close

తాజా వార్తలు

Published : 04/12/2020 14:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నాలుగేళ్ల తర్వాత మళ్లీ వస్తా

పార్టీ నేతలతో ట్రంప్‌ వ్యాఖ్యలు   
2024 ఎన్నికల్లో పోటీకి ఇప్పట్నుంచే సన్నాహాలు!

వాషింగ్టన్‌: ఓవైపు నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌ తన యంత్రాంగాన్ని ఇప్పటికే దాదాపు సిద్ధం చేసుకున్నా.. మరోవైపు ప్రతి కోర్టూ ఎన్నికల అక్రమాల గురించి తన వాదనను కొట్టివేస్తున్నా ట్రంప్‌నకు అధికారంపై ఆశలు సన్నగిల్లడం లేదు. తాను తిరిగి అధ్యక్ష పీఠం ఎక్కడం ఖాయమనే ఆయన ఇప్పటికీ నమ్ముతున్నారు. ఇప్పుడు కుదరని పక్షంలో మళ్లీ 2024లో బరిలోకి దిగే ఉద్దేశంతో ఉన్నారు. శ్వేతసౌధంలో బుధవారం నిర్వహించిన క్రిస్మస్‌ ముందస్తు వేడుకలో రిపబ్లికన్‌ నేతలతో ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనం. ‘‘ఈ నాలుగేళ్లు ఎంతో అద్భుతంగా గడిచాయి. మరో నాలుగేళ్ల పాలన కోసం ప్రయత్నిస్తున్నా. అది కుదరకపోతే.. నాలుగేళ్ల తర్వాత మిమ్మల్ని కచ్చితంగా కలుస్తా..’’ అంటూ ట్రంప్‌ ఆ సమావేశంలో పేర్కొన్నారు. ఆ కార్యక్రమానికి మీడియాను అనుమతించకపోయినా అందులో ట్రంప్‌ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది. 
అలా అయితేనే ఓటమి అంగీకరిస్తా: ట్రంప్‌
ఎన్నికల్లో తన ఓటమిని అంగీకరించేందుకు ససేమిరా అన్న ట్రంప్‌ ఇప్పుడు కాస్త బెట్టు సడలిస్తున్నట్లు కనిపిస్తోంది. ఎన్నికల ఫలితాలు కచ్చితమైనవే అయితే వాటిని స్వీకరించేందుకు సిద్ధమని తాజాగా ప్రకటించారు. ‘‘నేను ఎన్నికల్లో ఓడిపోయినా బాధపడను. కానీ అది సవ్యంగా నిర్వహించిన ఎన్నికల్లోనే జరగాలని కోరుకుంటున్నాను. అమెరికా ప్రజల నుంచి దొంగలించిన ఓటింగ్‌లో ఓడాలనుకోవడం లేదు. అందుకోసమే మేం దీనిపై పోరాడుతున్నాం. సవ్యంగా జరిగిన ఎన్నికల ఫలితాలను ఆమోదించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. బైడెన్‌ కూడా ఇదే చేస్తారని అనుకుంటున్నా’’ అని ట్రంప్‌ పేర్కొన్నారు. అర్హులైన ఓటర్ల బ్యాలెట్లు మాత్రమే లెక్కించాలన్నారు. గడువులోగా న్యాయబద్ధంగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు.
జనవరి 20నే ప్రచారానికి ముహూర్తం?
నూతన అధ్యక్షుడిగా బైడెన్‌ ప్రమాణం చేయబోయే జనవరి 20నే ట్రంప్‌ తన తదుపరి ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నారని మీడియా పేర్కొంటోంది. ఆ రోజు ఓ భారీ ర్యాలీని చేపట్టి ప్రజల దృష్టిని ఆకర్షించే యోచనతో ట్రంప్‌ ఉన్నారని తెలుస్తోంది. జనవరి 20పై ట్రంప్‌ గురిపెట్టడానికి మరో కారణముంది. తొలిసారి తన అధ్యక్ష అభ్యర్థిత్వానికి సంబంధించి 2017 జనవరి 20న అధికారికంగా దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేశారు. మళ్లీ అదే తేదీన రెండోసారి పీఠం ఎక్కడానికి ప్రచారాన్ని మొదలుపెడతారని సమాచారం.   


Tags :

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని