వ్యాక్సిన్‌పై మ్యుటేషన్ల ప్రభావం లేనట్లే..!

తాజా వార్తలు

Published : 08/10/2020 23:02 IST

వ్యాక్సిన్‌పై మ్యుటేషన్ల ప్రభావం లేనట్లే..!

తాజా పరిశోధనల్లో వెల్లడి

ఇంటర్నెట్‌ డెస్క్‌: లక్షల ప్రాణాలు తీసుకుంటున్న కరోనా వైరస్‌ మహమ్మారిని ఎదుర్కొనే వ్యాక్సిన్‌ కోసం ప్రపంచవ్యాప్తంగా ముమ్మర కృషి జరుగుతోంది. ఈ సమయంలో వ్యాక్సిన్‌ అభివృద్ధి ప్రక్రియను వేగవంతం చేసే కీలక విషయాన్ని తాజా పరిశోధనలు వెల్లడించాయి. వైరస్‌ మ్యుటేషన్ల ప్రభావం ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న వ్యాక్సిన్‌లపై ఉండదని స్పష్టం చేశాయి. వైరస్‌ పరివర్తనం చెందుతున్నప్పటికీ.. ఇలా మ్యుటేషన్‌ చెందిన అన్ని రకాల కరోనా వైరస్‌లపై వ్యాక్సిన్‌లు‌ ఒకేవిధంగా పని చేస్తున్నట్లు స్పష్టంచేశాయి. వైరస్‌ ఉత్పరివర్తనం, వ్యాక్సిన్‌ ప్రభావంపై తాజాగా జరిపిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైంది.

ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న వ్యాక్సిన్‌లన్నీ మహమ్మారి ప్రారంభంలో ఎక్కువగా కనిపించిన వైరస్‌ D-స్ట్రెయిన్‌ ఆధారంగానే రూపొందించాయి. అప్పటినుంచి ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన వైరస్‌ G-స్ట్రెయిన్‌గా పరిణామం చెందింది. ప్రస్తుతం కరోనా వైరస్‌ జన్యువులలో దాదాపు 85శాతం ఇవే ఉన్నాయి. అయితే, స్పైక్‌ ప్రోటీన్‌లోపాలున్న G-స్ట్రెయిన్‌, ప్రస్తుతం అభివృద్ధి చేస్తోన్న వ్యాక్సిన్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుందేమోననే భయాలు వెలువడ్డాయి. వ్యాక్సిన్‌ తయారీ పూర్తయి మార్కెట్‌లోకి వచ్చే సమయానికి వైరస్‌ ఎన్నో రూపాలుగా పరివర్తనం(మ్యుటేషన్లు) చెందే అవకాశాలు ఉండడంతో ఇది వ్యాక్సిన్‌పై ప్రతికూల ప్రభావం చూపిస్తాయేమోనన్న సందేహం వ్యక్తమైంది. ఈ పరిణామాలు వ్యాక్సిన్‌ కంపెనీలకు పెద్ద సవాలుగా మారాయి. అయితే, తాజా పరిశోధనలు మాత్రం ఇలాంటి అనుమానాలకు చెక్‌ పెడుతున్నాయి. ఇవి వ్యాక్సిన్‌ సామర్థ్యంపై ప్రతికూల ప్రభావాలు చూపిస్తాయనడానికి ఎలాంటి ఆధారాలు లేవని శాస్త్రవేత్తలు తేల్చారు. ఇలాంటి మ్యుటేషన్లు జరిగినా వ్యాక్సిన్‌పై ప్రభావం ఉండదని ఆస్ట్రేలియాలోని నేషనల్‌ సైన్స్‌ ఏజెన్సీకి చెందిన కామన్వెల్త్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (CSIRO) చేసిన అధ్యయనంలో వెల్లడయ్యింది.

ఒక నిర్దిష్ట ప్రదేశంలో మ్యుటేషన్‌ చెందిన వైరస్‌లో అమైనో ఆమ్లం D(అస్పార్టేట్) నుంచి G(గ్లైసిన్) మారింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈ రకమైన (G-స్ట్రెయిన్‌) వైరస్‌ ఆధిపత్యం చెలాయిస్తోంది. దీన్నే ‘D614G’ పేరుతో పిలుస్తున్నారు. అయితే, ఈ మ్యుటేషన్‌ చెందిన వైరస్‌ కలిగి ఉన్న వైరస్‌తో పాటు.. ఈ రకం లేని కొన్ని జంతువులపై(ముంగీస జాతీకి చెందిన) అభివృద్ధి దశలో ఉన్న వ్యాక్సిన్‌ ప్రయోగించారు. అనంతరం వాటి రక్త నమూనాలను సేకరించి వ్యాక్సిన్‌ పనితీరును విశ్లేషించారు. అనంతరం మ్యుటేషన్ల ప్రభావం లేదని తేల్చారు.

వైరస్‌ సోకడానికి ప్రవేశస్థానమైన ఊపిరితిత్తుల్లోని ACE2 గ్రాహకాలను బంధించే స్పైక్‌ ప్రోటీన్‌ల లక్ష్యంగానే ఎక్కువ భాగం వ్యాక్సిన్‌ తయారు చేస్తున్నారని ఈ పరిశోధనలో పాల్గొన్న యూనివర్సిటీ ఆఫ్‌ యార్క్‌ ఆరోగ్య విభాగాధిపతి ప్రొఫెసర్‌ శేషాద్రి వాసన్‌ వెల్లడించారు. ఇది ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చేస్తోన్న వందలాది వ్యాక్సిన్‌ కంపెనీలకు శుభవార్త అని వాసన్‌ అభిప్రాయపడ్డారు. ఈ స్పైక్‌ ప్రోటీన్‌లోనూ D614G పరివర్తనం ఉన్నప్పటికీ వ్యాక్సిన్‌ ప్రభావవంతంగానే పనిచేస్తున్నాయని..వీటిని పలు ప్రయోగాలు, మోడలింగ్‌ పద్ధతుల ద్వారా ధ్రువీకరించామని ప్రొఫెసర్‌ వాసన్‌ ప్రకటించారు. అంతేకాకుండా G-స్ట్రెయిన్‌ పరివర్తనానికి అనుగుణంగా వ్యాక్సిన్‌ను మార్చాల్సిన అవసరం కూడా లేదని ఆయన అన్నారు. వ్యాక్సిన్‌ అభివృద్ధిలో తాజా అధ్యయనం ఎంతో కీలకమని CSIRO చీఫ్‌ ల్యారీ మార్షల్‌ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా సురక్షిత, సమర్థ వ్యాక్సిన్‌కోసం జరుగుతోన్న ప్రయత్నాల్లో ఇదో ముందడుగు అని మార్షల్‌ స్పష్టంచేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని