విశ్వవ్యాప్తంగా ఎంతమంది టీకా తీసుకున్నారంటే..!

తాజా వార్తలు

Published : 29/12/2020 19:36 IST

విశ్వవ్యాప్తంగా ఎంతమంది టీకా తీసుకున్నారంటే..!

21లక్షలతో అగ్రస్థానంలో అమెరికా

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ ధాటికి వణికిపోతోన్న ప్రపంచానికి వ్యాక్సిన్‌ ఒక ఆశాదీపంగా మారింది. ప్రయోగాలు పూర్తిచేసుకున్న వ్యాక్సిన్‌ల అత్యవసర వినియోగానికి అనుమతులు కూడా లభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్‌ పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటివరకు దాదాపు 16దేశాలు టీకా పంపిణీ మొదలుపెట్టగా, ఇప్పటివరకు 46లక్షల మంది వ్యాక్సిన్‌ డోసులను తీసుకున్నట్లు అంతర్జాతీయ వార్తా సంస్థలు వెల్లడిస్తున్నాయి.

అమెరికాలో 21లక్షల మందికి పంపిణీ..
కరోనా వైరస్‌ మహమ్మారి ధాటికి వణికిపోతున్న అగ్రరాజ్యం అమెరికాలో డిసెంబర్‌ 14న వ్యాక్సిన్‌ పంపిణీ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇప్పటికే అక్కడ కోటికి పైగా వ్యాక్సిన్‌ డోసులను వివిధ రాష్ట్రాలకు పంపిణీ చేశారు. ఇప్పటివరకు దాదాపు 21లక్షల మంది వ్యాక్సిన్‌ తొలి డోసు తీసుకున్నట్లు అమెరికా వ్యాధి నియంత్రణ నిర్మూలన కేంద్రం(సీడీసీ) వెల్లడించింది. కొవిడ్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అత్యవసర వినియోగం కింద ఫైజర్‌, మోడెర్నా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌లకు అమెరికా అనుమతి ఇచ్చింది. దీంతో అన్ని రాష్ట్రాల్లో వ్యాక్సిన్‌ పంపిణీ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు రెండు వ్యాక్సిన్‌ కంపెనీలకు చెందిన కోటి 14లక్షల డోసులను పంపిణీ చేయగా, 21లక్షల 27మంది తొలి డోసు తీసుకున్నట్లు సీడీసీ వెల్లడించింది.

చైనా, రష్యాల్లోనూ శరవేగంగా..
కరోనా వైరస్‌కు కారణమైన చైనా, వ్యాక్సిన్‌ పంపిణీలోనూ ముందుంది. ఇప్పటికే పదిలక్షల మందికి టీకా అందించినట్లు రెండు వారాల క్రితమే చైనా వెల్లడించింది. ఇక వుహాన్‌ వంటి నగరాల్లో భారీ స్థాయిలో వ్యాక్సిన్‌ పంపిణీ ప్రారంభించిన చైనా, ఫిబ్రవరి నాటికే దాదాపు 5 కోట్ల మందికి వ్యాక్సిన్‌ ఇచ్చే ప్రక్రియను పూర్తిచేయాలని భావిస్తోంది. కరోనా వ్యాక్సిన్‌ను తొలిసారిగా రిజిస్టర్‌ చేసుకున్న రష్యా కూడా వ్యాక్సిన్‌ పంపిణీని వేగంగా కొనసాగిస్తోంది. ఇప్పటికే అక్కడ దాదాపు 5లక్షల మంది వ్యాక్సిన్‌ తీసుకున్నట్లు సమాచారం. అయితే, ప్రయోగాలు పూర్తికాకముందే పంపిణీ మొదలుపెట్టడంతో రష్యన్లు వ్యాక్సిన్‌ తీసుకునేందుకు అంతగా ఆసక్తి చూపడం లేదనే వాదన కూడా ఉంది.

వ్యాక్సిన్‌ పంపిణీ ప్రారంభించిన ఇజ్రాయెల్‌లో ఇప్పటికే దాదాపు 3లక్షల మంది టీకా తీసుకున్నట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. బహ్రెయిన్‌, కెనడా, జర్మనీ, చిలీ, మెక్సికో, వంటి దేశాల్లోనూ వ్యాక్సిన్‌ పంపిణీ కొనసాగుతోంది. అత్యవసర వినియోగానికి అనుమతించిన ఈయూలోని దాదాపు 27సభ్యదేశాలు వ్యాక్సిన్‌ పంపిణీని తాజాగా ప్రారంభించాయి. భారత్‌లోనూ మరికొన్నిరోజుల్లోనే వ్యాక్సిన్‌కు అనుమతి లభించే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు వెల్లడిస్తున్నారు.

ఇదిలావుంటే, అమెరికాలో ఇప్పటివరకు కోటి 90లక్షల కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ప్రభుత్వం వెల్లడించింది.  నిత్యం కొత్తగా దాదాపు లక్షన్నర కేసులు, వెయ్యికిపైగా మరణాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటివరకు అమెరికాలో కరోనా సోకినవారిలో 3,32,246మంది మృత్యువాతపడ్డారు.

ఇవీ చదవండి..
అమెరికాలో మున్ముందు మరిన్ని చీకటి రోజులు!
మనసు మార్చుకున్న ట్రంప్‌ 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని