాజపాకు ఆయన చేసిన సేవలు ఎనలేనివి. కర్ణాటకలో భాజపా బలోపేతం కావడంలో ఆయన పాత్ర ఎంతో కీలకం. ఎంపీగా, కేంద్రమంత్రిగా నిబద్ధతతో సేవలందించారు. వారి కుటుంబానికి ధైర్యం ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా’’

- నరేంద్రమోదీ, భారత ప్రధాని

‘‘సీనియర్‌ భాజపా నేత, కేంద్ర రైల్వే సహాయ మంత్రి సురేశ్‌ మరణవార్త నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ విషయాన్ని నేను నమ్మలేకపోతున్నాను. సురేశ్‌ మృతి పార్టీకి, రాష్ట్రానికి మాత్రమే కాదు దేశానికి తీరని లోటు. ఆయన మర్యాదపూర్వక వ్యక్తిగా ప్రజాదరణ పొందారు. ఆయన కుటుంబసభ్యులకు ధైర్యాన్ని ప్రసాదించాలని దేవుడిని ప్రార్థిస్తున్నా’’

- యడియూరప్ప, కర్ణాటక సీఎం


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.