‘మమతాజీ.. నిప్పుతో చెలగాటమాడొద్దు’

తాజా వార్తలు

Published : 11/12/2020 20:10 IST

‘మమతాజీ.. నిప్పుతో చెలగాటమాడొద్దు’

మమతా బెనర్జీ పాలన‌పై విరుచుకుపడ్డ గవర్నర్‌ ధన్‌కర్‌

కోల్‌కతా: భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ.నడ్డా కాన్వాయ్‌పై పశ్చిమబెంగాల్‌లో జరిగిన దాడి తీవ్ర వివాదానికి తెరలేపింది. ఈ ఘటనను చాలా తీవ్రంగా పరిగణిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆ రాష్ట్ర డీజీపీ, ప్రధాన కార్యదర్శికి సమన్లు జారీ చేసింది. తాజాగా ఆ రాష్ట్ర గవర్నర్‌ జగదీప్‌ ధన్‌కర్‌ మమతా బెనర్జీ పాలనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో రోజురోజుకీ శాంతిభద్రతల పరిస్థితి దిగజారుతోందని ఆరోపించారు. గురువారం జరిగిన ఘటన చాలా దురదృష్టకరమన్నారు. శాంతికి విఘాతం కలిగిస్తున్న వారికి.. పోలీసులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంలోని కొందరి మద్దతు ఉందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.

జేపీ.నడ్డా కాన్వాయ్‌పై దాడి జరిగిన తర్వాత ‘భాజపా నాటకాలడుతోంది’ అంటూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలను ధన్‌కర్‌ తీవ్రంగా ఖండించారు. ఆమె వెంటనే క్షమాపణలు చెప్పాలని కోరారు. బాధ్యతాయుత ముఖ్యమంత్రిగా వెంటనే తన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలన్నారు. ‘‘ప్రజాస్వామ్య వ్యవస్థకే మచ్చ తెచ్చే నిన్నటి ఘటన’’పై పూర్తి వివరాల్ని కేంద్రానికి పంపినట్లు గవర్నర్ తెలిపారు. అయితే, దాంట్లో ఏ విషయాలు ఉన్నాయనేది మాత్రం బయటకు చెప్పలేనన్నారు. సీఎం సైతం రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాల్సి ఉంటుందని హితవు పలికారు. శాంతి భద్రతల విషయంలో సీఎం నిప్పుతో చెలగాటమాడొద్దంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సంఘటన జరిగిన డైమండ్‌ హార్బర్‌లో రాజకీయ కార్యక్రమాలకు అనుమతివ్వాలని ఆ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే, ఎంపీలను కోరతానన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేయొద్దని హితవు పలికారు. 

తాను చేస్తున్న ఈ వ్యాఖ్యలు రాజ్యాంగబద్ధ హోదాలో ఉన్న ఓ వ్యక్తిగా మాత్రమే చేస్తున్నానని ధన్‌కర్‌ స్పష్టం చేశారు. తాను ఏ పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం లేదన్నారు. శాంతి-భద్రతలకు విఘాతం కలిగినప్పుడు గవర్నర్‌గా కలగజేసుకోవడం తన విధి అన్నారు. రాష్ట్రంలో శాంతి-భద్రతలు, ప్రజల హక్కులు, ప్రజాస్వామ్య విలువల్ని కాపాడడం తన బాధ్యతని పేర్కొన్నారు. 

జేపీ నడ్డా కాన్వాయ్‌పై గురువారం పశ్చిమ బెంగాల్‌లో రాళ్ల దాడి జరిగిన విషయం తెలిసిందే. ఉదయం కోల్‌కతా నుంచి 24 పరగణాల జిల్లాలోని డైమండ్‌ హార్బర్‌లో పార్టీ కార్యకర్తల సమావేశానికి వెళ్తుండగా సిరాకుల్‌ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మోటారు సైకిళ్లపై వచ్చిన దుండగులు ఇటుకలు, రాళ్లు, కర్రలు, ఇనుప రాడ్లతో కాన్వాయ్‌లోని వాహనాలపై దాడి చేస్తూ వెంబడించారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. నడ్డా బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనంలో ఉండటంతో ఎలాంటి గాయాలు కాలేదు. భాజపా నేతలు ముకుల్‌ రాయ్‌, కైలాశ్‌ వర్గియాతో పాటు ఓ సెక్యూరిటీ గార్డుకు గాయాలయ్యాయి. ఈ ఘటనపై స్పందించిన సీఎం మమతా బెనర్జీ.. భాజపా నేతలకు ఇలాంటి నాటకాలు అలవాటేనన్నారు. ప్రతిరోజూ వాళ్లపై వాళ్లే దాడులు చేసుకోవడం, దాన్ని తృణమూల్‌పై నెట్టడం మామూలైపోయిందన్నారు.

ఇదీ చదవండి...

నడ్డా కాన్వాయ్‌పై రాళ్ల దాడి

నడ్డా కాన్వాయ్‌పై దాడి: బెంగాల్‌ డీజీపీకి సమన్లు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని